
జమైకా : కుమారుడితో కలిసి విమానప్రయాణం చేస్తున్న ఓ మహిళా డాక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఉక్కపోత కారణంగా ఆమె సౌకర్యవంతమైన దుస్తులు ధరించడంతో ఫ్లైట్ ఎక్కేదిలేదంటూ విమాన సిబ్బంది అడ్డుచెప్పారు. హోస్టన్‌లో నివాసముండే డాక్టర్ తిషా రోయి స్వదేశం జమైకాలో వారంరోజులు పర్యటించి తన ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి అమెరికాకు తిరుగుపయనమయ్యారు. వేడి వాతావరణం కారణంగా ఒళ్లంతా చెమటపట్టడంతో ఆమె సౌకర్యవంతంగా డ్రెస్సింగ్ చేసుకుని విమానం ఎక్కేందుకు వెళ్లారు. అయితే, ఆమె డ్రెస్ అభ్యంతరకరంగా ఉందని, పైన జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ సిబ్బంది తెగేసి చెప్పారు. అప్పటికే ఫ్లైట్ టేకాఫ్‌కు సమయం దగ్గర పడటంతో.. తన దగ్గర జాకెట్ లేదని.. కనీసం ఓ దుప్పటైనా ఇవ్వండని తిషా సిబ్బందిని కోరింది.
ఫ్లైట్ సిబ్బంది ఎలాంటి సాయం చేయకపోగా మరింత కటువుగా మాట్లాడారు. దాంతో చేసేదేంలేక తిషా, ఆమె కుమారుడు వెనుదిరిగారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని... డాక్టర్‌కు ఫ్లైట్ చార్జీలు రిఫండ్ చేస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ చెప్పింది. తనకెలాంటి రిఫండ్ ఇవ్వలేదని, నల్లజాతీయురాలిని కాబట్టే తన దుస్తులపై అనవసర రాద్దాంతం చేశారని తిషా ఆరోపించారు. తనలాగే డ్రెస్ చేసుకున్న మరో మహిళను ప్రయాణానికి అనుమతించారని విమర్శించారు. తనపట్ల జాతి, లింగ వ్యతిరేకత చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఫ్లైట్ ఎక్కేముందు దిగిన ఫొటోను ఆమె ట్విటర్‌లో షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment