సాక్షి, హైదరాబాద్ : ఇద్దరూ చేసేది ఒకటే పని, ఒకటే శ్రమ.. కానీ వేతనం దగ్గరకొచ్చేసరికి మాత్రం ఎంతో వ్యత్యాసం.. పంటపొలాల్లో శారీరక శ్రమ చేసే మహిళల దగ్గర్నుంచి కార్పొరేట్ సంస్థల్లో సీఈవోల వరకు రంగం ఏదైనప్పటికీ వేతనాల్లో వివక్ష చాలా ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని ఎన్నో అధ్యయనాలు ఎప్పటికప్పుడు గణాంకాలతో సహా బయటపెడుతూనే ఉన్నాయి. పురుషులతో సమానంగా మహిళలకు సమాన వేతనం ఇవ్వడం లేదంటూ బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ వివక్షపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఇప్పుడు తాజాగా ఇంటర్నెట్‌లో పేమీటూ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ఉద్యమమే మొదలైంది. బ్రిటన్‌లో స్త్రీ,పురుష వేతనాల్లో వ్యత్యాసాలను బయటపెట్టడానికి, తమ శ్రమ ఎంత దోపిడికి గురవుతోందో మహిళల్లో చైత్యన్యం తీసుకురావడానికి, మహిళలకు ఎందుకు సమానంగా వేతనాలు ఇవ్వడం లేదంటూ యాజమాన్యాలను నిలదీయడానికి లేబర్ పార్టీకి చెందిన ఎంపీ స్టెలా క్రీజీ నేతృత్వంలో కొందరు ఎంపీలు పే మీటూ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. పేమీటూ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించడమే కాదు, సోషల్ మీడియాలో కూడా దీనిపై విస్తృతంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
250కి పైగా ఉద్యోగులు ఉన్న ప్రైవేటు కంపెనీలన్నీ ఒక గంట పనికి మహిళలకు, పురుషులకు చెల్లించే వేతనాల్లో ఎంత వ్యత్యాసం ఉందో తప్పనిసరిగా బయటపెట్టాలంటూ బ్రిటన్ కొత్తగా చట్టం చేసింది. ఇందుకోసం ఏప్రిల్ 4వ తారీకున డెడ్‌లైన్ విధించింది.. దీంతో చాలా కంపెనీల్లో మహిళలపై కొనసాగుతున్న వేతన వివక్ష వెలుగులోకి వచ్చింది.
వేతనాల్లో తేడా ఎంత ?
బ్రిటన్‌లో పురుషుల, మహిళల వేతనాల్లో వ్యత్యాసం భారీగా ఉంది. మహిళలు అత్యధికంగా పనిచేసే రిటైల్ రంగంలో వేతనాల్లో వ్యత్యాసం ఏకంగా 50శాతం ఉంది. ఇక శ్రామిక రంగంలో 18 శాతం, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో 59శాతం వేతనాల్లో వ్యత్యాసం ఉంది. మొత్తంగా 78 శాతం కంపెనీల్లో మహిళల కంటే పురుషుల వేతనాలే ఎక్కువ.. అటు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మహిళల వేతనాల్లో వివక్ష ఉందని తేటతెల్లమైంది. తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్థల గణాంకాలను పరిశీలిస్తే ఒకే హోదాలో పనిచేసే పురుషుల కంటే మహిళలకు 14 శాతం వేతనం తక్కువగా వస్తోంది. తన తోటి పురుష ఎంపీకన్నా తనకి 10 వేల పౌండ్ల వేతనం తక్కువ వస్తోందని ఎంపీ ట్యూలిప్ సిద్దిక్ ఆవేదన వ్యక్తం చేయడం అక్కడ పరిస్థితుల్ని తేటతెల్లం చేస్తోంది.
ఉద్యమానికి భారీగా మద్దతు
వేతనాల్లో వ్యత్యాసాన్ని అంకెల రూపంలో బయటపెట్టేలా ప్రైవేటు కంపెనీలపై ఒత్తిడి పెంచడమే కాకుండా, ఆ తర్వాత సమాన వేతనం కోసం ఎలా పోరాటం చేయాలన్నదానిపై కార్యాచరణ రూపొందించం కోసం పేమీటూ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఈ ఉద్యమానికి పార్టీలకతీతంగా అందరి మద్దతు లభిస్తోంది. ప్రజాప్రతినిధులే స్వయంగా ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టడంతో తక్కువ వేతనం తీసుకుంటూ ఏమీ చేయలేని నిస్సహాయంగా ఉండిపోయే మహిళల్లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టడానికి అవకాశం లభించినట్టయింది.
ఈ ఉద్యమం ద్వారా మహిళలకు రుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా పార్లమెంటులో చర్చకు పెడతామని ఎంపీ స్టెల్లా క్రీజీ చెబుతున్నారు.‘ వేతనాల్లో వ్యత్యాసాలపై బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కితే తమ కెరీర్‌పై ఎక్కడ ప్రభావం చూపిస్తోందని చాలా మంది మహిళలు భయపడే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. వారిలో ఆ భయాందోళనలను తగ్గించి వారికెదురైన అనుభవాలు చెబితే పార్లమెంటు వేదికగా వారి సమస్యల్ని పరిష్కరించగలమని‘ క్రీజీ చెప్పుకొచ్చారు.
మహిళా ఉద్యోగులకు సూచనలు
వేతనాల్లో వ్యత్యాసం ఎంత ఉందో తెలుసుకోవడమే కాదు, అలా ఎందుకు వివక్ష చూపిస్తున్నారంటూ యాజమాన్యాలను ప్రశ్నిద్దాం అంటున్నారు బ్రిటన్ ఎంపీలు. భవిష్యత్ కార్యాచరణపై మహిళా ఉద్యోగులు ఏం చెయ్యాలో చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని సూచనలు చేశారు.
- మీ సంస్థలో పనిచేసే తోటి పురుషులకు ఎంత జీతం వస్తోందో కనుక్కోండి
- వేతనాల్లో వ్యత్యాసాలను తగ్గించడానికి యాజమాన్యాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో తెలుసుకోండి.
- జెండర్ పే గ్యాప్‌కు సంబంధించిన యూనియన్లలో చేరండి. ఇప్పటికే యూనియన్ సభ్యులైతే వేతనాల్లో వ్యత్యాసాలను తగ్గించేలా యాజమాన్యాలపై ఒత్తిడి పెంచడానికి వాళ్లేం చేస్తున్నారో అడిగి తెలుసుకోండి.
- ప్రతీ కంపెనీలో మహిళా నెట్‌వర్క్‌లను ప్రారంభించండి. పోరాటాన్ని ఉధృతం చేయండి.
- వేతనంలో వ్యత్యాసంపై మీ అనుభవాలను పేమీటూ సర్వేలో పంచుకోండి. అప్పుడే సమాన వేతనాలు లభించేలా పార్లమెంటులో పోరాడేందుకు అవకాశం ఉంటుందని ఎంపీలు చెబుతున్నారు.
భారత్‌లో పరిస్థితి ఎలా ఉంది ?
అటు భారత్‌లో కూడా వేతనాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది.. ఒకే హోదాలో, ఒకే పనిచేస్తున్న పురుషుల కంటే మహిళల వేతనాలు 20 శాతం తక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. రెండేళ్ల క్రితం నాటితో పోల్చి చూసే పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ సమాన వేతనం అన్నది ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. పనిచేసే కార్యాలయాల్లో సీనియారిటీ, అనుభవం పెరిగిన కొద్దీ మహిళలకొచ్చే వేతనం తగ్గిపోతోంది. ఉద్యోగాల్లో రెండేళ్ల అనుభవం ఉన్న పురుషులకి, మహిళల కంటే 8శాతం వేతనం ఎక్కువగా వస్తే, పదకొండేళ్ల ఉద్యోగ అనుభవం ఉన్న పురుషులు మహిళల కంటే ఏకంగా 25శాతం ఎక్కువ వేతనం లభిస్తోంది. సమాన హక్కుల కోసం మహిళలు చేస్తున్న పోరాటంలో ఇప్పుడు ఈ పేమీటూ ఉద్యమం మరో ముందడుగేనన్న ఆశ అందరిలోనూ కలుగుతోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment