సెల్‌ఫోన్ నీళ్లలో పడితే ఏమౌవుతుంది. వెంటనే అది పనిచేయడం మానేస్తుంది. కానీ నీళ్లలో పడి 15 నెలల తర్వాత దొరికిన ఫోన్ పనిచేస్తుందంటే మీరు నమ్మగలరా? ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ ఇది నిజం. అమెరికా యూట్యూబర్ మైఖేల్ బెన్నెట్ ఈ విషయాన్ని బయపెట్టారు. ‘నుజెట్‌నొగిట్’ యూట్యూబ్ చానల్‌లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
మైఖేల్ బెన్నెట్ తన స్నేహితులతో కలిసి దక్షిణ కరోలినాలోని ఎడిస్టో నదిలో వెతుకుతుండగా పౌచ్‌లో ఉంచిన ఐఫోన్ వారి కంటపడింది. దీన్ని ఇంటికి తీసుకొచ్చి పౌచ్‌లోంచి బయటకు తీసి చూశారు. ఫోన్ స్విచ్చాఫ్ అయిపోవడంతో ఇది పనిచేయడం లేదేమో అనుకున్నారు. చార్జింగ్ పెట్టి స్విచాన్ చేయగా అది పనిచేస్తున్నట్టు గుర్తించడంతో మైఖేల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడితో ఆగిపోకుండా ఆ ఫోన్ పోగొట్టుకున్న మహిళ ఎరికా బెన్నెట్‌ను గుర్తించి ఆమెకు భద్రంగా అందజేశాడు.
పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో ఎరికా బెన్నెట్ ఉద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి బతికున్నప్పుడు తనకు పంపిన అమూల్యమైన మెజేస్‌లు ఈ ఫోన్‌లో ఉన్నాయని ఆమె వెల్లడించారు. తండ్రి జ్ఞాపకాలు తిరిగి వచ్చినందుకు ఆమె కళ్ల నుంచి ఆనంద భాష్ఫాలు వచ్చాయి. సెప్టెంబర్ 26న షేర్ చేసిన ఈ వీడియోకు లక్షా 30 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘ఈ ఫోన్ చాలా గొప్పది. ఇందులో ఉన్న సందేశాలు అమూల్యం. తండ్రి జ్ఞాపకాలను పదిలంగా కూతురికి అందించిన ఈ ఫోన్‌కు వెల కట్టలేం’ అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. మైఖేల్ బెన్నెట్‌కు యూట్యూబ్‌లో 7.4 లక్ష మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment