జగిత్యాల: గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు ప్రసవాలకు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ ప్రాంతాలకు రావాలంటే ఖర్చుతో కూ డుకున్న పని. దీంతో ప్రభుత్వం గర్భిణుల కోసం 108, 104 మాదిరిగా.. 102 వాహనాలను ఏర్పాటుచేసింది. అమ్మ ఒడి పథకంలో భాగం గా వీటిని ప్రారంభిస్తున్నారు. దీంతో జిల్లాలోని గర్భిణులు, బాలింతలకు ఊరట కలగనుంది. గర్భిణులకు బాసటగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్‌తోపాటు అమ్మ ఒడి పథకం కింద నగదు ప్రోత్సాహకాలు అందజేస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధిక శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. ఉచితంగానే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అమ్మ ఒడి పథకం కింద గర్భిణుల కోసం సర్కార్ మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. వారి ఇళ్ల నుంచి ఆస్పత్రులకు తీసుకొస్తూ ప్రసవం అనంతరం తిరిగి బాలింతలను ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేకంగా 102 వాహనాలను సమకూర్చనుంది. జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకు సుమారు వెయ్యికి పైగానే నమోదవుతున్నాయి.
ఆస్పత్రిలో కాల్‌సెంటర్ ఏర్పాటు..
జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో గర్భిణులు ఎంతమంది ఉన్నారో నమోదు చేసుకుని వారి సమయాన్ని బట్టి సిబ్బంది ఫోన్ చేసి వారిని 102 వాహనం ద్వారా తీసుకురానున్నారు. ప్రతి గ్రామానికి వెళ్లి తీసుకొస్తారు. ఆరోగ్య పరిస్థితుల గురించి ఫోన్ చేసి తెలుసుకోనున్నారు. త్వరలో ఆస్పత్రిలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.
త్వరలో ప్రారంభం..
జిల్లాకు 102 వాహనాలను ఆరు కేటాయించారు. నియోజకవర్గానికి 2 చొప్పున మూడు నియోజకవర్గాలకు కేటాయించనున్నారు. 102 వాహనాలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంతో మేలు..
102 వాహనాలతో గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణులను తీసుకువచ్చి ప్రసవం అనంతరం మళ్లీ గ్రామాల్లో దింపివేస్తారు. 108, 104 మాదిరిగానే 102 వాహనాలు పనిచేస్తాయి. ఎలాంటి ఖర్చులు ఉండవు. ఉచితంగానే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తారు.
– సుగంధిని, డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment