governament hospital
-
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో మమతా అనే బాలింత మృతి
-
ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరిన కలెక్టర్ భార్య
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి.. ప్రసవం కోసం మంగళవారం రాత్రి భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. రాత్రి 12 గంటల సమయానికి ఆమెను కుటుంబసభ్యులు దవాఖానాకు తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది వివిధ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల వైద్యసేవలు మెరుగవగా.. ప్రజల్లో మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్ తన సతీమణిని చేర్పించారని కుటుంబసభ్యులు తెలిపారు. -
పిచ్చోడి వీరంగం.. రోడ్డుపై, ఆస్పత్రిలో రచ్చ రచ్చ
గుత్తి: గుత్తిలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. అతను విసిరిన రాయి తగిలి ఎన్టీపీసీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత అతన్ని స్థానికులు చితకబాదగా గాయాలు కావడంతో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా వీరంగం సృష్టించాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పామిడి మండలం పాల్యం తండాకు చెందిన మునినాయక్ గుత్తి సమీపంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) సబ్ స్టేషన్లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం స్వగ్రామం నుంచి బైక్‌పై సబ్‌స్టేషన్‌కు బయలుదేరారు. గుత్తి శివారులోని ఎస్కేడీ ఇంజినీరింగ్ కళాశాల వద్దకు చేరుకోగానే ఓ పిచ్చోడు అకారణంగా విసిరిన రాయి మునినాయక్‌ను బలంగా తాకింది. దీంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిన ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో వీరంగం..: ఎన్టీపీసీ ఉద్యోగిపై దాడి చేసిన పిచ్చోడిని స్థానికులు చితకబాదారు. అనంతరం గాయపడిన అతన్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు, స్టాఫ్‌నర్సులు చికిత్స చేస్తుండగా అతను మరోసారి రెచ్చిపోయాడు. సెలైన్ స్టాండ్ తీసుకుని వైద్య సిబ్బందిపై దాడికి యత్నించడంతో అంతా చెల్లాచెదురయ్యారు. అద్దాలను ధ్వంసం చేశాడు. అతి కష్టంపై కొందరు యువకుల సాయంతో పోలీసులు అతన్ని పట్టుకుని, కాళ్లూచేతులు కట్టేసి చికిత్స చేయించారు. అతని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. తనది హైదరాబాద్ అని మాత్రమే చెప్పి, ఆ తర్వాత కేకలు వేస్తూ దాదాపు ఐదు గంటల పాటు ఆస్పత్రిలో వీరంగం సృష్టించాడు. -
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు చేయించాలి
మోర్తాడ్(బాల్కొండ) : ప్రభుత్వ ఆస్పత్రిలోనే నూటికి 95 శాతం ప్రసవాలు చేయించుకునేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్ సూచించారు. మోర్తాడ్‌లోని కమ్యూనిటీ ఆస్పత్రిలో మంగళవారం భీమ్‌గల్, కమ్మర్పల్లి, చౌట్పల్లి, వేల్పూర్ పీహెచ్‌సీల పరిధిలోని వైద్యు లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్టును ఉచితంగా అందిస్తుందని తెలిపారు. గర్భిణులకు ఎన్నో విధాలుగా ప్రయోజనాలను కల్పిస్తున్నందున ప్రసవాలు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలతో పాటు సిజేరియన్ ప్రసవా లు కూడా జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా బాలింతలు ఆరుగురికి కేసీఆర్ కిట్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ వైద్యాధికారి శివశంకర్, వైద్యులు శ్రీకాంత్, లక్ష్మి, జ్యోతి, డీపీఎంవో వనాకర్ రెడ్డి, పీహెచ్ఎన్ మీరాబాయి, ఎస్వోవో శ్రీనివాస్, యూడీసీ సురేందర్, సీహెచ్‌వో దేవన్న, ఇతర సిబ్బంది ఆడెపు ప్రభా కర్, హరిత, సత్యనారాయణ, గోవర్ధన్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశ చూపినా లేని స్పందన
తల్లాడ పీహెచ్సీలో ప్రతి నెలా నలుగురికి తగ్గకుండా ప్రసవాలు జరగాల్సి ఉంది. బర్త్ ప్లానింగ్ ద్వారా మోటివేషన్ చేయాల్సి ఉండగా అలా జరగటం లేదు. ఎనిమిది నెలల్లో ఏడు ప్రసవాలు మాత్రమే జరిగాయి. అందులో ఒకటి డెత్ కావటంతో వివాదాస్పదం అయ్యింది. ఎనిమిది నెలల్లో మొత్తం 32 మంది ప్రసవాలు జరగాల్సి ఉండగా ఏడుగురు మాత్రమే ఆస్పత్రికి వచ్చారు. ఒక్కో నెలలో అసలు ఆస్పత్రిలో ప్రసవాలు లేకుండా పోయాయి. వైద్య సిబ్బంది ప్రచార లోపం కారణంగా ప్రసవాలు చేయడంలో తల్లాడ పీహెచ్సీ లక్ష్యాన్ని చేరుకోలేక పోతోందనే విమర్శలు విన్పిస్తుయింన్నాయి. దీంతో గర్భిణులు ప్రతి నెలా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ సలహాల మేరకు పరీక్షలు చేయించుకున్నారు. నెలలు నిండి నొప్పులు వచ్చినప్పటికీ.. వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికే వెళ్తున్నారు తప్పా ప్రభుత్వ ఆస్పత్రులకు రావడం లేదు. అప్పులు చేసి మరీ అక్కడే వైద్యం చేయిస్తున్నారు. ఏఎన్ఎంల కొరత.. మండలంలో పది సబ్ సెంటర్లుండగా.. ఏడు సబ్‌సెంటర్లకు మాత్రమే ఏఎన్ఎంలు ఉన్నారు. కుర్నవల్లి, మిట్టపల్లి, మల్లవరం సబ్ సెంటర్లకు అసిస్టెంట్ ఏఎన్ఎంలే ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఏఎన్ఎంలు ఉన్నా మండల కేంద్రం, జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. ప్రభావం చూపని కేసీఆర్ కిట్.. తల్లీ బిడ్డల క్షేమం కోసం ప్రభుత్వం 2017 జూన్ 2న ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం అంతగా ప్రభావం చూపలేదు. గ్రామాల్లో ఈ పథకం గురించి ప్రచారం చేయాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపైనే ఉంది. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు తల్లి అకౌంట్లో నాలుగు విడతులుగా జమ చేస్తారు. డెలీవరీ సమయంలో రూ.2 వేలు విలువైన కేసీఆర్ కిట్ అందజేస్తారు. అయినప్పటికీ పేదలు కూడా ఆస్పత్రి రావడం లేదు. ఇప్పటి వరకు తల్లాడ సీహెచ్‌సీలో ఆరుగురు మాత్రమే కేసీఆర్ కిట్ అందుకున్నారు. తల్లాడ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాల్సి ఉంది. తల్లీ బిడ్డల క్షేమం కోసం ప్రభుత్వం.. సంక్షేమ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రభుత్వం నుంచి వారికి కిట్‌ను కూడా అందజేస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం కన్పించడం లేదు. పథకం ఉద్ధేశం మంచిదే అయినా.. దానిని అమలు చేయడానికి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అంతగా లేవు. దీంతో వైద్య సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంలో విఫలం చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగాల్సిన ప్రసవాలు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. పేద కుటుంబాలకు చెందిన వారు అప్పులు చేసి వేలాది రూపాయలను ప్రైవేట్ ఆస్పత్రుల పరం చేస్తున్నారు. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో అధికారులు, పాలకులే ఒక్కసారి ఆలోచించాలి. తల్లాడ పీహెచ్సీలో ప్రసవానికి ఎవరూ ముందుకు రావడం లేదు. గర్భిణులు ప్రతి నెలా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ సలహాల మేరకు పరీక్షలు చేయించుకుంటున్నారు. నెలలు నిండినా.. నొప్పులు వచ్చినా.. వెంటనే అదే డాక్టర్ వద్దకు వెళ్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల అవసరం ఉన్నా, లేకున్నా సిజేరియన్ చేయించుకొని డబ్బులు ముట్టజేబుతున్నారు సంఖ్యను పెంచుతాం.. సీహెచ్‌సీలోనే ప్రసవాలు జరిగేందుకు ప్రచారం నిర్వహిస్తున్నాం. కేసీఆర్ కిట్టుపై అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైన బెడ్లు, థియేటర్ ఇక్కడున్నాయి. ఇక నుంచి ఖచ్చితంగా అన్ని కాన్పులు ఇక్కడే జరుగుతాయి. సిజేరియన్ చేసే పరిస్థితి ఇక్కడలేక పోవంటంతో.. కొంత వెనుకాడుతున్నాం. గర్భిణుల అవసరాన్ని బట్టి ఖమ్మం ఆస్పత్రికి, కల్లూరు ఆస్పత్రికి తరలిస్తున్నాం. – ఐ.సృజన, మండల వైద్యాధికారి -
గర్భిణులకు మరో వరం
జగిత్యాల: గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు ప్రసవాలకు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ ప్రాంతాలకు రావాలంటే ఖర్చుతో కూ డుకున్న పని. దీంతో ప్రభుత్వం గర్భిణుల కోసం 108, 104 మాదిరిగా.. 102 వాహనాలను ఏర్పాటుచేసింది. అమ్మ ఒడి పథకంలో భాగం గా వీటిని ప్రారంభిస్తున్నారు. దీంతో జిల్లాలోని గర్భిణులు, బాలింతలకు ఊరట కలగనుంది. గర్భిణులకు బాసటగా నిలవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్‌తోపాటు అమ్మ ఒడి పథకం కింద నగదు ప్రోత్సాహకాలు అందజేస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధిక శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. ఉచితంగానే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అమ్మ ఒడి పథకం కింద గర్భిణుల కోసం సర్కార్ మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. వారి ఇళ్ల నుంచి ఆస్పత్రులకు తీసుకొస్తూ ప్రసవం అనంతరం తిరిగి బాలింతలను ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేకంగా 102 వాహనాలను సమకూర్చనుంది. జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకు సుమారు వెయ్యికి పైగానే నమోదవుతున్నాయి. ఆస్పత్రిలో కాల్‌సెంటర్ ఏర్పాటు.. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో గర్భిణులు ఎంతమంది ఉన్నారో నమోదు చేసుకుని వారి సమయాన్ని బట్టి సిబ్బంది ఫోన్ చేసి వారిని 102 వాహనం ద్వారా తీసుకురానున్నారు. ప్రతి గ్రామానికి వెళ్లి తీసుకొస్తారు. ఆరోగ్య పరిస్థితుల గురించి ఫోన్ చేసి తెలుసుకోనున్నారు. త్వరలో ఆస్పత్రిలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. త్వరలో ప్రారంభం.. జిల్లాకు 102 వాహనాలను ఆరు కేటాయించారు. నియోజకవర్గానికి 2 చొప్పున మూడు నియోజకవర్గాలకు కేటాయించనున్నారు. 102 వాహనాలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో మేలు.. 102 వాహనాలతో గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణులను తీసుకువచ్చి ప్రసవం అనంతరం మళ్లీ గ్రామాల్లో దింపివేస్తారు. 108, 104 మాదిరిగానే 102 వాహనాలు పనిచేస్తాయి. ఎలాంటి ఖర్చులు ఉండవు. ఉచితంగానే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తారు. – సుగంధిని, డీఎంహెచ్‌వో -
అనంతపురంలో పడకేసిన వైద్యం
-
ఆడ శిశువు అని వదిలివెళ్లారు!
నిజామాబాద్: ఆడ శిశువు పుట్టిందని వదిలించుకున్నారు. ఎక్కడో ప్రసవిస్తే తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రి గడపలో వదిలివెళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్ నగరంలో వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రవేశ మార్గం వద్ద శనివారం ఉదయం వదిలి వెళ్లారు. అయితే ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఆ శిశువును గమనించి ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. ఈ శిశువు వేరే ఆస్పత్రిలో జన్మించినట్లు ప్రభుత్వాస్పత్రి అధికారులు గుర్తించారు. శిశువును ఎవరు వదిలివెళ్లారనే దానిపై ఆరా తీస్తున్నారు. -
సర్వజనాస్పత్రిలో కూలిన రూఫింగ్
ఎక్స్‌రే టెక్నీషియన్‌కు గాయాలు అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఎక్స్‌రే గదిలో ఆదివారం రాత్రి రూఫింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఎక్స్‌రే టెక్నీషియన్ నరసింహులు తలకు గాయమైంది. అదృష్టవశాత్తు ఈ సమయంలో ఎక్స్‌రే తీయించుకోవడానికి ఎవరూ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాత్రి విధులు నిర్వర్తిస్తున్న నరసింహులు ఎక్స్‌రే గదిలోనే భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి వెళ్తుండగా ఒక్కసారిగా పైకప్పు ఊడి పడింది. కడ్డీలు తలపై పడడంతో స్వల్పగాయమైంది. విషయం తెలియగానే డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మన్న హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఎలక్ట్రీషియన్లను పిలిపించి మాట్లాడారు. సోమవారం ఉదయాన్నే విద్యుత్ సరఫరాను నిలిపివేసి పనులు చేయాలని సూచించారు. ఓపీ ప్రారంభం సమయానికి గదిలో ఎక్స్‌రే పనులకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. కాగా రూఫింగ్ పనులు నాసిరకంగా చేపట్టడంతోనే ఈ ఘటన జరిగినట్లు స్పష్టమవుతోంది. -
మార్చురీలో సౌకర్యాల పెంపుపై దృష్టి
ఏలూరు అర్బన్: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో నాణ్యమైన చికిత్సలు, వైద్య సేవలు అందించే అంశంతో పాటు మార్చురీలో çకూడా సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ అన్నారు. బుధవారం ఆయన ఆస్పత్రి ఆవరణలోని మార్చురీని పరిశీలించారు. ఫ్రీజర్ బాక్సులు, పీఎం గది, డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. మార్చురీలో ఏ ఇబ్బంది కలిగినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మృతుల కుటుంబసభ్యులతో మానవతా దృక్పథంతో మెలగాలన్నారు. -
పిచ్చికుక్క దాడిలో గాయపడిన చిన్నారి మృతి
పెనుమదం(పోడూరు) : పెనుమదం గ్రామంలో కొద్దిరోజుల కిందట పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన రెండున్నరేళ్ల చిన్నారిS ధనాల రిషిత కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. గత నెల 9న పెనుమదం గ్రామంలో ఆరుగురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేసింది. గ్రామానికి చెందిన ధనాల వెంకటచంటి, పుష్ప దంపతుల కుమార్తె రిషిత ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చిన్నారికి యాంటీ రాబిస్ ఇంజక్షన్లు చేయించారు. ఈ నేపథ్యంలో గతనెల 25న రిషిత ఆరోగ్యం విషమించడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బాలిక మృతిచెందినట్టు బంధువులు తెలిపారు. -
జిల్లాపై జ్వరాల పంజా
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిన వార్డులు గంట గంటకు పెరుగుతున్న రోగుల సంఖ్య మంకమ్మతోట : జ్వరాలతో జిల్లా వణుకుతోంది. బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్కడ చూసినా యువకులు, పిల్లలు, వృద్ధులు అని తేడాలేకుండా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. రోజురోజుకు ఓపీతోపాటు ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 600లకు పైగా ఇన్ పేషెంట్లుగా ఉండగా ఓపీ 800లకు దాటుతోంది. ఇవేకాకుండా ఎమర్జెన్సీ సేవలు రోజుకు ఓపీ 100, ఇన్‌పేషెంట్లు మరో 50వరకు చేరుతున్నారు. వీరంతా విషజ్వరాలతో బాధపడుతున్న వారే. ఆస్పత్రిలోని మేల్, ఫిమేల్ వార్డుతోపాటు పిల్లల వార్డు కూడా రోగులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. వార్డుల్లోని బెడ్లు నిండిపోవడంతో వరండాల్లో వందకు పైగా అదనగా తాత్కాలిక బెడ్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. ఇవి కూడా చాలక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెడ్లు లేకపోవడంతో ఖాళీ అయ్యే వరకు పడిగాపులు కాస్తున్నారు. గంగాధర మండలం ఉప్పరిమల్యాలకు చెందిన జవ రాజిరెడ్డి(55) 12రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరం కారణంగా శ్వాసతీసుకోవడం కష్టంగా మారి నిలుబడటానికి ఒంట్లో శక్తి లేదు. స్థానికంగా వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో పరీక్షలు చేయించారు. విషజ్వరం కారణంగా ప్లేట్లేట్ తగ్గిపోయాయని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అక్కడి వైద్యుల సూచించారు. అక్కడి నుంచి 108లో ఆస్పత్రికి వచ్చాడు. రిపోర్టు పరిశీలించిన డాక్టర్ బెడ్‌పై ఉండాలని రాశాడు. అక్కడ నుండి పై అంతస్తులోని మేల్ వార్డుకువచ్చాడు. అక్కడ బెడ్లు ఖాళీ లేవని సిబ్బంది తెలుపడంతో రెండుగంటలు వరండాలో వేచిఉన్నాడు. ప్లేట్లేట్స్ తగ్గిపోయాయి – పతంగి శివకృష్ణ నేను పది రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్నా. వ్యాధి నిర్ధారణలో డెంగీ అని చెప్పారు. బెడ్లు ఖాళీ లేవని వరండాల్లో వేశారు. మూడు రోజులు అవుతున్నా వరండా నుంచి వార్డులోకి మార్చడం లేదు. దోమలతో ఇబ్బంది పడుతున్న. ఆస్పత్రి దుర్భరంగా ఉంది – సాగర్ల మహేందర్, బెగులూరు ప్రభుత్వ ఆస్పత్రి వాతావరణం దుర్భరంగా ఉంది. మ ఊరంతా జ్వరాలే. అందరూ ఆస్పత్రుల్లో చేరారు. డబ్బులున్న వారు ప్రైవేటు ఆస్పత్రులో వైద్యం చేయించుకుంటున్నరు. మా బంధువులను ఇక్కడ చేర్పించిన ఐదు రోజులు అవుతున్నా పరిస్థితిలో మార్పులేదు. ప్లేట్లేట్ 17వేలు మాత్రమే ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. -
రైతును బలిగొన్న వరికోత యంత్రం
అమరచింత, న్యూస్‌లైన్ : రైతులకు ఆసరాగా ఉంటూ కోతల సమయాల్లో కూలీల కంటే అధిక వేగంతో పనిచేసే వరికోత యంత్రమే ఆ రైతు పాలిట మృత్యుశకటంగా మారింది. బ్యాంకు పని నిమిత్తం పట్టణానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై కుమారుని వెంట వెళుతుండగా వరికోత యంత్రం ఢీకొనడంతో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. నర్వ మండలం లంకాలకు చెందిన బాలయ్య (65) కు సమీపంలో ఐదెకరాల పొలం ఉంది. అందులో వరి పంటను సాగు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది బ్యాంకులో తీసుకున్న రుణం వివరాలను తెలుసుకునేందుకుగాను బుధవారం ఉదయం అమరచింతలోని ఆంధ్రాబ్యాంకుకు తన కుమారుడు చెన్నయ్యతో కలిసి బైక్‌పై వచ్చాడు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో అమరచింత బస్టాప్ కూడలిలోకి చేరుకోగానే వరికోత యంత్రం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఓ ఆటోలో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ షేక్‌గౌస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా బాలయ్యకు పదేళ్లక్రితమే భార్య చనిపోగా, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో వారు బోరుమన్నారు. -
వృథా క్లినిక్‌లు
ఉట్నూర్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువ క్లినిక్‌లతో ప్రయోజనం చేకూరడం లేదు. ఆయా ఆస్పత్రుల్లో యువ క్లినిక్‌లు గోడకు అంటించిన ఫ్లెక్సీలపై తప్ప సేవలు కనిపించడం లేదు. ఐటీడీఏ ద్వారా వెచ్చించిన రూ. లక్షల నిధులు వృథా అవుతున్నాయి. కౌమార దశ నుంచి యవ్వన ఆరంభ దశ(12 సంవత్సరాల నుంచి) బాలబాలికలకు వచ్చే ఆరోగ్య సమస్యలు, శారీరక మార్పులు, మానసిక ఒత్తిడిలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లైంగిక సమస్యలు, వ్యాధులపై అవగాహన కల్పించడం.. అవసరమైతే చికిత్సలు అందించడం కోసం ప్రభుత్వం యువ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం వైద్యాధికారులకు 2010 నవంబర్‌లో శిక్షణ ఇచ్చింది. శిక్షణ తీసుకున్న వారిలో 35 మంది బదిలీపై వెళ్లారు. కొత్తవారికి అవగాహన లేకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. నిధులు వృథా.. జిల్లా వ్యాప్తంగా 45 యువ క్లినిక్‌ల ఏర్పాటు కోసం ఐటీడీఏ రూ. 6.75 లక్షలు మంజూరు చేసింది. పీహెచ్సీలలో ఒక్కో గదిని, ఒక్కో యువక్లినిక్‌కు రూ.5 వేల చొప్పున మందులు, మౌలిక వసతులు, ప్రచారం కోసం కేటాయించింది. అయా పీహెచ్‌సీలోని మెడికల్ అధికారి, ఏఎన్ఎం, నర్సు యువ క్లినిక్‌ల ద్వారా వ్యాధులపై అవగాహన, సూచనలు, అవసరమైతే కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఇంతటి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన యువ క్లినిక్‌లు బోర్డులకే పరిమితం అవుతున్నాయి. గదులు కేటాయించిన దాఖలాలు లేవు. నిధులు కూడా పక్కదారి పట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం 2011-12 సంవత్సరానికి నిధులు విడుదల చేసి ఆ తర్వాత నిధుల విడుదల మరవడంతో యువక్లినిక్‌లు అటకెక్కాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌ను వివరణ కోరగా యువ క్లినిక్ నిర్వహణపై ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు.