రైతులకు ఆసరాగా ఉంటూ కోతల సమయాల్లో కూలీల కంటే అధిక వేగంతో పనిచేసే వరికోత యంత్రమే ఆ రైతు పాలిట మృత్యుశకటంగా మారింది.
అమరచింత, న్యూస్‌లైన్ : రైతులకు ఆసరాగా ఉంటూ కోతల సమయాల్లో కూలీల కంటే అధిక వేగంతో పనిచేసే వరికోత యంత్రమే ఆ రైతు పాలిట మృత్యుశకటంగా మారింది. బ్యాంకు పని నిమిత్తం పట్టణానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై కుమారుని వెంట వెళుతుండగా వరికోత యంత్రం ఢీకొనడంతో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. నర్వ మండలం లంకాలకు చెందిన బాలయ్య (65) కు సమీపంలో ఐదెకరాల పొలం ఉంది. అందులో వరి పంటను సాగు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది బ్యాంకులో తీసుకున్న రుణం వివరాలను తెలుసుకునేందుకుగాను బుధవారం ఉదయం అమరచింతలోని ఆంధ్రాబ్యాంకుకు తన కుమారుడు చెన్నయ్యతో కలిసి బైక్‌పై వచ్చాడు.
మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో అమరచింత బస్టాప్ కూడలిలోకి చేరుకోగానే వరికోత యంత్రం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఓ ఆటోలో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ షేక్‌గౌస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా బాలయ్యకు పదేళ్లక్రితమే భార్య చనిపోగా, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో వారు బోరుమన్నారు.