సర్వజనాస్పత్రిలో కూలిన రూఫింగ్
ఎక్స్‌రే టెక్నీషియన్‌కు గాయాలు
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఎక్స్‌రే గదిలో ఆదివారం రాత్రి రూఫింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఎక్స్‌రే టెక్నీషియన్ నరసింహులు తలకు గాయమైంది. అదృష్టవశాత్తు ఈ సమయంలో ఎక్స్‌రే తీయించుకోవడానికి ఎవరూ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాత్రి విధులు నిర్వర్తిస్తున్న నరసింహులు ఎక్స్‌రే గదిలోనే భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి వెళ్తుండగా ఒక్కసారిగా పైకప్పు ఊడి పడింది. కడ్డీలు తలపై పడడంతో స్వల్పగాయమైంది. విషయం తెలియగానే డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ విజయమ్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మన్న హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఎలక్ట్రీషియన్లను పిలిపించి మాట్లాడారు. సోమవారం ఉదయాన్నే విద్యుత్ సరఫరాను నిలిపివేసి పనులు చేయాలని సూచించారు. ఓపీ ప్రారంభం సమయానికి గదిలో ఎక్స్‌రే పనులకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. కాగా రూఫింగ్ పనులు నాసిరకంగా చేపట్టడంతోనే ఈ ఘటన జరిగినట్లు స్పష్టమవుతోంది.