సూత్రాల పథకంపై ప్రచారం చేస్తున్న చుక్క సత్తయ్య(ఫైల్)
సాక్షి, జనగామ: చుక్క సత్తయ్య.. ఒగ్గు కథ పితామహుడు. తన సృజనాత్మకతతో ఒగ్గుకళను విశ్వవ్యాప్తం చేశారు. ఒగ్గు కళాసామ్రాట్ చుక్క సత్తయ్య కన్నుమూతతో ఆ కళపై ఆధారపడిన వారి భవిష్యత్తు అంధకారంగా మారింది. ఒగ్గు కళను నమ్ముకున్న వారి ఉపాధిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒగ్గు కళపై ఆధారపడి రాష్ట్రంలో సుమారు 1.50 లక్షల మంది జీవిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు, సిద్దిపేట, నల్లగొండ, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, హుస్నాబాద్, మహబూబ్‌నగర్, యాదాద్రి జిల్లాలో ఒగ్గు కళాకారులున్నారు. ఎవరైనా ఒగ్గు కథ చెప్పడానికి పిలిస్తే వెళ్లి.. కథ చెప్పి వారిచ్చింది తీసుకొని వస్తున్నారు. లేని రోజుల్లో ఇతర పనులు చేసుకుంటున్నా జీవనం భారమవుతోందని ఒగ్గు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి చూసి ఔత్సాహికులెవరూ ఈ కళ వైపు దృష్టి సారించటం లేదని అంటున్నారు.
సాంస్కృతిక సారధి దక్కని చోటు..
చుక్క సత్తయ్య తన కళతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. ముఖ్యంగా 20 సూత్రాల పథకం ప్రచారం చేయటంలో కీలక పాత్ర పోషించారు. దీంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని చుక్క సత్తయ్య కళను మెచ్చుకోవటంతో పాటు ఢిల్లీకి పిలిపించి.. స్వర్ణకంకణం బహూకరించారు. నాటి నుంచి ఒగ్గు కళకు ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఒగ్గు కళాకారులకు చోటు కల్పించకున్నా.. చుక్క సత్తయ్యకు జీవన భృతి కింద నెలకు రూ. 10 వేల చొప్పున అందించింది. తమకు సాంస్కృతిక సారధిలో చోటు కల్పించాలని రాష్ట్రంలోని ఒగ్గు కళాకారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment