
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కృష్ణాజీవాడి రైతులపై రౌడీ ముద్ర తొలగింది. వారిపై రౌడీషీట్ తొలగిస్తున్నట్లు ఎస్పీ శ్వేత ప్రకటించారు. 2014 జనవరి 12న కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజీవాడి గ్రామంలో మక్కల తూకంలో తేడాను గమనించిన రైతులు వ్యాపారిని నిలదీశారు. ఈ సందర్భంగా గొడవ జరగడంతో అప్పటి తాడ్వాయి ఎస్‌ఐ రాంబాబు వచ్చి లారీని బలవంతంగా పంపించారు. దీంతో రైతులు ఎస్‌ఐని నిలదీయడంతో తోపులాట జరిగింది.
ఈ క్రమంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. సంఘటనలో 22 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపడంతో పాటు రౌడీషీట్ తెరిచారు. ఈ కేసును కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి విచారించారు. సరైన సాక్ష్యాలను చూపడంలో పోలీసులు విఫలమవడంతో 2016 మార్చి 31న కేసు కొట్టేశారు. అయినా.. పోలీసులు రౌడీషీట్ తొలగించలేదు. ఈ విషయమై నవంబర్ 9న ‘సాక్షి’మెయిన్ పేజీలో ‘రైతన్నపై రౌడీ ముద్ర’అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.
దీనిపై ఎస్పీ శ్వేత స్పందించారు. తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో నోటీసు బోర్డుపై ఉన్న రైతుల ఫొటోలను తొలగించి, ఎల్లారెడ్డి డీఎస్పీతో విచారణ జరిపించారు. రౌడీషీట్ నమోదైన వారిలో ఇద్దరు చనిపోయారు. మిగిలిన వారిలో 19 మందిని సత్ప్రవర్తన కలిగిన వారుగా గుర్తించి వారిపై రౌడీషీట్లను ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ శ్వేత ‘సాక్షి’తో తెలిపారు. ఒకరిపై మాత్రం కేసు కొనసాగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment