సాగునీటి సంఘాల ఎన్నికలు తెరపైకి.. | telangana govt plans to irrigation community Elections | Sakshi
Sakshi News home page

సాగునీటి సంఘాల ఎన్నికలు తెరపైకి..

Published Mon, Jan 22 2018 7:26 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

telangana govt plans to irrigation community Elections - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2010 నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలకు త్వరలోనే కొత్తరూపు రానుందన్న ప్రచారం జరుగుతోంది. ఆదర్శరైతులను రద్దు చేసిన ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ప్రాజెక్టులు నిర్మాణం, పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో సాగునీటి సంఘాలకు కొత్తరూపు ఇవ్వాలన్న చర్చసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015లో సాగునీటి సంఘాల ప్రస్తావనను నీటిసంఘాలు, అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహనిర్మాణ సంస్థ అక్రమాల తర్వాత సాగునీటి సంఘాల తీరుపైనే ఆయన తీవ్రంగా స్పందించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాకతీయ కాల్వల మరమ్మతు, పునరుద్ధరణ పనుల్లో 2009, 2010, 2011లో రూ.283 కోట్లతో చేపట్టిన పనుల్లో అక్రమాలు జరగడమే సీఎం ఆగ్రహానికి కారణమని అప్పట్లో చర్చ జరిగింది. తాజాగా మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ పునరుజ్జీవం, కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు శరవేగంగా ముందుకు వస్తున్న తరుణంలో నీటి వినియోగంపై ఆజమాయిషీ అవసరమన్న కోణంలో సాగునీటి సంఘాల ఎన్నికలు మళ్లీ తెరపైకి రాగా.. నీటిపారుదల శాఖ అధికారులు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తాజాగా ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది.

2010లో ఓటర్ల సవరణతోనే నిలిచిపోయిన ఎన్నికలు
రాష్ట్ర వ్యాప్తంగా రోటేషన్‌ పద్ధతిలో సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రాదేశిక సభ్యులు మొదలు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ల వరకు 2010 జనవరి 9, 10 తేదీలలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఎన్నికల ప్రక్రియ, విది విధానాలను అప్పటి నీటిపారుదలశాఖ కార్యదర్శి ఎస్‌పి.ఠక్కర్‌ 2009 నవంబర్‌ 16న ప్రకటించారు. ఆరేళ్లు పూర్తయిన ప్రాదేశికాల్లో కొత్త కమిటీల ఎన్నికకు 2010 జనవరి 9, 10 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఆ ఉత్తర్వు ద్వారా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు 2010 డిసెంబర్‌ 21న జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చురుగ్గానే జరిగింది. ఇదే సమయంలో అప్పుడున్న పరిస్థితుల కారణంగా సాగునీటి సంఘాల ఎన్నికలు సాధ్యం కాదంటూ ప్రభుత్వం వాయిదా వేసింది. 2011 జనవరి 31 వరకు కమిటీల కాలాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో ఎన్నికల కోసం ప్రారంభమైన ప్రక్రియ ఓటర్ల జాబితా సవరణతోనే ప్రక్రియ నిలిచిపోయింది. ఏడేళ్లు పూర్తయిన సాగునీటి సంఘాలకు ఎన్నికలు మరో ఏడాది వరకు వాయిదాపడ్డాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)కింద జిల్లాలో 1,020 మంది ప్రాదేశిక సభ్యులు, 108 మంది నీటి సంఘాల అధ్యక్షులు, 10 మంది డిస్ట్రిబ్యూటరీ, ఒక ప్రాజెక్టు కమిటీ చైర్మన్లుంటారు. ఇందులో ఆరేళ్లు పూర్తయిన సంఘాలకు వచ్చే ఫిబ్రవరి మొదటివారంలో నిర్వహించే ఎన్నికలను వాయిదా వేయడం ఆశావహులకు రెండోసారి చుక్కెదురైనట్లే.

1997 నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలు
1997లో తొలిసారిగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 2003లో రెండోసారి ఎన్నికలు నిర్వహించారు. ఒక నీటిసంఘం ఏర్పాటు చేయడానికి కనీసం 100 ఎకరాల ఆయకట్టు ఉండాలన్న ప్రాతిపదికన సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ సంఘంలో పోటీ చేయాలన్నా.. ఓటేయాలన్నా.. అతను ఆ ఆయకట్టు పరిధిలోని రైతై ఉండాలి. 18 ఏళ్లు  నిండినవారు ఆ సంఘంలో ఓటర్లుగా సంఘం అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రతి రెండేళ్లకు 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఆయా సంఘాల పరిధిలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు ఎన్నిక తప్పనిసరిగా జరుగుతోంది. రెండేళ్లు పూర్తయిన వారికి 2005–06లో, నాలుగేళ్లు పూర్తయిన వారికి 2007–08లో ఎన్నికలు జరగ్గా.. ఆరేళ్ల పదవీ కాలం పూర్తయిన ప్రాదేశికాలకు 2010 జనవరి 9, 10 తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. పదవీకాలం ముగిసిన ప్రాదేశికాలతో పాటు సభ్యుల ఆకస్మిక మృతి, రాజీనామాలు, న్యాయస్థానాలు అనర్హులుగా ప్రకటించిన స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అప్పటి పరిస్థితుల కారణంగా ఏడాది ఎన్నికలు వాయిదా వేయగా.. రెండోసారి 2012 జనవరి 31 వరకు ప్రస్తుతమున్న కమిటీలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయడం చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement