హెబ్బాపటేల్, నిఖిల్
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో 5కే వాక్ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ రన్‌లో నటి హెబ్బా పటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
లబ్బీపేట (విజయవాడతూర్పు) : క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం ద్వారా వందశాతం నివారించవచ్చని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తానా ఫౌండేషన్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో 5కే వాక్ నిర్వహించారు. ఈ వాక్‌లో పెద్ద సంఖ్యలో యువత, వాకర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ నేడు ప్రజలకు సోకుతున్న వ్యాధులన్నీ జీవనశైలి కారణంగానే అని నిర్ధారణ అవుతున్న వేళ, ప్రజల తమ దినచర్యలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జబ్బు చేసిన తర్వాత చికిత్స కోసం పరుగులు పెట్టేదానికన్నా, వ్యాధి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం అత్యాధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, తొలిదశలో క్యాన్సర్‌ను నిర్ధారించే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధి, లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని చెప్పారు. క్యాన్సర్‌పై పోరాటం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్, మురళీమోహన్, రాష్ట్ర డీజీపీ ఎం.మాలకొండయ్య, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, నగర మేయర్ కోనేరు శ్రీధర్, శాసన సభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, రూట్స్ అధ్యక్షుడు డాక్టర్ పీవీఎస్ విజయభాస్కర్ పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా నిఖిల్, హెబ్బాపటేల్
క్యాన్సర్‌పై అవగాహన కలిగించేందుకు నగరంలో నిర్వహించిన ర్యాలీలో సినీ నటులు నిఖిల్, హెబ్బాపటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఐదు కిలోమీటర్లు నడిచి, వాకర్స్‌లో ఉత్సాహాన్ని నింపారు.
ఉచిత నిర్ధారణ పరీక్షలు
హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉచిత నిర్ధారణ పరీక్షలు, వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 450 మందికిపైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 63 మందికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, 20 మందికి మమ్మోగ్రామ్, 25 మందికి ఎక్స్‌రే, 55 మందికి పాప్‌స్మియర్ టెస్ట్‌లు ఉచితంగా నిర్వహించారు. ఇద్దరిలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించడంతో వారికి హైదరాబాద్ ఆస్పత్రికి పంపించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ కుమారి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సులోచనరాణి, డాక్టర్ సూర్యప్రకాష్, డాక్టర్ భువనకుమారి బృందం పాల్గొన్నారు. ఈ శిబిరం సోమవారం కూడా కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment