ముచ్చట పడి కొన్న కారే.. ముగ్గురిని బలిగొంది! | three killed in road accident at Mahanadi | Sakshi
Sakshi News home page

ముచ్చట పడి కొన్న కారే.. ముగ్గురిని బలిగొంది!

Published Thu, Jan 18 2018 4:14 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

three killed in road accident at Mahanadi - Sakshi

పూణేలో బీఎస్‌ఎఫ్‌ జవానుగా పనిచేస్తున్న తోట చంద్రమౌళి భార్యా పిల్లలతో కలిసి సంక్రాంతి సెలవులకు స్వగ్రామమైన మహానంది మండలం తిమ్మాపురానికి వచ్చారు. సోమవారం పండుగను ఘనంగా చేసుకున్నారు. బుధవారం నంద్యాలలో ఓ సెకండ్‌ హ్యాండ్‌ కారును ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేశారు. కర్నూలులోని మిలటరీ క్యాంటీన్‌లో వస్తువులను కొనేందుకు ఆ కారులోనే భార్య, తమ్ముళ్లు, స్నేహితుడితో కలిసి బయలుదేరారు. పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్ద ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. కారు, బస్సు ఢీకొనడంతో చంద్రమౌళి భార్య పద్మావతి (28), స్నేహితుడు హేమసుందర్‌ గౌడు(32), తమ్ముడు రవికుమార్‌(24) మృతిచెందారు. 

పాణ్యం/ మహానంది:  పాణ్యం సమీపంలోని జాతీయ రహదారిపై నూలుమిల్లు వద్ద బుధవారం  ఘోర  రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. మçహానంది మండలం తిమ్మాపురానికి చెందిన  తోట చంద్రమౌళి  బీఎస్‌ఎ‹ఫ్‌(ఫూణే)లో పని చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన పద్మావతి(28)తో వివాహమైంది. వీరికి కార్తీక్, లక్ష్మీప్రియ ఉన్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఇటీవల సెలవుపై భార్య, పిల్లలతో కలిసి ఇంటికి వచ్చాడు. 

బుధవారం ఉదయం నంద్యాలలో  సెకండ్‌ హ్యాండ్‌ కారు, కర్నూలుకు వెళ్లి క్యాంటీన్‌లో వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు చంద్రమౌళి తన క్లాస్‌మేట్‌ హేమసుందర్‌గౌడు(32), తన తమ్ముళ్లు హరిప్రసాద్, రవికుమార్‌(24)లతో కలిసి ముందుగా బైక్‌లపై నంద్యాలకు వెళ్లారు. అక్కడ సెకంyŠ  హ్యాండ్‌ కారుకొన్నారు. తర్వాత పద్మావతిని పిలుచుకురావాలంటూ చంద్రమౌళి  తమ్ముడు హరిప్రసాద్‌ను పంపాడు. ఆమె రావడంతో అందరూ కర్నూలుకు కారు(ఏపీ 21బీఎం 9132)లో బయలుదేరారు. ఆర్జీఎం ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద హైవేపై డైవర్షన్‌ ఉండడంతో  ఎడమ వైపు నుంచి కుడివైపు వెళ్తుండగా నూలుమిల్లు వద్ద ఎదురుగా వస్తున్న కడప డిపోకు చెందిన ఏపీ04జెడ్‌ 0224 నంబర్‌ గల అల్ట్రా డీలక్స్‌ బస్సు ఢీ కొంది. ఘటనలో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. 

కారులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన హేమచంద్రగౌడ్, హరిప్రసాద్, చంద్రమౌళి,  రవికుమార్‌ను స్థానికులు, సీఐ పార్థసారథిరెడ్డి , ఎస్‌ఐ చిరంజీవి బయటకు తీసి పోలీస్‌ వాహనంలో శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. తర్వాత రవికుమార్‌ను కర్నూలు ప్రభుత్వాస్పత్రి, హేమచంద్రగౌడ్‌ను గౌరీగోపాల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స ఫలించకపోవడంతో ఇద్దరూ మృతి చెందారు. ప్రస్తుతం చంద్రమౌళి గౌరీగోపాల్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు.  

ఎం.తిమ్మాపురంలో విషాదఛాయలు. 
రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో ఎం.తిమ్మాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే చంద్రమౌళి తల్లి పుల్లమ్మ స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు మజ్జిగ తాపించి ఓదార్చారు. మరో మూడేళ్లలో చంద్రమౌళి రిటైర్‌ కానున్నాడు. ఇక్కడే ఉండేందుకు స్థలం కూడా కొనుగోలు చేశాడు. వీరితో పాటు వెళ్లిన హేమసుందర్‌గౌడు చంద్రమౌళికి క్లాస్‌మేట్‌. ఎంఎస్సీ, బీఈడీ పూర్తిచేసి ప్రైవేటు స్కూలులో ఉద్యోగం చేస్తున్నాడు. హేమసుందర్‌ మృతితో ఆయన తండ్రి ఎస్‌.నరసింహులు అలియాస్‌ టైలర్‌ నరసింహులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. రవికుమార్‌ పదవతరగతి వరకు చదివి డ్రైవర్‌గా పని చేసేవాడు.  

పెద్ద దిక్కు పోయింది   
నా పెద్దదిక్కు పోయింది...నా పద్దూ తల్లీనే నా పెద్దకొడుకులా ఉండేది...అంటూ పద్మావతి తల్లి లక్ష్మిదేవి రోదించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె పద్మావతి. కూలి పనులు చేసుకుంటూ   తమ కుమార్తెలను కష్టపడి చదివించి ముగ్గురికి పెళ్లిళ్లు చేశారు.  

అక్కా...లే అక్కా.. 
పద్మావతి అంటే ఆమె చెల్లి దివ్యకు ప్రాణం. రోడ్డుప్రమాదంలో మృతి చెందిన తన అక్కను చూసి అక్కా...లే అక్కా...మేమొచ్చాము అంటూ చెల్లి దివ్య రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తిమ్మాపురంలోని అత్తారింటికి తీసుకుని వచ్చారు. అనంతరం వాహనంలో తల్లి, తండ్రి, చెల్లీ వచ్చారు.  తన అక్క మృతదేహంపై పడి దివ్య రోదించిన తీరు గ్రామస్తులను కంటతడిపెట్టించింది.  

డైవర్షన్‌తోనే ప్రమాదం? 
శాంతిరాం ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద హైవే వారు డైవర్షన్‌ మళ్లించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ఎడమ వైపు చిన్న పాటి పనులు జరుగుతుండడంతో ఆ వైపు రోడ్డును బ్లాక్‌ చేశారు.  దీంతో కుడి వైపు రోడ్డు రద్దీగా మారింది. దీంతోపాటు వాహనాలు రెండూ వేగంగా రావడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే డైవర్షన్‌ను తొలగించి యథావిధిగా రాకపోకలు పునరుద్ధరించారు.   

ప్రాణాలతో బయటపడిన చిన్నారులు.. 
చంద్రమౌళి, పద్మావతి దంపతులకు కార్తీక్‌(మూడోతరగతి), లక్ష్మీప్రియ(రెండోతరగతి) సంతానం. తండ్రి వెంట వెళ్లేందుకు వారు ఉదయం మారాం చేశారు. కానీ వారి అవ్వ, తాతలు   సర్దిచెప్పడంతో మిన్నకుండిపోయారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడినట్లయింది.  

వెంటాడిన మృత్యువు 
సంఘటనా స్థలంలో మృతి చెందిన పద్మావతిని మృత్యువు వెంటాడింది.  ముందుగా వారితో పాటు  వెళ్లలేదు. అయితే నంద్యాలలో  సంతకం, వేలిముద్రలు అవసరమని, పిలుచుకుని రావాలని చంద్రమౌళి తమ్ముడు హరిప్రసాద్‌ను పంపడం, బైక్‌పై తీసుకురావడం జరిగింది. ఇంటి దగ్గరే ఉన్నా ఆమె ప్రాణాలతో బయటపడేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement