
దీపావళి అంటే దివ్వెలు, వెలుగుల సంబరం మాత్రమేకాదు. పసిడి కాంతుల కళకళలు కూడా. దసరా, దీపావళి పండుగ సీజన్ వచ్చిందంటే నగల వ్యాపారులకు బోలెడన్ని ఆశలు. ముఖ్యంగా పండుగ దీపావళి ముందురోజు వచ్చే ధంతేరస్ (ధన త్రయోదశి) రోజు భారీగా అమ్మకాలు వుంటాయని ఎదురు చూస్తుంటారు. లక్ష్మిదేవిని పూజించడం ఎంత ముఖ్యంగా భావిస్తారో...దీంతో పాటు బంగారం గానీ, ఏదో ఒక కొత్త వస్తువు కొనడం కూడా అంతే ఆనవాయితీ వస్తున్న క్రమంలో వారికి భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రికార్డు స్థాయికి చేరిన పసిడి దరలు దీపావళి నాటికి దిగి వస్తాయా అని కొనుగోలుదారులు ఆశగా ఎదురుచూస్తోంటే.. కొనుగోళ్లతో తమ షాపులు కళకళ లాడతాయా లేదా అని వ్యాపారులు ఆందోళన పడుతున్నారు.
ముందుగా కొనుగోలుదారుల విషయానికి వస్తే..
కొనుగోలుదారులు ఈ ధంతేరస్‌కు ఎంతో కొంత బంగారాన్ని తమ సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఆకాశాన్నంటిన ధరలు మరింత దిగిరాకపోతాయా అనే మీమాంసలో చాలామంది కొనుగోలు దారులున్నారు. దీనికి తోడు స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ భవిష్యత్తులో మాత్రం భారీగా తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనాలు వారి ఊహలకు రెక్కలు తొడుగుతున్నాయి. అయితే క్షణక్షణానికి మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పుత్తడి ధర ఏ రోజు ఎంత పెరుగుతుందో.. ఎంత తగ్గుతుందో అంచనా వేయడం ఒకింత కష్టంగా మారింది.
ఇక రీటైల్ వ్యాపారుల విషయానికి వస్తే..
పుత్తడి స్వల్పంగా ధర దిగి వచ్చినప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు కనీసం 30 శాతం తగ్గుతాయని మార్కెట్ వర్గాల అంచనా. అయితే దీపావళి, ధంతేరస్ పర‍్వదినాల సందర్భంగా కొనుగోళ్లు పుంజు కుంటాయని ఆభరణాల పరిశ్రమ ఆశిస్తోంది. ఇటీవల 10 గ్రాములకు రూ. 40,000 రికార్డు స్థాయిలో ఎగిసిన పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో కస్టమర్ల తాకిడి ఆశాజనకంగా వుంటుందని భావిస్తున్నారు. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం భయాలు తగ్గుముఖం పట్టి చర్చలు ప్రారంభించడం డాలర్‌కు బలాన్నిచ్చింది. ముఖ్యంగా గడిచిన నెల రోజుల వ్యవధిలో న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 60 డాలర్ల మేర తగ్గింది. గత నెలలో బంగారం ధర గరిష్టంగా 1530 డాలర్ల వరకూ పెరిగింది. అక్కడి నుంచి పతనమైన బంగారం ధర ప్రస్తుతం 1475 డాలర్ల వద్ద వుంది. అటు దేశీయంగా రిటైల్ మార్కెట్లో కూడా బంగారం తగ్గుముఖం పడుతోంది. దీంతో ధంతేరస్‌కు పసిడి లాభాల సిరులు కురిపిస్తుందనే అంచనాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ పరిస్థితులు, గ్లోబల్‌గా ఆర్థిక వ్యవస్థ మందగమనం, ట్రేడ్‌వార్ తదితర కారణాల రీత్యా మొత్తం వ్యాపారం గత సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తక్కువగా ఉంటుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంతపద్మనాభన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పిఆర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొనుగోళ్లు హై ఎండ్ రేంజ్‌లో చాలా ఎక్కువ స్థాయిలో నమోదవు తున్నాయనీ, కానీ తక్కువ నుండి మధ్యస్థాయి వరకు జరిగే కొనుగోళ్లు బాగా ప్రభావితమవుతాయని చెప్పారు.
అంతేకాదు ప్రస్తుత ధోరణిని చూస్తే మొత్తం 2019 (750-850 టన్నుల) డిమాండ్ లక్ష్యాన్ని సవరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీపావళి అమ్మకాలపై కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ టిఎస్ కల్యాణారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న పెళ్లిళ్ల సీజన్ కూడా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. తమ బ్రాండ్ ఏడాది పొడవునా గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన అధిక బోనస్ కూడా డిమాండ్ పెంచడానికి దోహదపడుతుందని టైటాన్‌కు చెందిన సందీప్ కుల్హల్లి తెలిపారు. దీంతోపాటు తమ దీపావళి స్పెషల్ కలెక్షన్‌కు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోందన్నారు.
అయితే సెప్టెంబరులో దేశీయ బంగారం దిగుమతులు మూడేళ్ళలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఏడాది క్రితం 81.71 టన్నులతో పోలిస్తే ఈ సెప్టెంబరులో 68శాతం క్షీణించి 26 టన్నుల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంది. వాల్యూ పరంగా దిగుమతులు 51 శాతం క్షీణించి 1.28 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు అమెరికా చైనా మధ్య వాణిజ్యయుద్ధానికి ముగింపు పలకనున్న సందేశాలు, బ్రెగ్జిట్ సంభావ్యత డాలర్‌కు బలానివ్వనున్నాయి. దీంతో బంగారం ధరలు గ్లోబల్‌గా దిగి వచ్చే అవకాశం ఉంది. ఇది దేశీయంగా కూడా ప్రభావం చూపుతుంది. కానీ డాలరుమారకంలో రూపాయి మరింత క్షీణించినట్లయితే పసిడి గరిష్ట ధరలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. అంటే పసిడి పరుగుకు బ్రేక్ పడనట్టే!

Comments
Please login to add a commentAdd a comment