హీర్-రాంఝూ
అందమైన యువకుడు రాంఝూ గురించి వివరం అడిగితే మనషుల కంటే ప్రకృతి ఎక్కువగా చెప్పగలుగుతుంది. అతడి వేణు గానామృతంలో పడి అదే పనిగా తలలు ఎలా ఊపిందీ చెట్లు చెబుతాయి. తన నిరంతర చిరునవ్వుల వెనుక రహస్యం అతడి గానమని చీనాబ్ నది చెబుతుంది. తమ మోమున వెన్నెల కురిపించింది రాంఝూ మురళీగానమేనని మొఘలు రాజుల కట్టడాలు చెబుతాయి. చీనాబ్ నది ఒడ్డున ఉన్న తాహ్త్ హజరాలో పుట్టి పెరిగాడు ధీడో రాంఝూ. నలుగురు అన్నదమ్ముల్లో చిన్నవాడు. అందుకే తండ్రికి అతనంటే చాలా ఇష్టం. అన్నలకు మాత్రం అసహ్యం.‘‘భాన్సురీ ఊదడానికి తప్ప బతకడానికి పనికిరాడు’’ అని ముఖం మీదే తిట్టేవాళ్లు. ఇక వదినలు సరేసరి. సూటిపోటి మాటలతో రాంఝూను బాధపెడుతూనే ఉండేవాళ్లు. ఆ వేధింపులు,అవమానాలు భరించలేక ఒకరోజు సోదరులతో గొడవపడ్డాడు రాంఝూ. ‘‘ ఈ నరకంలో ఇక ఉండలేను.’’ అంటూ ఇల్లు విడిచిపెట్టాడు.
ఒక ద్వారం మూసిన దేవుడు ఎక్కడో ఇంకో ద్వారం తెరిచే ఉంచుతాడట. అందుకే రాంఝూ కోసం జంగ్ నగర ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ చారిత్రక పట్టణం.. ఒక అజరామర ప్రేమకథకు జన్మనివ్వటానికి సిద్ధంగా ఉంది. జంగ్‌లో మల్కి అనే పెద్దాయన దగ్గర పశువుల కాపరిగా చేరాడు. వాటిని మేపుతూ మురళి వాయించేవాడు. ఆ సమ్మోహన వేణుగానం వినే అదృష్టానికి ఆ పశువులు సైతం పులకించిపోయేవి. ఒక రోజు.. ఆ అద్భుత వేణుగానం మల్కి కూతురు హీర్ చెవిన పడింది. ఆమె సమ్మోహితురాలయ్యింది. స్వయంగా అతడితో ఆ విషయం చెప్పింది. ఆ పరిచయం వాళ్లను దగ్గరచేసింది. రాంఝూను ఎక్కడో ఒకచోట రహస్యంగా కలిసేది హీర్. తన చేదు గతాన్ని మరిచిపోవటానికి దైవం పంపిన బహుమానం ఈ అమ్మాయి అనుకునే వాడు రాంఝూ. రాంఝూ- హీర్‌ల ప్రేమ వ్యవహారం.. హీర్ తల్లిదండ్రులకు, మేనమామ కైడోకు తెలిసింది. వాళ్లంతా నిప్పులు కక్కారు.
హీర్-రాంఝూల స్మారక కట్టడం
స్థానిక పూజారి ఐదా ఖైరాతో హీర్ పెళ్లికి రంగం సిద్ధం చేశాడు. రాంఝూను ఊరినుంచి గెంటేశారు. రాంఝూ గుండె బద్దలయ్యింది. ఐహిక ప్రపంచం మీద విరక్తి పుట్టింది. సన్యాసిగా మారిపోయాడు. పాటలు పాడుతూ పిచ్చివాడిలా ఊరూరా తిరుగుతుండేవాడు. అతడి పాటల్లో గొప్ప జీవన తత్వాలు ఉండేవి. అవి ఎందరినో ఆకర్షించేవి. మరోవైపు హీర్ ‘‘రాంఝూను తప్ప ఎవరినీ పెళ్లాడను’’ అని గట్టి పట్టుదలతో ఉంది. ఎంత భయపెట్టినా, బుజ్జగించినా ఆమెలో మార్పు రాలేదు. బెంగపెట్టేసుకుంది. రోజురోజుకూ కుంగిపోసాగింది. కూతురు ఆరోగ్యం దెబ్బతినడం చూసి హీర్ తల్లిదండ్రులు ఆమెను రాంఝూకిచ్చి పెళ్లి చేయటానికి సిద్ధమయ్యారు. రాంఝూను వెతికి తీసుకొచ్చారు. ఆ రోజు హీర్- రాంఝూల పెళ్లి. ఈ సృష్టిలోని సంతోషమంతా అతడి కళ్లలోనే ఉన్నట్లుగా ఉంది. ‘రాంఝూ లేని ఈ లోకం నరకం కన్నా ఘోరం’ అనుకున్న హీర్ ప్రపంచంమంతా అందంగా కనిపించసాగింది.
అంతలో ఉన్నట్టుండి ఏవో కేకలు అందరూ అటువైపు పరిగెత్తారు. హీర్ నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటోంది. ఏమయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అంతలోనే ఆమె ప్రాణం ఆమెను వదిలిపోయింది. పెళ్లికని చేసిన లడ్డుల్లో ఒకటి తింది హీర్. అది విషప్రయోగం చేసిన లడ్డు అనే విషయం తెలిసింది. ఈ పని హీర్ మామ కైడో చేసి ఉంటాడని అనుమానం. చేసింది ఎవరైనా, పోయింది మాత్రం హీర్ ప్రాణం! రాంఝూ గుండె మరోసారి ముక్కలైంది. ఆమె లేని లోకంలో తానేం చేయాలో తోచలేదు. హీర్ తిని వదిలేసిన లడ్డూను తినేశాడు. మరుక్షణం ప్రాణాలు వదలి తన ప్రేమసిని చేరుకున్నాడు. వీరి విషాదాంత ప్రేమగాథ పంజాబ్ చరిత్రలో కన్నీటిచుక్కై నిలిచింది. జంగ్‌లో కనిపించే హీర్-రాంఝూల స్మారక కట్టడం.. అజరామరమైన స్మారక నిలువెత్తు సంతకంలా నేటికీ మెరిసిపోతూ ఉంటుంది.
- యాకూబ్ పాషా
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment