
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ కృష్ణాదిత్య ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ప్రగతి నివేదికలు తయారు చేసుకోవాలని, గణతంత్ర వేడుకల సందర్బంగా శకటాలను ప్రదర్శించేందుకు సిద్ధం కావాలన్నారు. జిల్లా పౌర సంబందాల శాఖ ఆధ్వర్యాన ఫొటో ప్రధర్శన నిర్వహించాలన్నారు. అన్ని శాఖల కార్యాలయాల్లో ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండా ఎగురవేసి, మహనీయులకు నివాళులర్పించాక 8.45 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే జెండా వందనానికి హాజరుకావాలని సూచించారు. ఇంకా సంక్షేమ శాఖల ఆధ్వర్యాన పేదలకు ఆస్తుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ కొమురయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్ ఉదయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.