
సినిమా టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటును థియేటర్ల యాజమాన్యాలకు అప్పగిస్తూ ఇటీవల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇకపై యాజమాన్యాలు టికెట్ల రేటు పెంపునకు సంబంధించి ఏ ప్రభుత్వ అథారిటీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పెంచిన రేట్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం సంబంధిత ప్రభుత్వ శాఖకు ఇస్తే సరిపోతుంది. టికెట్ల రేటు పెంపు అంశాన్ని పక్కన పెడితే థియేటర్లలో మౌలిక సౌకర్యాలు నరక కూపాన్ని తలపిస్తున్నాయి. వినోదం కోసం వచ్చే ప్రేక్షకులు విసుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : వినోదం కోసం సినిమా థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకుడి జేబుకి ఇకపై భారీగా చిల్లు పడనుంది. టికెట్ల రేట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ 75ను విడుదల చేసినా.. అమలును పెండింగులో పెట్టింది. దీంతో టికెట్ రేట్ల పెంపు అవకాశాన్ని థియేటర్ యాజమాన్యాలకు కల్పిస్తూ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా పరిధిలో సుమారు 20 థియేటర్లు ఉండగా.. సుమారు పది వేల సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఒక్కో థియేటర్‌లో కేటగిరీని బట్టి టికెట్« ధర కనిష్టంగా రూ.10 మొదలుకుని గరిష్టంగా రూ.150 వరకు ఉంది. థియేటర్లు చాలా చోట్ల మల్టీప్లెక్సులుగా అవతారం ఎత్తుతుండగా.. జిల్లాలో మాత్రం ఇంకా ఆ సంస్కృతి వేళ్లూనుకోలేదు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం థియేటర్ యాజమాన్యాలు టికెట్ రేట్ల పెంపునకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. రేట్లు పెంచినట్లుగా సంబంధిత ప్రభుత్వ విభాగానికి సమాచారం ఇస్తే సరిపోతుంది. టికెట్ రేట్ల పెంపు విషయాన్ని పక్కన పెడితే థియేటర్లలో మౌలిక సౌకర్యాలు, నిర్వహణ తీరుపై ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పా ర్కింగ్ ఫీజు, క్యాంటీన్‌లో తినుబండారా లు, శీతల పానీయాల ధరలు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీ రు అందుబాటులో పెట్టడం, పారిశుద్ధ్య ం, టికెట్ల విక్రయం.. ఇలా అనేక అంశాలపై థియేటర్ యాజమాన్యాలు, లీజుదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
⇒ సీట్ల సామర్థ్యం, సీట్ల వరుసల నడుమ దూరం ఏర్పాటులో శాస్త్రీయత లేక ప్రేక్షకులు అసౌకర్యాంగా కూర్చోవాల్సి వస్తోంది.
⇒ థియేటర్‌లో ఉష్ణోగ్రతను సూచించేలా కనీసం మూడు నాలుగు చోట్ల డిజిటల్ థర్మా మీటర్లు ఏర్పాటు చేసి, థియేటర్ లోపల నిర్దేశిత ఉష్ణోగ్రత మాత్రమే ఉండేలా ఏసీ గాలిని వదలాలనే నిబంధన అమలు కావడం లేదు.
⇒ వెండితెర నుంచి ఎంత దూరంలో ఎన్ని డెసిబుల్స్ కలిగిన శబ్దం వదలాలనే స్పష్టమైన నిబంధనలు ఉన్నా.. మితిమీరిన శబ్దాలతో థియేటర్లు హోరెత్తుతున్నాయి.
⇒ థియేటర్ సీట్ల సామర్థానికి అనుగుణంగా ప్రతీ 50 మందికి ఒకటి చొప్పున టాయిలెట్ కమోడ్ ఏర్పాటు చేయాలి. కానీ కమోడ్‌లు, మరుగుదొడ్ల నిర్వహణ లేక చాలా చోట్ల దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. కొన్ని చోట్ల నీటి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లేదు.
⇒ ప్రేక్షకులకు రక్షిత తాగునీరు అందుబాటులో ఉండాలనే నిబంధన ఎక్కడా కనిపించడం లేదు.
⇒ షో ప్రారంభానికి ముందు వాణిజ్య ప్రకటనలను ఐదు నిముషాలకు మించి ప్రదర్శించకూడదనే నిబంధన అరుదుగా పాటిస్తున్నారు.
⇒ తూనికలు, కొలతలు, ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన చట్టాలేవీ అమలు కావడం లేదు. తినుబండారాలు, శీతలపానీయాల ధరలు రెండింతలు పెంచి అమ్ముతున్నా సంబంధిత విభాగాల పర్యవేక్షణ కరువైంది.
⇒ కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు విడుదలైన సందర్భాల్లో పార్కింగ్ ఫీజు పెంపు, బ్లాక్‌లో టికెట్ల విక్రయం సర్వసాధారణమైంది.
⇒ గతంలో థియేటర్లపై రెవెన్యూ, తూనికలు కొలతలు, ఆహార కల్తీ నియంత్రణ తదితర ప్రభుత్వ విభాగాలు తరచూ తనిఖీలు చేసి జరిమానాలు విధించేవి. థియేటర్లను సీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ విభాగాలు పర్యవేక్షించిన దాఖలా జిల్లాలో ఒక్కటీ కనిపించడం లేదు.
⇒ టెలివిజన్, సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ వినియోగం పెరగడం, పై రసీ తదితర కారణాలతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయిందని యాజమాన్యాలు చెబుతున్నాయి.
⇒ చాలా థియేటర్లు ఫంక్షన్ హాళ్లుగా, గోదాములుగా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టికెట్ల రేట్ల పెంపునకు తమకు అవకాశం ఇవ్వడంతో కొంతమేర ఊరటనిస్తోందని యాజ మాన్యాలు పేర్కొంటున్నాయి.
చెత్త కూడా ఊడ్చేవారు లేరు
థియేటర్లలో పరిశుభ్రత ఏ మూలనా కనిపించదు. రోజుకు ఒక్కసారి మాత్రమే శుభ్రం చేస్తున్నారు. ప్రతీ షో తర్వాత శుభ్రం చేయకపోవడంతో ప్లాస్టిక్ కవర్లు, తినుబండారాలు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. ఎలుకలు, దోమల బెడద విపరీతంగా ఉంది. పార్కింగ్ ఫీజు ఒక్కో థియేటర్‌లో ఒక్కో రకంగా ఉంటోంది. కొత్త సినిమా విడుదలైతే యాజమాన్యాలు ఇష్టారీతిన పార్కింగ్ ఫీజును పెంచేస్తున్నారు. టికెట్ల కోసం క్యూలో నిలుచుంటే ఆన్‌లైన్‌లో అమ్మినట్లు చెబుతున్నారు. బహిరంగంగానే బ్లాక్ టికెట్ల దందా జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. – లతీఫ్, వ్యాపారి, సదాశివపేట
పేదలు వినోదానికి దూరం
సినిమా టికెట్ల ధరలతో ఇప్పటికే పేదలు వినోదానికి దూరమయ్యే పరిస్థితి ఉంది. థియేటర్లకు ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తే మరింత భారం పెరుగుతుంది. టికెట్ ధరలు, థియేటర్లలో సౌకర్యాలపై ప్రభుత్వ విభాగాలు దృష్టి సారించాలి. థియేటర్ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా.. ఎక్కడా కనిపించడం లేదు. థియేటర్లలో మహిళలు పోకిరీల బెడద కూడా ఎదుర్కొంటున్నారు. షీ టీమ్స్‌తో థియేటర్ల వద్ద కూడా నిఘా ఏర్పాటు చేయాలి. – దిండె రాజు, జహీరాబాద్
పర్యవేక్షణ ఉండాల్సిందే
సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాల్సిందే. థియేటర్ యాజమాన్యాల విచక్షణకు వదిలేస్తే ప్రేక్షకుడిపై భారం పెరుగుతుంది. థియేటర్లలో మౌలిక సౌకర్యాలు లేకున్నా.. లాభాపేక్షతో ఇష్టారీతిన టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. థియేటర్ల నిర్వహణపై ఎలాంటి ప్రభుత్వ ఆజమాయిషీ లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ప్రేక్షకుడు చెల్లించే డబ్బుకు తగిన వినోదం, మౌలిక వసతులు థియేటర్లు అందించాలి. లేదంటే సినిమా రంగంపైనే మరింత వ్యతిరేక ప్రభావం పడడం ఖాయం. – కూన వేణుగోపాల్, వినియోగదారుల హక్కుల కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment