'కొత్త' కాపురం | special story on Marital bond | Sakshi
Sakshi News home page

'కొత్త' కాపురం

Published Mon, Jan 1 2018 5:47 PM | Last Updated on Fri, Sep 28 2018 4:32 PM

 special story on Marital bond

మూడు ముళ్ల బంధానికి మున్నెన్నడూ లేని కష్టమొచ్చింది. జీవితకాలం కొనసాగాల్సిన వైవాహిక బంధం బలహీనమైపోతోంది. ఏ గొడవొచ్చినా పరిష్కరించే కుటుంబ పెద్దలు కరువయ్యారు. ఒకప్పటిలాగా గుట్టుగా సాగాల్సిన సంసారం మూణ్ణాళ్లకే  వీధిన పడుతోంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి దాంపత్య జీవితం దారి తప్పుతోంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని జీవిత కాలం కలిసిమెలసి ఉండాల్సిన దంపతులు విడిపోతున్నారు. అనుమానం, అవగాహనా లేమి, ఒకరిపై మరొకరికి ప్రేమ లేకపోవడం, వివాహేతర సంబంధాలకు తోడు.. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ చాటింగ్‌లు సైతం కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఏ కారణం వల్ల జంటలు విడిపోయినా అది తప్పని వైవాహిక జీవితపు గొప్పదనాన్ని చాటిచెప్పుతూ.. భార్యాభర్తలు పరస్పర అవగాహన, ప్రేమ కలిగి ఉండాలని.. అనుమానాలను దూరం పెట్టాలని, సర్దుకొని పోతేనే సంసారం సాగుతుందని తెలియజెప్పి వారి బంధం బలంగా ఉండేందుకు కృషి చేస్తోంది ‘కుటుంబ సలహా కేంద్రం’.. మీ బంధం బలహీనమైతే దానికి బలమైన పునాదులు వేసేందుకు రెడీగా ‘కుటుంబ సలహా కేంద్రం’ ఉందన్న విషయాన్ని మరవొద్దని చెబుతోంది. 


గజ్వేల్‌రూరల్‌: డిగ్రీ చదువుకున్న సిద్దిపేటకు చెందిన అమ్మాయికి.. ఇంటర్‌ చదువుకున్న దుబ్బాక మండలానికి చెందిన అబ్బాయితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత అమ్మాయిని బీఎడ్‌టోపాటు పీజీ కూడా చదివించాడు. మూడేళ్ల వరకు ఆ దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఈ సమయంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భర్త తనను పట్టించుకోవడం లేదని.. అలనా పాలనా చూడడం లేదని ఆమె పేర్కొంటుండగా... భార్యపై అనుమానంతో వారిద్దరూ దూరమయ్యారు. వారికి ఏడాదిన్నర పాప ఉంది. విడిపోయిన భార్యాభర్తలు కోర్టులో కేసులు పెట్టుకోవడం, కోర్టు, లాయర్లు, మధ్యవర్తుల వద్ద పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సలహా కేంద్రం కౌన్సిలర్లు దూరమైన ఆ జంటకు, వారి కుటుంబసభ్యులకు మూడు నెలల క్రితం వివాహబంధంపై కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం ఈ జంట వేరు కాపురం పెట్టి ప్రస్తుతం సిద్దిపేటలో నివాసముంటోంది. ఇలాంటివే మరెన్నో చిన్న చిన్న కారణాలు.. స్పర్థలు.. మాట పట్టింపులతో దూరమవుతున్న జంటలను కలుపుతోంది గజ్వేల్‌లోని కుటుంబ సలహా కేంద్రం. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ఇక్కడికి వస్తున్న అనేక జంటలకు ఈ కేంద్రంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురాలను నిలబెడుతున్నారు.

మన జీవితంలో టీవీలు, సెల్‌ఫోన్, ఇంటర్నెట్ల వినియోగం ఓ భాగమైపోయింది. వీటి వినియోగం వల్ల మేలు జరుగుతున్నప్పటికీ అనర్థాలు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి వ్యామోహంలో చదువుకున్న యువత, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్షతోపాటు జల్సాలకు అలవాటు పడి కుటుంబ సభ్యుల్లో ప్రేమానురాగాలు తగ్గి క్షణికావేశంలో... విచక్షణ కోల్పోయి చేసే పనుల వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయి. 

మూడు ముళ్లు.. ఏడడుగులు.. భాజా బజంత్రీలు, వేద మంత్రాల సాక్షిగా ఏకమై అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా నిలవాల్సిన భార్యాభర్తలు చిన్నపాటి మనస్పర్థలు, అపర్థాలు, అపోహలతో వారి దాంపత్య జీవితం ముణ్నాళ్ల ముచ్చటగా మార్చుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కరువై సఖ్యత లేకపోవడమే. 

దాంపత్య జీవితానికి బీటలు 
గ్రామాల్లో, పట్టణాల్లో గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి... అన్నాదమ్ములు, భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య తలెత్తినా ఇంటి పెద్ద పరిష్కరించేవారు. కానీ ఇప్పుడు పెళ్లయిన కొన్నాళ్లకే ఉమ్మడి కుటుంబంలో ఇమడలేక భార్యాభర్తలు వేరుపడి వైయక్తిక కుటుంబంగా మారుతున్నారు. అలా వేరుగా వచ్చిన భార్యాభర్తల్లో మనస్పర్థలు, అవగాహన లోపంతో చిన్నపాటి సమస్యలకు కూడా పెద్దగా ఫీలవుతూ సతమతమవుతున్నారు. దీంతో విడిపోవడం దాకా నిర్ణయం తీసేసుకుంటూ జీవితాలను దారి మళ్లించుకుంటున్నారు. 

పెరిగిపోతున్న ‘ఇగో’యిజం 
చదువుకున్న యువతలో అహం పెరిగిపోయి జల్సాలకు అలవాటు పడడం.. చదువు, సంపాదనలో తానేం తక్కువా అన్నట్లు వ్యవహరించడం... సెల్‌ఫోన్, ఇంటర్నెట్, ఇల్లీగల్‌ కాంటాక్టŠస్‌(వివాహేతర లైంగిక సంబంధాలు), మద్యపానం వంటివాటి మత్తులో ఎంతో మం ది తమ జీవి తాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, క్షణికావేశం వల్ల తలెత్తే అనర్థాలు ఎం తో దూరం తీసుకెళ్తున్నాయి. దీంతో వా రి పిల్లలు అనాథలు గా మారి తల్లిదండ్రుల ప్రేమకు దూరమవుతున్నారు.ఇలాంటి వారిని కౌ న్సెలింగ్‌ ద్వారా ఏకం చేసేందుకు కృషి చేస్తోంది ‘కుటుంబ సలహా కేంద్రం’... 
చిన్న సమస్యలతో భార్యాభర్తల మధ్య విద్వేషాలు పెరిగి దాంపత్య జీవితానికి దూరమవుతున్న వారికి కుటుంబ సలహా కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిని ఏకం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళా శిశు సంక్షేమశాఖ, సాంఘీక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల ఆధారంగా కుటుంబ సలహా కేంద్రాలు కొనసాగుతున్నాయి. దీని ఆధ్వర్యంలో ఉమెన్, మేల్‌ కౌన్సిలర్లు మనస్పర్థలతో విడిపోయిన జంటలను ఏకం చేసేందుకు కౌన్సెలింగ్‌ ఇస్తుంటారు. 

గజ్వేల్‌లోని కుటుంబ సలహా కేంద్రం పరిష్కరించిన కేసులు 
మహిళా శిశు సంక్షేమశాఖ, సాంఘీక సంక్షేమ మండలి సహకారం తో గజ్వేల్‌ పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో ‘విజన్‌ ఎన్జీఓ స్వచ్ఛంద సంస్థ’ ఆధ్వర్యంలో 2012లో కుటుంబ సలహా కేంద్రం ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా 40 కుటుంబ సలహా కేంద్రాలు ఉండగా.... గజ్వేల్‌లో ఉన్న ఈ కేంద్రం ద్వారా ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో 516 కేసులను పరిష్కరించారు. అయితే ప్రస్తుత ç2017లో ఇప్పటి వరకు 68 కేసులు పరిష్కరించినట్లు నిర్వాహకుడు కైలాష్‌ పేర్కొన్నారు. 

గ్రామైక్య సంఘాలు, పోలీసుల సహకారంతో.. 
గ్రామైక్య సంఘాలు, పోలీసుల ద్వారా ఈ సెంటర్లలో ఎంఎస్‌డబ్ల్యూ చేసిన కౌన్సిలర్లతో దూరమవుతున్న జంటలకు కౌన్సెలింగ్‌ ఇప్పిస్తారు. ఇటీవలి కాలంలో మనస్పర్థలు, అపనమ్మకాలు, సెల్‌ఫోన్, ఇల్లీగల్‌ కాంటాక్ట్స్, వరకట్నం వేధింపుల వంటి సమస్యలతో దూరమవుతున్న జంటలు ఎక్కువగా ఉంటున్నాయని, వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఏకం చేస్తున్నామని చెబుతున్నారు. 

క్షణికావేశంలో మాటామాట పెరిగి తీసుకున్న నిర్ణయాలతో భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడం వల్ల వారి పిల్లలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదముందని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నా, ఎవరో ఒకరు (వివాహేతర సంబంధం)ఇతరులతో వెళ్లిపోవడం వల్ల పిల్లలు వారి ప్రేమను కోల్పోవడంతో పాటు అనాథలుగా మారుతున్నారు. దూరమవుతున్న జంటలకు పెద్దల సమక్షంలో పంచాయితీలు, పోలీసు కేసుల వరకు వెళ్లినటువంటి వారికి ఈ కేంద్రాలలో కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల అయ్యే ఖర్చు, కోల్పోతున్న జీవితం, భార్యాభర్తల బంధం, విడిపోవడానికి గల కారణాలను తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ కేంద్రాలకు వచ్చే కేసులలో ఎక్కువ ఒకటీ రెండుసార్ల కౌన్సెలింగ్‌తోనే పరిష్కారం అవుతున్నట్లు గజ్వేల్‌ కుటుంబ సలహా కేంద్రం, విజన్‌ సంస్థ నిర్వాహకుడు కైలాష్‌ తెలిపారు. అంతేగాకుండా గ్రామీణ  ప్రజలకు, మహిళా సంఘాలలో సమావేశాలు నిర్వహిస్తూ కుటుంబ సలహా కేంద్రం ఉన్నట్లు తెలపడంతోపాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. 

విభేదాలకు కారణాలు..
దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, అనుమానాలకు తావివ్వడం, ఇతరుల మాటలు నమ్మి మోసపోవడం, కట్న కానుకల విషయంలో తగాదాలు, ఆధిక్యత కోసం పోటీ పడటం, నిరక్షరాస్యత, అవగాహన లోపం, మూఢనమ్మకాలు, అపోహలు, ఆచార వ్యవహా రాలు, వివాహేతర సంబంధాలతో తలె త్తే వివాదాల కారణంగా జం టలు దూరమవుతున్నా యి. 
అలా కా కుండా భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు, అనుమానాలకు తావులేనప్పుడే దాంపత్య బం ధం నూరేళ్లు కొనసాగుతుంది. 

చిచ్చు పెట్టిన సెల్‌ఫోన్‌.. 
అమ్మాయిది వర్గల్‌ మండలంలోని ఓ గ్రామం. ఆమె 10వ తరగతి వరకు చదువుకుంది. గజ్వేల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్న అబ్బాయితో పెళ్లైంది. వీరు రెండేళ్లు బాగానే ఉన్నారు. భర్త స్నేహితుడొకరు ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు. దీంతో భర్తకు అనుమానం కలిగింది. భార్య కాల్‌ లిస్ట్‌ చెక్‌ చేసి ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు గుర్తించాడు. అనుమానానికి మరింత బలం చేకూరి గొడవలు తలెత్తాయి. దీంతో అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. ఆమె చనిపోతానని బెదిరిస్తూ ఇంట్లో నుంచి చుట్టాల ఇంటికి వెళ్లిపోయింది. దీంతో అతడు అత్తామామలకు సమాచారం అందించాడు. వారు అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లారు. భార్యను తీసుకువెళ్లడానికి భర్త రాగా పెద్ద మనుషుల మధ్య మాట్లాడిన తర్వాతే పంపిస్తామని అత్తింటివారు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఓ సారి అతడిని బావమరుదులు కొట్టడంతో విభేదాలు తలెత్తాయి. గ్రామ మహిళా సంఘాల ద్వారా సమాచారం అందుకున్న గజ్వేల్‌లోని కుటుంబ సలహా కేంద్రం ప్రతినిధులు 15 రోజుల వ్యవధిలో రెండు కుటుంబాలవారిని వేర్వేరుగా పిలిపించారు. పెళ్లి.. జీవితం అంటే ఏమిటి.. భార్యాభర్తల మధ్య వచ్చిన తగాదాలకు కారణాలను తెలియజేశారు. నీ స్నేహితుడే దీనికి కారణం.. నిన్నే మోసం చేయాలని చూశాడని, తప్పు నీవైపునే ఉంది కాబట్టి.. పీడకలలా మరచిపోవాలని సూచనలివ్వడంతోపాటు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. 6 నెలలుగా వీరు పటాన్‌చెరులోని ఓ ప్రాంతంలో వేరు కాపురం పెట్టి బాగానే ఉంటున్నారు. 

మానసిక వేధింపులతో...
తొగుట మండలానికి చెందిన అబ్బాయికి గజ్వేల్‌ మండలానికి చెందిన అమ్మాయితో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి పిల్లలు లేరు. అబ్బాయి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అమ్మాయిని మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అమ్మాయి పుట్టింటికి వెళ్లిపోయింది. అబ్బాయి తల్లిదండ్రులు వెళ్లినా అమ్మాయిని పంపించలేదు. ఈ విషయం కుటుంబ సలహా కేంద్రానికి అందడంతో రెండు కుటుంబాల సభ్యులను పిలిపించారు. ఈ సందర్భంలో అబ్బాయి మానసిక ప్రవర్తన బాగా లేదని, అమ్మాయికి అతడి నుంచి ప్రాణహాని ఉందనే అనుమానం ఆందోళన కలిగిస్తోందని ఆమె తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రెండు కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో అబ్బాయి డిప్రెషన్‌కు గురయ్యాడని, ఆసుపత్రిలో చికిత్స చేయించాలని సూచించారు. అతడికి చికిత్స పూర్తయిన తర్వాత అమ్మాయిని పంపించేలా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. రెండు నెలల ట్రీట్‌మెంట్‌ తర్వాత అబ్బాయిలో కొంత మార్పు వచ్చింది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో ఈ జంటను కలిపారు. ఈ జంట మూడు నెలలుగా వేరుగా ఉంటోంది. 

భార్యాభర్తలిద్దరూ సమానమే 

బండికి రెండు చక్రాలు ఎలానో... భార్యాభర్తలనేది కూడా అలానే కలిసుండాలి. మా వద్దకు వచ్చే జంటలకు విడిపోవడం వల్ల కలిగే నష్టాలు, కలిసుండడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తున్నాం. భార్యాభర్తల బంధంపై కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. జల్సాలకు అలవాటు పడి, వివాహేతర సంబంధాలతో ఎక్కువగా దూరమవుతున్నారు. వారిలో మార్పును తీసుకువస్తూ ఒక్కటయ్యే విధంగా కుటుంబ సలహా కేంద్రం ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. 
– కైలాష్, కుటుంబ సలహా కేంద్రం నిర్వాహకుడు, 

క్షణికావేశంతో దూరమవుతున్నారు 
భార్యాభర్తలు చిన్న సమస్యకు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో అనర్థాలు జరుగుతాయి. అలా కాకుండా ఒకరిపై మరొకరికి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. జీవితం ఎంతో విలువైనది. అపోహలు, విభేదాలకు తావులేకుండా భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. అదే విధంగా గృహ హింస, వరకట్న నిరోధక చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం.       –  రాధ, కౌన్సిలర్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement