
మనసు మారిందా?
రోబోలకు మనసుంటుందా? ఎందుకు ఉండదు... కావాలంటే రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’ (తమిళంలో ‘యందిరన్’) చూడండి.
రోబోలకు మనసుంటుందా? ఎందుకు ఉండదు... కావాలంటే రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’ (తమిళంలో ‘యందిరన్’) చూడండి. చిట్టి రోబో అందాల ఐశ్వర్య మనసు దోచేయాలని ఎంత తాపత్రయపడుతుంటుందో! ఇప్పుడా సిన్మాకు సీక్వెల్‌గా రూపొందుతోన్న సినిమా ‘2.0’. రజనీ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో చిట్టి రోబో లవ్ లేడీగా అమీ జాక్సన్ నటిస్తున్నారు.
అయితే... ఇక్కడ మనసు మారిందని చెబుతున్నది ప్రేమ విషయంలో కాదు, పాటల్ని విడుదల చేసే వేదిక విషయంలో! సినిమా విడుదల తేదీ విషయంలో! వచ్చే ఏడాది జనవరి 25న సినిమా విడుదలవుతుందని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. అయితే... విడుదలను జనవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా వేశారనే వార్తలొచ్చాయి. వీటిపై ‘2.0’ యూనిట్ స్పందించింది. ‘‘మా మనసు ఏం మారలేదు. జనవరిలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని స్పష్టం చేశారు.
అలాగే, ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ సినిమా పాటల్ని దుబాయ్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్టు, అభిమానుల సమక్షంలో భారీ వేడుక నిర్వహించనున్నట్టు వార్తలొచ్చాయి. దుబాయ్‌లో కాకుండా, మన దేశంలోనే పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నారని తాజా ఖబర్. బహుశా... చెన్నై, ముంబయ్, హైదరాబాద్ నగరాల్లో తమిళ, హిందీ, తెలుగు పాటల్ని విడుదల చేసి దుబాయ్‌లో స్పెషల్ ఈవెంట్ ఏదైనా నిర్వహిస్తారేమో! ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను గ్లోబల్ సినిమా సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే.