
'మిషన్ ఇంపాజిబుల్' వెనక మనోళ్లు
న్యూఢిల్లీ: మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత దేశంలో విడుదలైన 'మిషన్ ఇంపాజిబుల్-రోగ్ నేషన్' హాలివుడ్ చిత్రానికి భారతీయ ప్రేక్షకులు కూడా భ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా చిత్రంలో కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ టాలివుడ్ చిత్రం 'బాహుబలి'లోలాగా అదరగొడుతున్నాయని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. వాస్తవానికి ఈ విజువల్ ఎఫెక్ట్స్ క్రెడిటంతా భారతీయులదే. మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలోని సాహసకృత్యాలకు గ్రాఫిక్స్‌తో ప్రాణం తీసుకొచ్చిందీ ధీరేంద్ర ఛాట్‌పర్, సౌరబ్ నందేడ్కర్, అభిషేక్ సింగ్, ఇంద్రానిల్ భట్టాచార్య తదితర భారతీయులు.
జూలై 30వ తేదీన అమెరికాలో విడుదలై భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్సే హైలెట్స్ అని న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఈ సినిమాను రివ్యూ చేసిన ప్రముఖ విమర్శకుడు మనోహ్లా డర్గీస్ పేర్కొన్నారు. ఇంపాజిబుల్ మిషన్‌ను పాజిబుల్ చేసిందీ విజువల్ ఎఫెక్ట్స్ టీమేనని ఆయన ప్రశంసించడం విశేషం.
53 ఏళ్ల టామ్ క్రూయిజ్ నటించిన ఈ చిత్రానికి ధీరేంద్ర ఛాట్‌పర్ విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటర్‌గా పనిచేశారు. ఇటు భారత్‌లో, అమెరికాలో పలు చిత్రాలకు పనిచేస్తున్న ఛాట్‌పర్ తన కెరీర్‌ను 2012లో 'మిర్రర్ మిర్రర్' చిత్రంతో ప్రారంభమైంది. ఇటీవలనే 500 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లు వసూలు చేసిన బాలివుడ్ చిత్రం బజరంగ్ భాయిజాన్‌కు విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటర్‌గా పనిచేసిందీ ఆయనే. హమారి అధూరి కహాని, తను వెడ్స్ మను అనే చిత్రాలు ఆయన వృత్తి నైపుణ్యానికి మరికొన్ని మచ్చుతునకలు. ఇంతకుముందు ఎడ్జ్ ఆఫ్ టుమారో, గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలాక్సీ, వైట్‌హౌజ్ డౌన్, సిన్ సిటీ: ఏ డేమ్ టు కిల్ ఫర్ లాంటి హాలివుడ్ చిత్రాలకు పనిచేశారు.
ఇక మిషన్ ఇంపాజిబుల్‌కు డిజిటల్ కంపోజిటర్లుగా పనిచేసిన సౌరబ్ నందేడ్కర్, అభిషేక్ సింగ్‌లు బాలివుడ్ చిత్రం బర్ఫీ, హాలివుడ్ చిత్రాలు సిన్ సిటీ: ఏ డేమ్ టు కిల్ ఫర్‌కు పనిచేశారు. ఏబీసీడీ: ఎనీబడీ కెన్ డేన్స్, నాన్ స్టాప్, బాగ్ మిల్కా బాట్ లాంటి చిత్రాలతోని కూడా సౌరబ్ నందేక్కర్‌కు మంచి పేరు వచ్చింది. ఇంద్రానిల్ భట్టాచార్య ఇంతకుముందు దబాంగ్-2, హౌజ్‌ఫుల్-2 లాంటి చిత్రాలకు పని చేశారు.