ఓ అరుదైన రికార్డ్!
ఒక భాషలో ఒకేసారి ఒక సినిమా తీయడమే కష్టం. అలాంటిది ఏకంగా నాలుగు భాషల్లో తీయడం అంటే మాటలు కాదు. కానీ, పక్కా ప్రణాళిక ఉంటే తీయొచ్చని ‘రెడ్ అలర్ట్’ బృందం నిరూపించింది. హెచ్.హెచ్. మహదేవ్, రవి, అమర్, తేజ, అంజనా మీనన్ ముఖ్య తారలుగా చంద్రమహేశ్ దర్శకత్వంలో పీవీ శ్రీరామ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన తొలి సినిమాగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. చిత్రదర్శకుడు చంద్రమహేశ్‌ను అభినందిస్తూ, ఇండియన్ వరల్డ్ రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను అందజేసింది. చంద్రమహేశ్ మాట్లాడుతూ - ‘‘ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఈ చిత్రం చేశాం. ఈ రికార్డ్ ద్వారా మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది.
ఇప్పటికే కన్నడ వెర్షన్‌ను విడుదల చేశాం. అక్కడ సూపర్ హిట్ కావడం మరో ఆనందం. అలాగే, మలయాళ చిత్రం కూడా మంచి టాక్‌తో ముందుకెళుతోంది. తమిళ వెర్షన్‌ను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నాం. తెలుగు వెర్షన్ పాటలను ఈ నెలాఖరున, చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రీమతి శ్రీరామ్ పిన్నింటి సత్యరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. జైపాల్‌రెడ్డి.