
‘‘దర్శకులు ఎంతో ఇష్టపడి రాసుకొచ్చిన కథను హడావిడిగా వినేసి ‘యస్’ ఆర్ ‘నో’ అని చెప్పే టైప్ కాదు నేను. ఓ రోజంతా కథ ప్రశాంతంగా వింటా. ఆ తర్వాత నా నిర్ణయం చెబుతా. ‘నిన్ను కోరి’ టైమ్‌లో సుకుమార్‌గారు రెండు గంటల్లో నాకు ‘రంగస్థలం’ కథ చెప్పారు. ఆయనపై ఉన్న కాన్ఫిడెన్స్, కథపై ఉన్న నమ్మకంతో టైమ్ తీసుకోకుండా ‘ఈ సినిమా నేను చేస్తాను’ అని చెప్పా’’ అని నటుడు ఆది పినిశెట్టి అన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్) నిర్మించిన ‘రంగస్థలం’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ చేసిన చిట్టిబాబు పాత్రకు అన్నగా కుమార్‌బాబు పాత్రలో ప్రేక్షకులను అలరించిన ఆది మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
►‘రంగస్థలం’లో కుమార్‌బాబు లాంటి పాత్ర నేనిప్పటివరకూ చేయలేదు. ఈ చిత్రంలో నా పాత్ర చనిపోతుందనే విషయం అమ్మ, నాన్న (దర్శకుడు రవిరాజా పినిశెట్టి)లకు చెప్పలేదు. అమ్మ, నాన్న, ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూశా. నా పాత్ర చనిపోయినప్పుడు వారంతా చిన్నపిల్లల్లా ఏడ్చేశారు. అదే నా బెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తా. అమ్మ చేయి పట్టుకుని ‘అది సినిమా’ అని ధైర్యం చెప్పా.
► ‘సరైనోడు’ సినిమా నుంచి తెలుగులో మంచి పాత్రలొస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఆదిరిస్తున్నారు. ‘నిన్నుకోరి, అజ్ఞాతవాసి, రంగస్థలం’ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ‘రంగస్థలం’ సినిమాలో ప్రేక్షకులు ఇన్‌వాల్వ్ అయ్యి ఏడవడం చూశా. ఇలాంటి హానెస్ట్ సినిమా తెలుగులో వచ్చి చాలా ఏళ్లవుతోంది. వెరీ హానెస్ట్ ఫిల్మ్.
►కుమార్‌బాబు పాత్రకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తుండటంతో ఫుల్ హ్యాపీ. ఓ నటుడికి ఇంతకంటే ఇంకేం కావాలి? డబ్బులు కాదు... సంతృప్తి ముఖ్యం. ‘రంగస్థలం’ తర్వాత నాపై మరింత బాధ్యత పెరిగింది. మంచి పాత్రలు, సినిమాలు ఎంచుకోవాలి. మా సినిమాని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
►నా పాత్ర నెగెటివ్వా? పాజిటివ్వా? అని ఆలోచించను. కథ బాగుంటే చేసేస్తా. అసలు నాకు హీరో, విలన్, కమెడియన్.. అనే ఆలోచన ఉండదు. అసలు.. హీరో అంటే ఎవరు? అందరం నటులమే. రియల్ హీరోలు బోర్డర్‌లో ఉంటారు. నా దృష్టిలో వాళ్లే హీరోలు. హీరో అంటే లీడ్ రోల్ చేసేవారు. నేను కూడా లీడ్ రోల్స్ అయితేనే చేస్తా అంటే ఎన్నో మంచి పాత్రలు మిస్ అయ్యేవాణ్ణి.
► నాన్నగారు లేకుంటే నేనీ స్థాయిలో ఉండేవాణ్ణి కాదు. ఆయన సినిమాని ఎంత ప్రేమించేవారో చిన్నప్పటి నుంచి చూశాం. అందుకే నాకూ సినిమా అంటే అంత ప్రేమ. నేను కథ విన్నాక నాన్నగారితో పంచుకుంటా. ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది.
►‘రంగస్థలం’ కథని రాయడం ఒక ఎత్తయితే.. దాన్ని అలానే తెరపైకి తీసుకురావడం మరో ఎత్తు. సుకుమార్‌గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన వన్నాఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇలాంటి సినిమా తీయాలంటే నిర్మాతలకు చాలా ఓపిక కావాలి. నవీన్, రవిశంకర్, మోహన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారు. వారి పాజిటివ్ ఎనర్జీ కూడా సినిమాకి ప్లస్ అయింది.
►మా సినిమాకు సంగీతం, కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్.. నాలుగు పిల్లర్స్‌లా నిలిచాయి. నా పాత్ర చనిపోయిన సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు ఒక మనిషి చచ్చిపోతే ఇంతలా ఏడుస్తారా? అని పించింది. రోహిణీగారు రియల్‌గా ఏడ్చారు. ఆ పాత్రలో అంతలా జీవించారామె. నరేశ్‌గారి పాత్ర కూడా సూపర్బ్.
►ప్రస్తుతం నేను లీడ్‌రోల్‌లో తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్స్‌గా చేస్తున్న సినిమా సెట్స్‌పై ఉంది. మరో రెండు ద్విభాషా చిత్రాలు సెట్స్‌కి వెళ్లాల్సి ఉంది.
►చిట్టిబాబు పాత్రలో చరణ్‌ని తప్ప వేరే ఎవర్నీ ఊహించలేకపోయా. తను చేసినంత ఈజ్, డెప్త్‌తో ఎవరూ చేసి ఉండేవారు కాదేమో? ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ క్రెడిట్ సుకుమార్, చెర్రీలదే. ఈ సినిమా ద్వారా చిట్టిబాబు రూపంలో నాకో తమ్ముడు దొరికాడు. నాకు తమ్ముడు లేని లోటు తీరింది. సమంత చాలా వైవిధ్యమైన పాత్ర చేశారు.
Comments
Please login to add a commentAdd a comment