మనిషి తిండిలో కలిపారు.. మట్టి | Aakalai Annamadigite Song In Desoddarakulu | Sakshi
Sakshi News home page

మనిషి తిండిలో కలిపారు మట్టి

Published Sun, Feb 23 2020 11:49 AM | Last Updated on Sun, Feb 23 2020 11:49 AM

Aakalai Annamadigite Song In Desoddarakulu - Sakshi

బసవరాజు ప్రసాదరావు, పద్మనాభం తమ్ముడు: దేశోద్ధారకులు (1973) చిత్రంలోని ‘ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు/కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్లు/నన్ను పిచ్చోడన్నారు నాయాళ్లు’ పాటను అన్నయ్య ఇంట్లో బాగా ఎక్కువగా పాడుతుండేవాడు. అది తనకు చాలా ఇష్టమైన పాట అని చెబుతుండేవాడు. 
ఈ పాటను విజయవాడలోని గాంధీ హిల్స్‌ మీద 1973 ఫిబ్రవరి నెలలో తీశారు. విజయవాడలో ఎండలు బాగా ఎక్కువ. అటువంటి ప్రదేశంలో అన్నయ్య కాళ్లకు చెప్పులు లేకుండా నటించాడు. కాళ్లకు బొబ్బలు కూడా ఎక్కాయి. ఈ పాట షూటింగ్‌ ఒకటిన్నర రోజులలో పూర్తయింది. గాంధీ హిల్‌తో పాటు బెంజి సర్కిల్, కృష్టా బ్యారేజీ దగ్గర తీశారు. 
‘‘పెళ్లాము పుస్తి తాకట్టు పెట్టి/పచారు కొట్టుకి సామాను కెడితే/కొలిచారు రాళ్లు నాయాళ్లు’’ అంటూ ఏడుస్తూ పాడతాడు అన్నయ్య. ఎక్కడ చూసినా కల్తీ మందులు, కల్తీ దినుసులే అనే ఆవేదన కనిపిస్తుంది ఈ చరణంలో. హృదయ విదారకమైన సన్నివేశాలతో కూడిన పాట ఇది. అందువల్ల ఇది హృదయంలో నాటుకుపోయింది. ‘‘ఇచ్చిన సరుకులో పుచ్చింది సగపాలు/కొలిచిన సరుకులో మిగిలేది అర పాలు/రివాజు తప్పి లంచాలు పెట్టి కలిపారు మట్టి నాయాళ్లు/మనిషి తిండిలో కలిపారు మట్టి నాయాళ్లు’’ అంటూ గుండెలు పగిలేలా పాడతాడు అన్నయ్య. 

అన్నయ్యకు సినిమాలు తగ్గిపోయాక ముఖ్యంగా ఆఖరి రోజుల్లో పది సంవత్సరాల పాటు నాటకాలు వేశాడు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి వేషం వేస్తున్నప్పుడు ప్రేక్షకులు ఈ పాట పాడమని కోరేవారు. ఒకసారితో ఆగేవారు కాదు. వన్స్‌మోర్‌ అనగానే మళ్లీ పాడేవాడు. ‘దేశాన్నుద్ధరించడానికి పుట్టామంటారు నాయాళ్లు/దేశానికే చీడపురుగులు ఈ దొంగనాయాళ్లు/పుచ్చి పోయిన సరుకులాగానే పుచ్చిపోతారు నాయాళ్లు/పురుగులు పడి చస్తారు ఈ దొంగ నాయాళ్లు’ అనే చరణంలో అన్నయ్య నటన చూస్తే ఇప్పటికీ మాకు కళ్లలో నీళ్లు ఆగవు. ఎంతో ఆవేదనతో కూడిన పాత్ర ఇది. అన్నయ్యకు పాడటం వచ్చు కనుక ఆ పాటను అందరూ మెచ్చుకునేలా పాడేవాడు. అప్పుడప్పుడు మా దగ్గర కూడా పాడేవాడు. 
మా అన్నయ్య మా చేత శ్రీపద్మా పిక్చర్స్‌ అనే డిస్ట్రిబ్యూషన్‌ సంస్థను పెట్టించాడు. ‘గండర గండడు’ సినిమాతో ప్రారంభమై, సుమారు 30 సినిమాలు తీశాం. 
ఈ సినిమా కడపలో రెండు వందల రోజులు ఆడింది. భారీ ఎత్తున ఫంక్షన్‌ ఏర్పాటుచేశారు. ఈ ఫంక్షన్‌కి మా అన్నయ్యను ఒక రిక్షాలో కూర్చోబెట్టి, 400 రిక్షాలతో ఊరేగింపుగా రైలు నుంచి డప్పులు కొట్టుకుంటూ థియేటర్‌ వరకు తీసుకువచ్చారు. ఈ పాటలో అన్నయ్య రిక్షా తొక్కాడు కనుక, రిక్షా వారంతా వచ్చారు. థియేటర్‌లో అన్నయ్యకు అతిథి సత్కారాలు చేశారు.
సంభాషణ: వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement