మాటిచ్చి మరచినందుకు ప్రతిఫలం ఇది | Aamir Khan disappoints Bihar's Mountain Man's family | Sakshi
Sakshi News home page

మాటిచ్చి మరచినందుకు ప్రతిఫలం ఇది

Published Sun, May 4 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

మాటిచ్చి మరచినందుకు ప్రతిఫలం ఇది

మాటిచ్చి మరచినందుకు ప్రతిఫలం ఇది

 సమాజానికి ఎప్పుడూ మంచే చేసేవాడు.. తన గ్రహపాటు బాగుండక ఓ పొరపాటు చేస్తే... అంతవరకూ  చేసిన మంచి అంతా హుష్ పటాక్ అయిపోతుంది. ప్రస్తుతం మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు. ‘సత్యమేవ జయతే’ టీవీ షోలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి తన వంతు కృషి చేస్తున్నారు ఆమిర్. ఈ నేపథ్యంలో ఎన్నో కుటుంబాలకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారు. అయితే... ఇటీవల ఆయన విషయంలో ఓ పొరపాటు దొర్లింది.
 
 దాంతో నిందల్ని మోయాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకెళ్తే- ‘సత్యమేవ జయతే’ షోలో భాగంగా బీహార్‌లోని ఓ పల్లెటూరికి వెళ్లారు ఆమిర్. అక్కడ భగీరథ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిశారు. భగీరథది చాలా బీద కుటుంబం. అతని భార్య పేరు బసంతీదేవి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్నం భోజనం తయారు చేయడం ఈ దంపతుల పని. ఓ వైపు ఆర్థిక బాధలు, మరో వైపు బసంతీదేవి ఆనారోగ్యం ఆ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇదంతా దగ్గరుండి తెలుసుకున్నారు ఆమిర్. ‘మీ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాను’ అని భగీరథకు మాటిచ్చేశారు.
 
 త్వరలోనే తన మనుషులు కొంతమంది మిమ్మల్ని కలుస్తారని, మీ ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో... వాటన్నింటినీ తొలగించి, మీకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా సమకూరుస్తారని ఆమిర్ మాటివ్వడంతో భగీరథ కుటుంబం ఆనందానికి పట్టపగ్గాల్లేవ్. కట్ చేస్తే... రోజులు గడిచిపోతున్నాయి. ఆమిర్ దగ్గర్నుంచి ఎవ్వరూ భగీరథను కలవడానికి రాలేదు. ఓ వైపు బసంతీదేవి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమీర్ నుంచి మాత్రం ఎలాంటి వర్తమానం లేదు. బసంతీదేవి పరిస్థితి విషమించి, చివరకు ఆమె చనిపోయింది. తన భార్యకు అంతిమ సంస్కారం చేయడానికి కూడా భగీరథ దగ్గర డబ్బుల్లేవు. చివరకు ఓ స్వచ్ఛంద సేవాసంస్థ అందించిన సాయంతో ఆంత్యక్రియలు పూర్తి చేశాడు భగీరథ.
 
 ‘‘ఆమీర్ సకాలంలో సాయం అందించి ఉంటే... నా భార్య నాకు దక్కేది. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు’’ అని బాహాటంగా విమర్శలు గుప్పించాడు భగీరథ. నిజానికి ఆమిర్‌ఖాన్ బాలీవుడ్‌లో తిరుగులేని సూపర్‌స్టార్. క్షణం తీరిక లేని జీవితం ఆయనది. అంత బిజీలో కూడా సమాజానికి ఏదైనా చేయాలనే దృక్పధం ఆమిర్‌లో కనిపిస్తుంది. దానికి ఉదాహరణే ‘సత్యమేవ జయతే’. దాని ద్వారా ఎందరినో ఆదుకున్నారాయన. అంత చేసినా... మరపు వల్ల తాను చేసిన ఓ చిన్న పొరపాటు ఆయనకు ఈ మచ్చను తెచ్చిపెట్టింది. పాపం ఆమిర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement