'స్వలింగ సంపర్కం'పై అమీర్ ఖాన్ కు నోటీసులు
చండీగఢ్: సత్యమేవ జయతే టీవీ కార్యక్రమం ద్వారా బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించారంటూ దాఖలైన పిటిషన్ మేరకు చండీగఢ్‌లోని ఓ కోర్టు అతడికి నోటీసులు జారీ చేసింది. దీనిపై డిసెంబర్ 19లోపు స్పందన తెలియజేయాలని అమీర్‌ఖాన్‌ను శుక్రవారం ఆదేశించింది. అమీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సత్యమేవ జయతే కార్యక్రమం ఇటీవల ఎంతో ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో స్వలింగ సంపర్కంపై అమీర్ ఖాన్ చర్చించిన నేపథ్యంలో దాఖలైన పిటీషన్ పై కోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించేలా ఉందని మహిళా న్యాయవాది మణిదీప్ కౌర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
అమీర్‌ఖాన్ ప్రవర్తనను కోర్టు ధిక్కారంగా ఉందని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. అక్టోబర్ 19న ఓ ప్రైవేట్ టీవీ చానల్‌లో ప్రసారమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో... నపుంసకులు, స్వలింగ సంపర్కుల జీవన విధానం, వారి హక్కులపై చర్చ జరిగిందని కౌర్ కోర్టుకు వివరించారు.