![Aamir Khan Help Saves Life Of Dangal Sound Designer - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/11/aamir-khan.jpg.webp?itok=_Ody_we1)
ముంబై : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ వల్లే తన సోదరుడు బతికాడంటూ సౌండ్ ఇంజనీర్ షాజిత్ కోయర్ సోదరి భావోద్వేగానికి గురయ్యారు. ఆయనే గనుక సమయానికి ఆదుకోకపోయి ఉంటే తన సోదరుడి పరిస్థితి ఏమయ్యేదో అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. ఆమిర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘దంగల్’ కు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేసిన షాజిత్ కోయర్(44) కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గత మంగళవారం అతడిని ముంబైలోని లీలా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతడికి గుండె నొప్పి కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ సమయంలో లీలావతి ఆస్పత్రి వైద్యులెవరూ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమిర్ ఖాన్ సాయం కోరారు. వెంటనే స్పందించిన ఆమిర్.. షాజిత్‌ను కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. అదే విధంగా అనిల్ అంబానీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వెంటనే వైద్యం అందేలా చేశాడు. ప్రస్తుతం షాజిత్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా 2006లో విడుదలైన ‘ఓంకార’ సినిమాకు గానూ షాజిత్ జాతీయ అవార్డు పొందాడు. రెండు ఫిల్మ్‌ఫేర్, రెండు ఐఫా అవార్డులు కూడా అతడి ప్రతిభకు గుర్తింపుగా లభించాయి. అయితే కళా రంగానికి సేవ చేస్తున్న తన సోదరుడి పట్ల లీలావతి ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని షాజిత్ సోదరి ఆరోపించారు. దీంతో అర్ధరాత్రి సమయంలో ఆమిర్‌ను సాయం అడగాల్సి వచ్చిందని, ఆయన సరైన సమయంలో స్పందించినందువల్లే షాజిత్ బతికాడని అన్నారు. లీలావతి ఆస్పత్రి యాజమాన్యం ఆమె ఆరోపణలు ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment