తనుశ్రీ- నానా పటేకర్ వివాదంతో మొదలైన మీటూ ఉద్యమం బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సీనియర్ నటుడు అలోక్ నాథ్ మొదలు దర్శకుడు వికాస్ బల్ వరకు చాలా మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ- సిరీస్‌వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ బయోపిక్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమిర్ ఖాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. మొఘల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుభాష్ కపూర్ (జాలి ఎల్‌ఎల్‌బీ ఫేం) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సుభాష్ తనను లైంగికంగా వేధించాడంటూ నటి గీతిక 2014లో అతడిపై కేసు నమోదు చేసింది. ఓ పార్టీలో తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. తాజాగా మీటూ ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో మరోసారి సుభాష్ వ్యవహారం చర్చనీయాంశమైంది. దీంతో సుభాష్ సినిమా నుంచి తప్పుకొంటున్నట్లు ఆమిర్ ఖాన్ తెలిపారు.
‘లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సహించదు. గత రెండు వారాలుగా మీటూ ఉద్యమం ఉధృతమవుతోంది. అయితే ఓ వ్యక్తితో కలిసి సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నాం. ఆ వ్యక్తి గురించి ఇప్పుడే తెలిసింది. అయినా దోషులెవరో న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకొంటున్నాం’ అంటూ ఆమిర్ ఖాన్, కిరణ్ రావు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
కాగా నానా పటేకర్‌పై తనుశ్రీ ఆరోపణల విషయంపై స్పందించాల్సిందిగా మీడియా కోరిన సమయంలో మాట దాటేసిన ఆమిర్ ఖాన్‌కు.. 2014లో సుభాష్ కపూర్‌పై కేసు నమోదైన విషయం కూడా ఇంత ఆలస్యంగా తెలిసి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment