నకల కళా వల్లభులు
రోల్ మోడల్ అనుకుంటే, ఉన్నదాన్నే రీ మోడల్ చేసి గుట్టు చప్పుడు కాకుండా వదిలాడని ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు నోళ్లు నొక్కుకుంటున్నాయి ఆమిర్‌ఖాన్ గురించి. ‘సత్యమేవ జయతే’ లాంటి సత్యమైన ప్రోగ్రాములు ఓ పక్క చేస్తూ, ఇంకో పక్క పరదేశీ పోస్టర్లని కాపీ కొట్టడమేంటని ఆమిర్‌ఖాన్ నగ్న ప్రయత్నం భగ్నం అవడం చూసి ఆశ్చర్యపోయింది బాలీవుడ్. ఆమిర్‌ఖాన్ ‘పీకే’ కాపీనా? కాదా? అనే విషయం సినిమా విడుదలయ్యేంతవరకూ తెలియదు కానీ... పోస్టర్లు కాపీ కొట్టడం అనే సబ్జెక్టు ఇండియన్ సినిమా సిలబస్‌కి కొత్తేం కాదు.
సినిమా అయినా, పోస్టర్ అయినా ఒక ఆలోచన నుంచి పుట్టాల్సిందే. ఒక సూపర్ ఆలోచనను చూడగానే, మనం కూడా ఇలాంటిదే ఒకటి చెయ్యాలి అని ఆలోచించడం సినీమానవుల నైజం. దాని నుండి ఇన్‌స్పైర్ అయ్యి పోస్టర్ చేద్దామనుకుంటారు కానీ, చివరకు కాపీలు అయిపోతుంటాయి. ఒకరు పరభాషలోని సినిమా పోస్టర్‌ని చూసి కాపీ కొడితే, ఇంకొకరు దాన్నిచూసి కాపీ కొట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడైతే బయటపడడం కష్టం కానీ, ఇప్పుడు అంతా ఇంటర్‌నెట్ జమానా అవడంతో... వరల్డ్ సినిమా అందరి హార్ట్‌డిస్క్‌ల్లో ఉంటుంది. కాపీ రాయుళ్ల కళా విలాసాలు తెల్లారేసరికి బట్టబయలైపోతాయి. అలా ఇంటర్నెంట్ తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని కళాత్మక పోస్టర్లు, వాటి నుంచి చేయబడిన ‘నకలా’త్మక పోస్టర్లపై స్పెషల్ లుక్.