
టాప్ హీరోకు స్వైన్‌ప్లూ
ముంబై/పుణె: బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్‌ఖాన్, ఆయన భార్య కిరణ్‌రావులకు స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. దీంతో ఆదివారం సాయంత్రం పుణెలో ఆమీర్‌కు చెందిన పానీ ఫౌండేషన్ నేతృత్వంలో నిర్వహించిన ‘సత్యమేవ జయతే వాటర్ కప్ 2017’ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఆమిర్‌ఖాన్ హాజరుకాలేకపోయారు. ప్రత్యక్ష వీడియో ద్వారా సదస్సుకు హాజరైనవారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తమకు సోకిన స్వైన్‌ఫ్లూ ఇతరులకు వ్యాపించకూడదనే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని ఆమిర్ ఖాన్ తెలిపారు. తనకు బదులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని స్నేహితుడు షారూఖ్‌ఖాన్‌ను కోరడంతో ఆయన హాజరయ్యారని వెల్లడించారు. సత్యమేవ జయతే వాటర్ కప్ 2017లో భాగస్వాములైన గ్రామాలను ఆయన అభినందించారు.
'ఈ కార్యక్రమానికి రావాలని అనుకున్నాం. కానీ ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో నాకు హెచ్1ఎన్1 వైరస్ సోకిందని తెలిసింది. విశ్రాంతి తీసుకోవాలని, ఎటువంటి పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లరాదని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహామేరకు ఇతరులకు వ్యాపించకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రాలేకపోయాన'ని ఆమిర్ వీడియో ద్వారా తెలిపారు. కిరణ్‌రావు కూడా వీడియోలో ఆయన పక్కనే ఉన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ, పారిశ్రామికవేత్త రాజీవ్ బజాజ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.