త్రీటర్న్‌ముగ్గురు ఖాన్‌ల కహానీ | Aamir Salman Shahrukh is now on hunger for success | Sakshi
Sakshi News home page

త్రీటర్న్‌ముగ్గురు ఖాన్‌ల కహానీ

Published Tue, Feb 12 2019 1:12 AM | Last Updated on Tue, Feb 12 2019 1:12 AM

Aamir Salman Shahrukh is now on hunger for success - Sakshi

బాలీవుడ్‌ త్రిమూర్తులు వాళ్లు ............ ఒకప్పుడు.మరింకిప్పుడు? ముగ్గురికీ పుష్కలంగా ఫ్లవర్లు పడ్డాయి.హిట్టు కొట్టాలని ఉన్నా కొట్టగలమా అనే సందేహంఉండే ఉండుంటుంది. ఒకప్పుడు యంగ్‌ హీరోలు వెనకాల్నించితరుముకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ముందు పరిగెడుతూకనిపిస్తున్నారు. ముగ్గురికీ ఇది తరమగీతమేనా? సక్సెస్‌ వైపు ముగ్గురూ రిటర్న్‌ అవుతారా? అదే ఈ త్రీటర్న్‌ స్టోరీ.

ఆమిర్‌ ఖాన్‌ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ పేల లేదు.సల్మాన్‌ ఖాన్‌ ‘రేస్‌ 3’ ట్రాక్‌లో నిలువలేదు.షారుక్‌ ఖాన్‌ ‘జీరో’ జీరో రిజల్ట్స్‌ ఇచ్చింది.ఖాన్‌లు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు.వాళ్లకు హిట్స్‌ కావాలి.వాళ్ల ఖాన్‌దాన్‌కు కంటిన్యూయేషన్‌ కావాలి.కానీ మారిన పరిస్థితుల్లో రెండూ కష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.భారతీయ పురాణాలలో త్రిమూర్తులు ఎవరో మనకు తెలుసు. కానీ బాలీవుడ్‌ పురాణంలో కూడా త్రిమూర్తులు ఉన్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా వీరు హిందీ సినిమాను ఏలుతున్నారు. ఖాన్‌ త్రయంగా పేరు తెచ్చుకున్నారు. ఆమిర్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌... ఈ ముగ్గురూ ఇప్పుడు సరైన సక్సెస్‌ కోసం ఆకలి మీద ఉన్నారు. ఎందుకంటే ఇది ఖాన్‌ల ఇజ్జత్‌ కా సవాల్‌.

ఖాన్‌దాన్‌
బాలీవుడ్‌ స్టార్‌డమ్‌ను చూసిన తొలి ఖాన్‌ యూసఫ్‌ ఖాన్‌ అలియాస్‌ దిలీప్‌ కుమార్‌. అప్పట్లో బాలీవుడ్‌ను ఏలిన దేవ్‌ ఆనంద్, రాజ్‌ కపూర్‌లతో దిలీప్‌ కుమార్‌ కలవడంతో వారు స్టార్‌ త్రయంగా మారారు. ముగ్గురూ మూడు ధోరణుల్లో పని చేసినా ఒక నటుడుగా మిగిలిన ఇద్దరి కంటే దిలీప్‌ కుమార్‌ ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. ఆ సమయంలోనే ‘మదర్‌ ఇండియా’ వంటి గొప్ప సినిమాలు తీసిన దర్శక–నిర్మాత మెహబూబ్‌ ఖాన్, ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ తదితర బ్లాక్‌బస్టర్స్‌ తీసిన నాసిర్‌ హుసేన్‌ ఖాన్, ‘అజిత్‌’ పేరుతో ఫేమస్‌ అయిన విలన్‌ హమిద్‌ ఖాన్‌ వీరంతా బాలీవుడ్‌లో ఖాన్‌ల ఖాన్‌దాన్‌ను బలపరిచారు. కానీ దిలీప్‌కుమార్‌లా పెద్ద హీరో కాదగిన ఖాన్‌ రాలేదు. ఫిరోజ్‌ ఖాన్‌ కొన్ని సినిమాలు చేసినా, విలన్‌గా అమ్జాద్‌ ఖాన్‌ వచ్చినా స్టార్‌ హీరోగా ఎవరూ ఎదగలేకపోయారు.

ఆమిర్‌తో షురూ
మళ్లీ ఖాన్‌ ఈజ్‌ ద బెస్ట్‌ అనిపించడానికి 1988లో ఆమిర్‌ ఖాన్‌ రావాల్సి వచ్చింది. అతడు చేసిన ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ మరుసటి సంవత్సరమే సల్మాన్‌ ఖాన్‌ ‘మైనే ప్యార్‌ కియా’ వచ్చింది. అదీ కలెక్షన్ల వరద సృష్టించింది. జనం వీళ్లిద్దరినీ చప్పట్లతో ఆహ్వానిస్తూ ఉండగా మూడేళ్ల విరామం తర్వాత షారుక్‌ ఖాన్‌ 1992లో ‘బాజీగర్‌’తో వెండి తెర మీద వెలిగాడు. 1995లో వచ్చిన ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ మెగా హిట్‌తో అతడి స్థానం ఆజన్మాంతం స్థిరపడింది. దాంతో ముగ్గురు ఖాన్‌లు వెండి తెర మీద చెలరేగిపోయారు.

‘హమ్‌ హై రాహీ ప్యార్‌ కే’, ‘ఇష్క్‌’, ‘రాజా హిందూస్తానీ’, ‘గులామ్‌’, ‘మన్‌’, ‘సర్ఫరోష్‌’, ‘లగాన్‌’ వంటి హిట్స్‌తో ఆమిర్‌ ఖాన్, ‘సాజన్‌’, ‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’, ‘జుడ్‌వా’, ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’, ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ హిట్స్‌తో సల్మాన్‌ ఖాన్, ‘పర్‌దేశ్‌’, ‘దిల్‌ తో పాగల్‌ హై’, ‘కుచ్‌ కుచ్‌ హోతాహై’, ‘మై హూనా’ వంటి హిట్స్‌తో షారుక్‌ ఖాన్‌ తమ స్థానం తిరుగులేనిదని నిరూపించుకున్నారు. కాలం గడిచే కొద్దీ ఎక్కువ సినిమాలు చేయడం మాని చేసే ఒక్క సినిమా భారీ కలెక్షన్లు వచ్చేలా ఉండాలనే స్థాయికి వీరు వెళ్లారు.

‘డాన్‌ 2’. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘ఫ్యాన్‌’, ‘రయీస్‌’ వంటి ఒన్‌ మేన్‌ షో సినిమాలను షారుక్‌ ఖాన్‌ చేస్తే, ‘కిక్‌’, ‘బజరంగీ భాయ్‌జాన్‌’, ‘సుల్తాన్‌’, ‘ట్యూబ్‌ లైట్‌’, ‘టైగర్‌ జిందా హై’ వంటి ఒన్‌మేన్‌ షో సినిమాలను సల్మాన్‌ చేశాడు. ఇక ఆమిర్‌ ఖాన్‌ చాలా ఏళ్లుగా ప్రతి సినిమా ముఖ్యమైన సినిమాగా భావిస్తూ ‘తారే జమీన్‌ పర్‌’,‘గజనీ’, ‘త్రీ ఇడియెట్స్‌’, ‘పికె’, ‘దంగల్‌’ చేశాడు. స్థిరపడ్డ ఈ ఖాన్‌ త్రయాన్ని ఛేదించే ప్రయత్నాలు కొన్ని జరిగాయి. హృతిక్‌ రోషన్‌ వచ్చినప్పుడు వీళ్లు ముగ్గురూ చెదిరిపోతారని భావించారు.

కానీ అలా జరగలేదు. అక్షయ్‌ కుమార్, సంజయ్‌ దత్, అజయ్‌ దేవ్‌గణ్‌ వంటి హీరోలు సాటి హీరోలుగా నిలబడ్డారు తప్ప ఖాన్‌లను మించిన హీరోలు కాలేకపోయారు.అయితే వెండితెర ఎప్పుడూ యంగ్‌ గానే ఉంటుంది. హీరోలకు వయసు మీద పడుతుంది. ఇప్పుడు ఈ ముగ్గురి వయసు సరిగ్గా 53 సంవత్సరాలు. వీరికి తగ్గ కథలు, వీరు హిట్‌ ఇవ్వాలంటే కావలసిన దినుసులు ఏమిటా అనేది ఇప్పుడు సందేహంతో చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

సవాల్‌ విసురుతున్న కుర్రకారు...
మరోవైపు బాలీవుడ్‌లో ఇప్పుడు కుర్రకారు మంచి జోష్‌ మీద ఉంది. రణవీర్‌ సింగ్‌ దాదాపు ఖాన్‌ హోదాను పొందినట్టే అని అతడు సాధిస్తున్న విజయాలతో బాలీవుడ్‌ పండితులు కితాబు ఇస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ మరోవైపు పెద్ద హీరోగా మారాడు. వరుణ్‌ ధావన్, రాజ్‌ కుమార్‌ రావ్, షాహిద్‌ కపూర్‌లతో పాటు నిన్న మొన్న వచ్చిన టైగర్‌ షరాఫ్, విక్కీ కౌశల్‌ వంటి వారు కూడా గట్టిగా నిలబడ్డారు. వీరెవరూ ఖాన్‌ల ఖాన్‌దాన్‌కు కొనసాగింపుగా వచ్చినవారు కాదు.

నిజానికి ఫిరోజ్‌ ఖాన్‌ కుమారుడు ఫర్దీన్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌ మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్, సంజయ్‌ ఖాన్‌ కొడుకు జాయెద్‌ఖాన్‌ వీరెవరూ ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. యువ హీరోల్లో ఒక్క ఖాన్‌ కూడా ఇప్పుడు లేనట్టే. డిఫరెంట్‌ హీరోగా నిలబడ్డ ఇర్ఫాన్‌ ఖాన్‌ ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కోలుకొని వచ్చి తిరిగి హిట్స్‌ ఇచ్చినా ఇప్పటి జనరేషన్‌ మేటనీ ఐడల్‌ కాబోడు. కనుక సీనియర్‌ ఖాన్‌లే ఖాన్‌ల పరువును నిలబెట్టుకోవాల్సి వుంటుంది.

ఇప్పుడు ఏం చేస్తున్నారు?
ఇప్పుడు ముగ్గురు ఖాన్‌లు ఏం చేస్తున్నారంటే.. సల్మాన్‌ ‘భారత్‌’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఒక కొరియన్‌ సినిమా ఆధారంగా ‘పోలీస్‌ స్టోరీ’ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. అతడికి గతంలో బ్రహ్మాండమైన హిట్స్‌ ఇచ్చిన దర్శకుడు సూరజ్‌ బర్‌జాత్యాతో కూడా ఒక సినిమా చేయనున్నాడని కథనం. ఆమిర్, షారుక్‌ల సినిమాలు అధికారికంగా నిర్ధారణ కాలేదు. తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుడు రాకేష్‌ శర్మ జీవితం ఆధారంగా నిర్మితమవుతున్న ‘సారే జహాసే అచ్ఛా’ సినిమా నుంచి షారుక్‌ తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా నుంచి బయటకు వస్తే ఏ సినిమా చేస్తాడో చూడాలి. ఇక ఆమిర్‌ స్క్రిప్ట్‌లు చదువుతున్నాడు.

క్యాసెట్‌ కింగ్‌ గుల్షన్‌ కుమార్‌ బయోపిక్‌లో ఆమిర్‌ నటిస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే అవి నిర్ధారితం కాలేదు. ఖాన్‌లకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఒక్క సినిమా ఫ్లాప్‌ అయితే వీరికొచ్చిన నష్టం ఏమీ లేదని బాక్సాఫీస్‌ దగ్గర వీళ్లు మళ్లీ హవా క్రియేట్‌ చేస్తారని అభిమానులు అంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే వీరి ఒక్కోసినిమా ఎన్నో వేల మందికి ఉపాధి. కనుక వీరి సినిమాలు ఎన్ని తయారైతే అంత మేలు. ఖాన్‌ త్రయం కళకళలాడుతూ ఉండాలనే కోరుకుందాం.

గొడవలూ గుద్దులూ....
ఖాన్‌ త్రయం మధ్య స్నేహం కొంచెం ఘర్షణాయుతమనే చెప్పాలి. ఆమిర్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌లు మంచి స్నేహితులు. షారుక్‌ ఖాన్‌ తన స్ట్రగ్‌లింగ్‌ డేస్‌లో సల్మాన్‌ ఖాన్‌ ఇంట ఆశ్రయం పొందాడు. ‘కరణ్‌ అర్జున్‌’ లాంటి సినిమాలు షారుక్‌కు రావడంలో సల్మాన్‌ పాత్ర ఉంది. అయితే తాను స్టార్‌ అయ్యాక షారుక్‌ వీరిద్దరికీ దూరంగా ఉన్నాడనే చెప్పాలి. ఆమిర్‌ బహిరంగంగా ‘నా కంటే షారుక్‌ మంచి నటుడు కాదు. నాతో కలిసి పని చేస్తే అతడి అసలు టాలెంట్‌ తేలిపోతుంది’ అని సవాలు విసిరాడు. అంతేకాదు తన గెస్ట్‌హౌస్‌లోని కుక్కపిల్లకు ‘షారుక్‌’ అనే పేరు ఉందని చెప్పి ఒక కాంట్రవర్సీ రేపాడు. షారుక్‌ ‘కింగ్‌’ అయితే తాను ‘ఏస్‌’ అని పోల్చుకున్నాడు.

ఇక సల్మాన్‌ ఇచ్చిన ఒక పార్టీలో షారుక్‌ ఏదో కామెంట్‌ చేశాడని కత్రినా కైఫ్‌ సమక్షంలో ఇద్దరి మధ్యా బాహాబాహీ జరిగింది. అయితే అన్నీ గొడవలు దాదాపుగా సమసిపోయాయి. సల్మాన్, షారుక్‌లు ఒకరి సినిమాల్లో ఒకరు కామియో అప్పీరియెన్స్‌ ఇస్తున్నారు. ఆమిర్, షారుక్‌లు కూడా ఏమీ మాటా మాటా అనుకోవడం లేదు. జంటలుగా నటించిన ఈ ముగ్గురు ఒకేసారి ఒకే సినిమాలో నటిస్తే అప్పుడది ప్రేక్షకుల పండగ అవుతుంది. అలాంటి కథ వండి అటువంటి సినిమా తీసే దర్శకుడు రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement