‘అభిషేక్‌ నటించడం మాని వడపావ్‌ అమ్ముకో’ | Abhishek Bachchan Said Dignity In Owning And Running A Vada Pav Stall | Sakshi
Sakshi News home page

‘అభిషేక్‌ నటించడం మాని వడపావ్‌ అమ్ముకో’

Published Wed, Sep 26 2018 2:15 PM | Last Updated on Wed, Sep 26 2018 2:20 PM

Abhishek Bachchan Said Dignity In Owning And Running A Vada Pav Stall - Sakshi

అభిషేక్‌ బచ్చన్‌ (ఫైల్‌ ఫోటో)

బాలీవుడ్‌లో నెటిజన్ల చేతిలో తరచుగా ట్రోలింగ్‌కు గురయ్యే  నటుడు ఎవరైనా ఉన్నారంటే అదిఅభిషేక్‌ బచ్చనే. గత కొంత కాలంగా అభిషేక్‌ కెరీర్‌లో సరైన హిట్లు లేవు. ఈ మధ్యే ఆయన నటించిన ‘మన్మర్జియా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం కూడా అభిమానులను నిరాశ పర్చడంతో నెటిజన్లు అభిని విమర్శిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు. ఇలా కామెంట్‌ చేసిన వారిలో హర్షవర్ధన్‌ కాలే అనే వైద్యుడు కూడా ఉన్నాడు.

హర్షవర్ధన్‌ అభిని అవమానిస్తూ ‘‘మన్మర్జియా’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఎంత మంచి సినిమా అయినా సరే.. దానిలో అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తే ఫ్లాప్‌ అవుతుంది. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. హిట్‌ సినిమాను.. ఫ్లాప్‌ చేసే టాలెంట్‌ అందరికీ ఉండదు. బంధుప్రీతికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అభిషేక్‌తో పాటు ఇతర స్టార్‌కిడ్స్‌ నటించడం మానేసి వడాపావ్‌ వ్యాపారం చేసుకోవాలి’ అంటూ ట్విటర్‌లో ఓ మెసేజ్‌ పెట్టాడు. అంతేకాక ‘స్త్రీ’ సినిమా మంచి విజయం సాధించింది. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది ప్రతిభ ముఖ్యమని’ అంటూ హర్షవర్ధన్‌ ట్వీట్‌ చేశాడు.

అయితే సదరు వైద్యుడు చేసిన కామెంట్స్‌కి జూనియర్‌ బచ్చన్‌ తనదైన శైలీలో సమాధానం చెప్పాడు. ‘డాక్టర్‌ లాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మీరు అన్ని విషయాల గురించి తెలుసుకుని మాట్లాడితే మంచింది. ముందు మీరు బాక్సాఫీస్‌ లెక్కలు, నిజానిజాలు తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి. మీ దగ్గరకు వచ్చే పేషంట్సతో కూడా ఇలానే ప్రవర్తిస్తారా’  అంటూ అభి ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్ల పరంపర ఇంతటితో ఆగలేదు. అభి ట్వీట్‌కు హర్షవర్ధన్‌ ప్రతిస్పందిస్తూ..‘మీరు ఇలాగే ఆశిస్తూ ఉండండి జూనియర్‌ బచ్చన్‌. ఇలా ట్వీట్‌ చేయడానికి నేనేం సిగ్గు పడటం లేదు. వరుసగా 16 ఫ్లాప్స్‌ ఇచ్చిన యాక్టర్లు సిగ్గుపడాలి. ఇండస్ట్రీలో బంధుప్రీతి రాజ్యమేలుతోంది కదా.. మీరు మంచి మనిషే కావచ్చు. కానీ భయంకరమైన యాక్టర్’ అంటూ రిట్వీట్‌ చేశాడు.

అతని ట్వీట్స్‌కు అభిషేక్‌ స్పందిస్తూ.. ‘వడా పావ్‌ వ్యాపారం పెట్టుకోవడం చాలా గౌరవప్రదమైన అంశం. దానిని డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ అంటారు. ఇతర వృత్తులను కించపరచకండి. ఎవరికి వారు తమ రంగాల్లో బాగానే రాణిస్తున్నారు. మీరు అన్నట్లు ‘స్త్రీ’ చిత్రం మంచి విజయం అందుకుంది. కానీ ఆ సినిమాలోనూ ఓ స్టార్‌ కిడ్(శ్రద్ధా కపూర్‌)‌ ఉన్నారని మరచిపోకండి. సినిమాలను.. మమ్మల్ని విశ్లేషించడం మానేసి మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి’ అంటూ అభి ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement