డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామంటారు చాలామంది. కానీ డాక్టరూ యాక్టరూ అయ్యే అవకాశం చాలా కొంతమందికే లభిస్తుంది. డాక్టర్ భరత్‌రెడ్డి ఆ జాబితాకు చెందినవారే. హైదరాబాద్‌లో గుండె వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న భరత్‌రెడ్డి తనకు నటనే గుండె చప్పుడు అని చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా రాణిస్తున్న ఈ యువ నటునితో జరిపిన సంభాషణ...
‘అత్తారింటికి దారేది’లో మీ పాత్రకు మంచి పేరొచ్చినట్టుంది?
అవునండి. ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒకెత్తయితే, ఈ సినిమా మరొక ఎత్తు. ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో నటిస్తే వస్తే కిక్ ఏమిటో ఇప్పుడు అర్థమవుతోంది. ఈమధ్య తిరుపతిలో ఓ పెళ్లికి వెళ్తే అందరూ నా చుట్టూ గుమిగూడేసరికి, మా బంధువులూ స్నేహితులూ నా ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయారు.
డాక్టర్‌గా గుర్తింపు బావుందా? నటునిగా వస్తోన్న క్రేజ్ బావుందా?
దేని సంతృప్తి దానిదే. మోటార్ సైకిల్ అంటేనే తెలీని మధ్య తరగతి కుటుంబం మాది. అలాంటిది నేను డాక్టర్ని కాగలిగాను. ఇప్పటివరకూ 350 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగాను. ఇది నాకు దేవుడిచ్చిన అవకాశంగానే భావిస్తున్నాను. ఇక నటుడు కావడమనేది మరో గొప్ప అవకాశం.
భవిష్యత్తులో నటుడిగా బాగా బిజీ అయితే, వైద్య వృత్తిని వదిలేస్తారా?
లేదు. నటన, వైద్యం నాకు రెండు కళ్లులాంటివి. నటుడిగా ఎంత బిజీ అయినా, వైద్యాన్ని మానుకోను. శని, ఆదివారాలైనా సేవ చేయడానికి ప్రయత్నిస్తాను. అసలు నా దృష్టిలో వైద్యం అంటే సమాజసేవ.
వైద్య వృత్తిలోకి ఎలా వచ్చారు?
అసలు నేను డాక్టరూ యాక్టరూ అవుతానని ఏనాడూ అనుకోలేదు. మాకంత స్తోమత కూడా లేదు. మా కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఉద్యోగం వస్తే చాలు అనుకున్నాను. కడపలో సూపర్‌మార్కెట్ అయినా పెట్టుకుని బతికేద్దామను కున్నాను. మా అమ్మకు మాత్రం నన్ను డాక్టర్ చేయాలని ఉండేది. తన కోరికే నన్ను ఈ రంగంలోకి తెచ్చింది.
మరి యాక్టింగ్ వైపు రావాలని ఎందుకనిపించింది?
చెన్నైలో చో రామస్వామిగారి స్కూల్లో చదువుకుంటున్నపుడు కొన్ని స్టేజ్ ప్లేల్లో నటించాను. అప్పటి నుంచీ నటనపై అభిలాష మొదలైంది. డాక్టర్‌గా పనిచేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాను. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక విచిత్రం’ సినిమాలో 37 సెకన్లు కనపడే వేషం దొరికింది. ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలు చాలా చేశాను.
మరి బ్రేక్ ఎప్పుడొచ్చింది?
జేడీ చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన ‘సిద్ధం’ నాకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా ద్వారానే ‘ఈనాడు’లో కమల్‌హాసన్‌తో నటించే సువర్ణావకాశం కూడా నాకు దక్కింది. ‘ఈనాడు’ తర్వాత నాకు పోలీస్ ఇమేజ్ వచ్చేసి, వరుసగా అలాంటి పాత్రలు చాలా వచ్చాయి.
కమల్‌హాసన్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?
యాక్టింగ్‌లో ఆయనొక యూనివర్శిటీలాంటివారు. ఆయనతో రెండుమూడు సినిమాలు చేస్తే చాలు నటన మీద మనకో భరోసా వచ్చేస్తుంది. ‘ఈనాడు’ సమయంలో నాకు మంచి సూచనలు ఇచ్చేవారు. ‘విశ్వరూపం’ తెలుగు వెర్షన్‌లో ఓ పాత్రకు నన్ను డబ్బింగ్ చెప్పమని ఆయనే అడిగారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను.
తమిళ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నట్టున్నారు?
అవునండీ. ప్రస్తుతం తమిళంలో 3, కన్నడంలో 1 సినిమా చేస్తున్నాను. నాకు 8 భాషలు వచ్చు. అందుకే నాకు భాషా సమస్య లేదు. రేపు మలయాళంలో అవకాశం వచ్చినా చేయగలను. ఇక తెలుగు విషయానికొస్తే ‘పైసా’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ‘ఆగడు’లో చేయబోతున్నాను.
నటునిగా మీ లక్ష్యం?
యాంటీ హీరో, నెగిటివ్ షేడ్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేయాలని ఉంది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత హీరోగా చేయమని కొంతమంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి హీరోగా చేసే ఉద్దేశం లేదు.