సాక్షి, చెన్నై : కోలీవుడ్ హీరోలలో నటుడు అజిత్ రూటే సపరేట్ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను, తన కుటుంబం, నటన తప్ప ఇతరత్రా ఏ విషయాల జోలికి ఆయన వెళ్లరు. అనవసరంగా ఎలాంటి కామెంట్స్ చేయరు. ఇలా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే అజిత్ తన చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనరు. ఈ విషయంలో ఎవరేమన్నా లెక్క చేయకుండా నెక్ట్స్ ఏమిటీ అంటూ తన పనిలో మునిగిపోతారు. ఇక తనకు నచ్చిన వ్యక్తిని అంత సులభంగా వదులుకోరు. అది అప్పుకుట్టి లాంటి చిన్న నటుడు అయినా, శివ లాంటి హిట్ చిత్రాల దర్శకుడు అయినా ఏఎం.రత్నం, టీజీ.త్యాగరాజన్ లాంటి నిర్మాతలయినా సరే. నిర్మాత ఏఎం.రత్నం సంస్థలో ఆరంభం, వేదాళం చిత్రాలను చేశారు. ఇక దర్శకుడు శివతో వరుసగా వీరం, వేదాళం, వివేగం అంటూ వరుసగా మూడు చిత్రాలు చేశారు. తాజా చిత్రానికి ఆయనకే దర్శకత్వం బాధ్యతలను అప్పగించనున్నారు.
కాగా అజిత్ తాజా చిత్రం ఏంటి, ఏ చిత్ర నిర్మాణ సంస్థలో చేయనున్నారన్న ఆసక్తి ఆయన అభిమానులతో పాటు, చిత్ర పరిశ్రమ వర్గాలోనూ నెలకొంది. అయితే ఆ సస్పెన్స్ ఇప్పుడు తొలగిపోయింది. అవును అజిత్ తాజా చిత్రాన్ని ఇంతకు ముందు వివేగం వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన సత్య జ్యోతిఫిలింస్ సంస్థనే నిర్మించనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధినేత టీజీ.త్యారాజన్ స్వయంగా వెల్లడించారు. అంతే కాదు మరిన్ని వివరాలను ఆయన వెల్లడించారు. తాజా చిత్ర టైటిల్ విశ్వాసం. దీన్ని 2018 జనవరిలో ప్రారంభించి, అదే ఏడాది దీపావళికి విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇక ఇందులో నాయకి, ఇతర తారాగణం, సాంకేతిక వర్గ వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద అజిత్ తన విశ్వాసాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌కు చూపిస్తున్నారన్న మాట. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి వీ సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment