అంత బరువు నేను లాగలేను
‘‘కొంతమంది నా సహనటులు నాతో అంటుంటారు. ఇన్నేళ్లుగా నటించారు. ఇక విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని. నాకు తెలిసి వయసు, సర్వీసు రిలాక్స్ కోరుకుంటాయేమో? కానీ, సినిమాలపై నాకున్న ప్యాషన్ నన్ను రిలాక్స్ కానివ్వదు’’ అన్నారు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్. ‘అల్లరి’ నరేశ్, కృతిక, మౌర్యాని, రాజేంద్రప్రసాద్ ముఖ్య తారలుగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం... నాకేం భయం’. భోగవల్లి బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ చెప్పిన విశేషాలు.
♦1977లో సినిమా రంగంలోకి వచ్చాను. మరో రెండు రోజులైతే నలభై సంవత్సరాలవుతుంది. ఇన్నేళ్లుగా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారంటే కారణం రచయితలు, దర్శకులే. వారు నాకు మంచి పాత్రలు ఇవ్వబట్టే నటుడిగా నేనేంటో నిరూపించుకున్నా. అందుకే వారికి జీవితాంతం రుణపడి ఉంటా.
♦ ఇప్పటి తరం రచయితలు, దర్శకులు కూడా నా కోసం మంచి పాత్రలు సృష్టిస్తున్నారు. ‘లవ్లీ’తో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారా. అప్పటి నుంచి కొరటాల శివ, త్రివిక్రమ్, సుకుమార్, అనిల్ రావిపూడిలతో పాటు యువ డైరెక్టర్లతోనూ చేస్తున్నా, ఇంకా చేస్తా.
♦ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. ఒక్కో టైమ్‌లో ఒక్కో తరహా చిత్రాల హవా నడుస్తుంది. ఇప్పుడు హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఈ తరహా చిత్రంలో నేను నటించడం మొదటిసారి. ఈ చిత్రం చూసి ప్రేక్షకులు వంద శాతం రిలాక్స్ అయి, హ్యాపీగా ఇంటికి వెళతారు.
♦ ‘మా అల్లుడు వెరీగుడ్’ తర్వాత నేనూ, నరేశ్ కలసి చేశాం. తన నటనలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. జి. నాగేశ్వరరెడ్డి అంతమంది ఆర్టిస్టులను చక్కగా హ్యాండిల్ చేశారు. పెద్ద పెద్ద చిత్రాలు తీసిన ప్రసాద్‌గారు ఈ సినిమాకి కూడా ఎక్కడా రాజీ పడలేదు.
♦ నటుడిగా సక్సెస్ అయిన నేను నిర్మాతగా అట్టర్ ఫ్లాప్. నేను నిర్మించిన ‘మేడమ్’, ‘రాంబంటు’ చిత్రాలు బాగా దెబ్బతీశాయి. రామానాయుడుగారు చాలాసార్లు నన్ను దర్శకత్వం చేయమన్నారు. ఇప్పటికైతే ఆ ఆలోచన లేదు. డైరెక్టర్ జాబ్ అన్నది బాధ్యతతో కూడుకున్నది. అంత బరువు నేను లాగలేను. ఆ అర్హత వచ్చినప్పుడు చేస్తా.
♦ నన్ను నమ్మి ‘మా’ అధ్యక్షునిగా ఎన్నుకున్న వారి నమ్మకం వమ్ము చేయకుండా పనిచేస్తున్నా. ఇటీవల ‘మా’ డైరీ ఆవిష్కరణలో చిరంజీవిగారు ‘మా’ సేవల్ని అభినందించడంతో పాటు ఇంకా బాగా చేసేందుకు తనవంతు సాయం చేస్తాననడం హ్యాపీ. ఇకపై కూడా ఇదే ఉత్సాహంతో పనిచేస్తా.