పదకొండేళ్లుగా...ఈ రోజు కోసమే ఎదురుచూశా..!
‘‘సినిమా సినిమాకీ ఎంత విరామం తీసుకున్నానో ఎప్పుడూ లెక్కలేసుకోలేదు. మంచి సినిమా చేయాలనే తపనతో మంచి కథ కుదిరే వరకూ ఎదురుచూస్తుంటాను’’ అని శర్వానంద్ చెప్పారు. కెరీర్ ప్రారంభం నుంచి ఎలాంటి చట్రంలో ఇరుక్కోకుండా, ఎలాంటి పాత్రకైనా పనికొస్తాడనిపించుకున్నారు శర్వా. ఇటీవలే ‘రన్ రాజా రన్’లో నటించిన శర్వా ఆ సినిమా తాను ఆశించినట్టుగానే మంచి ఫలితాన్ని చ్చిందన్నారు. ఈ సందర్భంగా శర్వాతో జరిపిన భేటీ...
‘రన్ రాజా రన్’ మీ కెరీర్‌కి ఎలాంటి సినిమా?
నాకు తెలిసి ఇప్పటివరకు నేను చేసిన అన్ని చిత్రాల్లోకెల్లా వసూళ్ల పరంగా నంబర్ వన్ అనొచ్చు. పదకొండేళ్లుగా ఈ ఒక్కరోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇలాంటి విజయం యూవీ క్రియేషన్స్ ద్వారా రావడం ఆనందంగా ఉంది. ఎందుకంటే, నా మిత్రుడు విక్కీకి నిర్మాతగా ఇది తొలి చిత్రం. యూవీ సంస్థ అధినేతలు వంశీ, ప్రమోద్‌లు కూడా మంచి మిత్రులే.
అందుకేనా... పారితోషికం గురించి అడగకుండా ఈ చిత్రం చేశానని ఆడియో ఫంక్షన్‌లో మీరు చెప్పారు...?
అవును. అసలు మా మధ్య డబ్బు ప్రస్తావనే రాలేదు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడానికి కారణం నిర్మాతలే. పబ్లిసిటీ పరంగా ఎక్కడా వెనకాడలేదు. అలాగే, ఈ చిత్రకథ వినగానే ‘చేయగలమా’ అని సందేహించాను. కానీ, దర్శక, నిర్మాతలు నన్ను నమ్మారు. ఈ సినిమాలో నేను బాగా చేశానంటే ఆ ఘనత మొత్తం దర్శకుడు సుజీత్‌కే దక్కుతుంది.
శర్వానంద్ సీరియస్ పాత్రలే చేస్తున్నాడనేవారికి సమాధానం చెప్పడానికేనా ‘రన్ రాజా రన్’లాంటి ఎంటర్‌టైనర్ చేశారు?
సమాధానం చెప్పాలని కాదు కానీ.. ఈ సినిమాలో నేను చేసిన రాహుల్ పాత్ర లాంటిది చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. చివరికి సుజీత్ ద్వారా నా కోరిక నెరవేరింది. శర్వా ఎలాంటి పాత్రలైనా చేయగలడని ఈ సినిమా మరోసారి నిరూపించింది. పాత్ర డిమాండ్ చేస్తే.. డీ-గ్లామరైజ్డ్‌గా కనిపించడానికి, నెగటివ్ యాంగిల్ చూపించడానికి నేను రెడీ. విచిత్రం ఏంటంటే.. నేను కెరీర్ ఆరంభించినప్పుడు నా వయసు 19 ఏళ్లు. అప్పుడు, సీరియస్ కేరెక్టర్లు చేసిన నేను, ఇప్పుడు ముప్ఫయేళ్ల వయసుకి దగ్గరపడుతున్న సమయంలో వినోదాత్మక పాత్రలు చేస్తున్నా.
మాస్ ఇమేజ్ తెచ్చుకుంటే కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు, కోట్ల పారితోషికం తీసుకోవచ్చు కదా?
తీసుకోవచ్చండి. కానీ, అలాంటి భారీ సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. నేను ఎలాంటి ఇమేజ్‌నీ సొంతం చేసుకోకుండా విభిన్న తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతాను.
ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి?
క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కేయస్ రామారావుగారు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. తమిళంలో ఓ చిత్రం, తెలుగులో మరో చిత్రం ఓకే చేశా.
ఇంతకూ మీ పెళ్లెప్పుడు?
నాకు నచ్చిన అమ్మాయి తారసపడలేదు.