స్విమ్మింగ్‌పూల్‌ టు శ్రీరామదాస్‌ | Actor Suman Special Chit Chat With Sakshi | Sakshi
Sakshi News home page

పైలెట్‌ కాబోయి యాక్టర్‌నయ్యా..

Published Tue, Oct 2 2018 1:55 PM | Last Updated on Tue, Oct 2 2018 1:56 PM

Actor Suman Special Chit Chat With Sakshi

కర్నూలు(కల్చరల్‌) : ‘అన్నమయ్య’లో వెంకటేశ్వరస్వామి, ‘శ్రీరామదాసు’లో శ్రీరాముడు పాత్రలకు నిండుదనం తెచ్చి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం పొందిన నటుడు సుమన్‌. 1977లో స్విమ్మింగ్‌ పూల్‌ అనే తమిళ సినిమాతో ఆరంగేట్రం చేసిన సుమన్‌ 400 సినిమాల్లో నటించారు. మాతృభాష కాకపోయినా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ తెలుగు చలన చిత్రసీమకే అంకితమై చెన్నై నుంచి హైదరాబాదు  తరలివచ్చి తనను వరించిన పాత్రలకు వన్నె తెచ్చారు. బనగానపల్లెలో అరుణ భారతి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుమన్‌ మార్గంమధ్యలో కర్నూలులో కాసేపు ‘సాక్షి’తో మాట్లాడారు. మొదటి సినిమా స్విమ్మింగ్‌పూల్‌ నుంచి గుర్తింపు తెచ్చిన సినిమా శ్రీరామదాసు వరకు విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

సాక్షి : పుట్టిన ఊరు, అమ్మానాన్నల గురించిచెబుతారా?
సుమన్‌ : పుట్టింది, పెరిగింది చెన్నైలో. అమ్మ ఓ కళాశాల ప్రిన్సిపాల్, నాన్న ప్రయివేటు కార్పొరేట్‌ సంస్థలో మేనేజర్‌. కాలేజీ చదువు వరకు చెన్నైలో సాగింది.

సాక్షి : సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
సుమన్‌ : చదివేటప్పుడు కానీ, చదువైపోయాక కానీ ఏ రోజు సినీరంగంలో స్థిరపడతానని అనుకోలేదు. కిట్టు అనే ఓ కార్‌ మెకానిక్‌ నన్ను చూసి.. ‘సార్‌!  మీరు సినిమాల్లో హీరో అయితే భలే ఉంటుందండీ’ అన్నాడు. ఓరోజు  బలవంతంగా కారులో తీసుకెళ్లి తమిళ డైరెక్టర్‌ టి.ఆర్‌.రామన్‌కు పరిచయం చేయడం, ఆయన వెంటనే వేషం ఇవ్వడం జరిగిపోయింది.  అలా 1977లో మొదటిసారి స్విమ్మింగ్‌పూల్‌
సినిమాలో నటించా.  

సాక్షి : సినిమాల్లోకి రాకుండా ఉండి ఉంటే?
సుమన్‌ : చిన్నప్పటి నుంచి విమానాలంటే భలే క్రేజ్‌ . అందుకే ఆర్మీలో చేరి ఎయిర్‌ఫోర్స్‌ విమానాల పైలెట్‌ కావాలనుకునేవాడిని. అనుకోకుండా నా కెరీర్‌ సినిమాల వైపు తిరిగింది. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ కానీ, గాడ్‌ఫాదర్‌ కానీ లేకుండా 40 ఏళ్లుగా సినీ రంగంలో రాణిస్తున్నా.

సాక్షి : ఎన్ని సినిమాల్లో నటించారు? హీరోగా చేసిన సినిమాలు ఎన్ని?  
సుమన్‌ : 9 భాషల్లో 400 సినిమాల్లో నటించాను.  హీరోగా 150 సినిమాలు చేశాను.  తెలుగు, తమిళ, మళయాళం, హిందీ, ఒరియా, భోజ్‌పురి భాషల్లో నటించాను. డెత్‌ అండ్‌ టాక్సీస్‌ అనే ఇంగ్లీష్‌ సినిమాలో కూడా నటించాను. తమిళంలో శివాజీ సినిమాలో విలన్‌ పాత్రకు బెస్ట్‌ విలన్‌ నంది అవార్డు అందుకున్నాను. హిందీలో గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌కు ప్రతి నాయకుని పాత్రలో నటించాను.  కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన తరంగిణి నా మొదటి తెలుగు సినిమా. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, బావ బావమరిది, అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు నా కెరీర్‌ను మలుపు తిప్పాయి.  

సాక్షి : వెంకటేశ్వరస్వామి, శ్రీరాముడు పాత్రల్లో నటించాక మీ అనుభూతి ఏంటి?
సుమన్‌ : అన్నమయ్యలో వెంకటేశ్వరస్వామి పాత్ర చూసిన అప్పటి రాష్ట్రపతి శంకరదయాళ్‌ శర్మ నన్ను పిలిపించి రాష్ట్రపతి భవన్‌లో నాతో కలసి ఆ సినిమా చూడటం నా జన్మ ధన్యమైనట్లుగా భావించాను. ఆ తర్వాత వచ్చిన శ్రీరామదాసులో శ్రీరాముడు పాత్ర కూడా మంచి గుర్తింపు తెచ్చింది. వెంకటేశ్వరస్వామి పాత్ర చేస్తూ 8 నెలలు కటిక నేలపై పడుకుంటూ శాకాహార భోజనానికే పరిమితమై నిష్టతో చిత్తశుద్ధితో గడిపాను.   

సాక్షి : అప్పటి అగ్రనటులు,ఇప్పటి హీరోలతోనూ నటించారు కదూ!  
సుమన్‌ : మూడు తరాల నటులతో నటించాను. అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతోనే కాకుండా ఇప్పటి యువతరం హీరోలు జూనియర్‌ ఎన్‌టీఆర్, నాగచైతన్యతో కూడా నటించా.  

సాక్షి : సినిమా గురించి మీ అభిప్రాయం?
సుమన్‌ : సినిమా అత్యుత్తమమైన అతిపెద్ద మాధ్యమం. అప్పుడూ, ఇప్పుడూ మంచి సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తుంటాయి. మంచిని గ్రహించి మసలుకుంటే  మేలు చేస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement