రాజధాని స్థాయిలో కర్నూలు అభివృద్ధి
కర్నూలు: కర్నూలు ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు రాజధాని కాకపోయినప్పటికీ ఆ స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. నవ్యాంధ్ర తొలి కేబినెట్‌లో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సోమవారం మొదటిసారి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలును పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.
జిల్లా అభివృద్ధికి మీడియా ప్రతినిధుల సలహాలను కూడా స్వీకరిస్తానన్నారు. రాజధాని గురించి ఇప్పటి వరకు నిర్ణయం జరగలేదని, శివరామకృష్ణన్ కమిటీ త్వరలో రాయలసీమలో పర్యటిస్తుందని, ఆ తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్ర నడిబొడ్డున రాజధాని ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలన్నింటిని చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారనే నమ్మకంతోనే ఎన్నికల్లో ప్రజలు ఆదరించి గెలిపించారన్నారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ, 9 గంటల ఉచిత కరెంటు, ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రూ.2లకే 20 లీటర్ల నీరు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు తదితరాలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు.
కేఈకి స్వాగతం
మొదటిసారి జిల్లాకు వచ్చిన మంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం సాయంత్రం 5 గంటలకు జిల్లా సరిహద్దులోని టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి కొత్తబస్టాండ్, బంగారు పేట, రాజ్‌విహార్, కిడ్స్‌వరల్డ్, పాత కంట్రోల్ రూం, ఎక్సైజ్ కార్యాలయం, వైఎస్సార్ సర్కిల్ మీదుగా ప్రభుత్వ అతిథి గృహం వరకు ర్యాలీ చేపట్టారు.
మంత్రితో పాటు ఆయన సోదరులు కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్, కేఈ ప్రసాద్.. కుమారులు కేఈ శ్యామ్‌బాబు, కేఈ హరిబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజీ వెంకటేష్, లబ్బి వెంకటస్వామి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కేజె.రెడ్డి, మీనాక్షి నాయుడు, బీటీ నాయుడు, ఎన్‌ఎండి.ఫరూక్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
డప్పుల మోత, బాణసంచా, విచిత్ర వేషధారణలతో ర్యాలీ సాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్‌తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు ఆయనకు పూల బొకేలతో స్వాగతం పలికారు.
అన్నను అభినందించేందుకే వచ్చా: సినీ నటుడు సుమన్
కర్నూలు(సిటీ): పెద్దాయన, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అన్నను అభినందించేందుకే కర్నూలుకు వచ్చానని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు. సోమవారం ఆయన కర్నూలుకు విచ్చేసిన కేఈని స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో కలిశారు. ఈ సందర్భంగా సుమన్ విలేకరులతో మాట్లాడుతూ అన్నకు పరిపాలన అనుభవం ఉందని, ఆయన హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.