K.E Krishnamurthy
-
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
కర్నూలు(లీగల్) : నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని న్యాయవాదులు కోరారు. రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో మంగళవారం పలువురు న్యాయవాదులు మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో కర్నూలు అభివృద్ధికి నాందిగా రాష్ట్ర హైకోర్టును ఇక్కడే ఏర్పాటయ్యేలా కృషి చేయాలన్నారు. ఇందుకు స్పందించిన కేఈ విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని తెలిపారు. కేఈని కలిసినవారిలో సీనియర్ న్యాయవాదులు టి.నాగభూషణం నాయుడు, రంగారవి, బి.కృష్ణమూర్తి, ఎ.మాదన్న, కె.శ్రీధర్, డి.శివశంకర్‌రెడ్డి, పి.వెంకటేశ్వర్లు, ఎ.శ్రీనివాసులు, చెన్నయ్య తదితరులున్నారు. సీనియర్ న్యాయవాది ఇస్మాయిల్ మృతికి సంతాపం సోమవారం మరణించిన ఆదోనికి చెందిన సీనియర్ న్యాయవాది ఇస్మాయిల్(90)కు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లక్ష్మినారాయణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఇది.. టీడీపీ సమావేశమా!
అధికారిక సమావేశంలో నేతల తీరు కర్నూలులో అధికారులతో మంత్రి కేఈ సమీక్ష వైఎస్ఆర్సీపీ నేతలకు అందని ఆహ్వానం కర్నూలు : ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో అధికారికంగా నిర్వహించిన మొట్టమొదటి సమావేశమే పార్టీ కార్యక్రమంగా మారింది. దాదాపు గంటన్నర పాటు సాగిన అధికారిక సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలే కీలకభూమిక పోషించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, బీటీ నాయుడు, కేఈ ప్రతాప్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మీనాక్షి నాయుడు, లబ్బి వెంకటస్వామితో పాటు టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్ తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నప్పటికీ అధికార పార్టీ కావడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. జిల్లాలో పత్తికొండ, ఎమ్మిగనూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మిగిలిన 11 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి పథకాలపై సమీక్షకు వీరిని ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో అపరిష్కృత సమస్యలు అనేకం ఉన్నా.. వీటిపై చర్కించేందుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, ఎన్టీఆర్ మంత్రివర్గంలో పలు శాఖలు నిర్వహించిన అనుభవం కేఈ కృష్ణమూర్తికి ఉంది. అలాగే అధికారులు కూడా అనేక సమీక్ష సమావేశాలను నిర్వహించారు. అయితే వీరెవరూ సమీక్ష సమావేశం నుంచి పార్టీ కార్యకర్తలను బయటికి పంపకపోవడం గమనార్హం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతులకు అవసరమైన విత్తనాలు అందలేదు. జూన్ నెల సగం గడిచిపోయినా అవసరమైన ఎరువులు జిల్లాకు చేరలేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు దర్యాప్తు జరిపి దాదాపు రూ.124 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. పేద ప్రజలకు తక్కువ ధరతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం విఫలమైంది. తొమ్మిది సరుకుల స్థానంలో మూడింటితో సరి పెడుతున్నారు. గత ప్రభుత్వ పథకాల అమలుపై స్పష్టత లేకపోవడంపై అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నింటిపైనా ప్రజా ప్రతినిధులతో చర్చించి పరిపాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యత అటు అధినేతలు, ఇటు యంత్రాంగంపై ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. -
రాజధాని స్థాయిలో కర్నూలు అభివృద్ధి
కర్నూలు: కర్నూలు ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు రాజధాని కాకపోయినప్పటికీ ఆ స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. నవ్యాంధ్ర తొలి కేబినెట్లో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సోమవారం మొదటిసారి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలును పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి మీడియా ప్రతినిధుల సలహాలను కూడా స్వీకరిస్తానన్నారు. రాజధాని గురించి ఇప్పటి వరకు నిర్ణయం జరగలేదని, శివరామకృష్ణన్ కమిటీ త్వరలో రాయలసీమలో పర్యటిస్తుందని, ఆ తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్ర నడిబొడ్డున రాజధాని ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలన్నింటిని చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారనే నమ్మకంతోనే ఎన్నికల్లో ప్రజలు ఆదరించి గెలిపించారన్నారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ, 9 గంటల ఉచిత కరెంటు, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రూ.2లకే 20 లీటర్ల నీరు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు తదితరాలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. కేఈకి స్వాగతం మొదటిసారి జిల్లాకు వచ్చిన మంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం సాయంత్రం 5 గంటలకు జిల్లా సరిహద్దులోని టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి కొత్తబస్టాండ్, బంగారు పేట, రాజ్‌విహార్, కిడ్స్‌వరల్డ్, పాత కంట్రోల్ రూం, ఎక్సైజ్ కార్యాలయం, వైఎస్సార్ సర్కిల్ మీదుగా ప్రభుత్వ అతిథి గృహం వరకు ర్యాలీ చేపట్టారు. మంత్రితో పాటు ఆయన సోదరులు కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్, కేఈ ప్రసాద్.. కుమారులు కేఈ శ్యామ్‌బాబు, కేఈ హరిబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజీ వెంకటేష్, లబ్బి వెంకటస్వామి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కేజె.రెడ్డి, మీనాక్షి నాయుడు, బీటీ నాయుడు, ఎన్ఎండి.ఫరూక్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. డప్పుల మోత, బాణసంచా, విచిత్ర వేషధారణలతో ర్యాలీ సాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్‌తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు ఆయనకు పూల బొకేలతో స్వాగతం పలికారు. అన్నను అభినందించేందుకే వచ్చా: సినీ నటుడు సుమన్ కర్నూలు(సిటీ): పెద్దాయన, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అన్నను అభినందించేందుకే కర్నూలుకు వచ్చానని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు. సోమవారం ఆయన కర్నూలుకు విచ్చేసిన కేఈని స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో కలిశారు. ఈ సందర్భంగా సుమన్ విలేకరులతో మాట్లాడుతూ అన్నకు పరిపాలన అనుభవం ఉందని, ఆయన హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.