ఇది.. టీడీపీ సమావేశమా!
- అధికారిక సమావేశంలో నేతల తీరు
- కర్నూలులో అధికారులతో మంత్రి కేఈ సమీక్ష
- వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు అందని ఆహ్వానం
కర్నూలు : ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో అధికారికంగా నిర్వహించిన మొట్టమొదటి సమావేశమే పార్టీ కార్యక్రమంగా మారింది. దాదాపు గంటన్నర పాటు సాగిన అధికారిక సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలే కీలకభూమిక పోషించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, బీటీ నాయుడు, కేఈ ప్రతాప్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మీనాక్షి నాయుడు, లబ్బి వెంకటస్వామితో పాటు టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్ తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నప్పటికీ అధికార పార్టీ కావడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. జిల్లాలో పత్తికొండ, ఎమ్మిగనూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మిగిలిన 11 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి పథకాలపై సమీక్షకు వీరిని ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో అపరిష్కృత సమస్యలు అనేకం ఉన్నా.. వీటిపై చర్కించేందుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, ఎన్‌టీఆర్ మంత్రివర్గంలో పలు శాఖలు నిర్వహించిన అనుభవం కేఈ కృష్ణమూర్తికి ఉంది. అలాగే అధికారులు కూడా అనేక సమీక్ష సమావేశాలను నిర్వహించారు. అయితే వీరెవరూ సమీక్ష సమావేశం నుంచి పార్టీ కార్యకర్తలను బయటికి పంపకపోవడం గమనార్హం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతులకు అవసరమైన విత్తనాలు అందలేదు. జూన్ నెల సగం గడిచిపోయినా అవసరమైన ఎరువులు జిల్లాకు చేరలేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి.
జిల్లాలో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు దర్యాప్తు జరిపి దాదాపు రూ.124 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. పేద ప్రజలకు తక్కువ ధరతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం విఫలమైంది. తొమ్మిది సరుకుల స్థానంలో మూడింటితో సరి పెడుతున్నారు. గత ప్రభుత్వ పథకాల అమలుపై స్పష్టత లేకపోవడంపై అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నింటిపైనా ప్రజా ప్రతినిధులతో చర్చించి పరిపాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యత అటు అధినేతలు, ఇటు యంత్రాంగంపై ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.