Government guest house
-
మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన యూపీ సీఎం యోగి
లక్నో: అధికార పర్యటనల్లో హోటళ్లలో బస చేయకుండా ప్రభుత్వ గెస్ట్‌హౌసుల్లోనే ఉండాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తన మంత్రులను ఆదేశించారు. అదేవిధంగా బంధువులను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవద్దన్నారు. ప్రభుత్వ గెస్ట్‌హౌసుల్లోనే బసచేయాలన్న ఆదేశం మంత్రులకే కాకుండా ప్రభుత్వాధికారులకు కూడా వర్తిస్తుందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేయాలని, లంచ్ బ్రేక్ 30 నిమిషాలకు మించకుండా చూడాలని ఆదేశించారు. ఆఫీసుకు లేటుగా వచ్చే ఉద్యోగులపై చర్యలుంటాయని సీఎం బుధవారం హెచ్చరించారు. ప్రతి ఆఫీసులో సిటిజెన్ చార్టర్‌ను ప్రదర్శించాలన్నారు. ప్రజలు చేసే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. చదవండి: (యూపీలో ఏం జరిగిందో చూశారుగా!: సీఎం యోగి) -
వివాదాస్పదంగా కర్ణాటక నిర్ణయం
బెంగళూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అంతేగాక విధి నిర్వాహణలో రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో వారికి ప్రత్యేకంగా బెంగళూరులోని కుమార కృపా 100 పడకల లగ్జరీ ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను కోవిడ్-19 సంరక్షణ కేంద్రం కోసం కేటాయిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కావడం లేదు. చివరికి ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌ను విఐపీల కోసం చికిత్స కేంద్రంగా మార్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చింది’ అని మండిపడ్డారు. (‘జాగ్రత్తగా ఉంటారా.. మరోసారి లాక్డౌన్ విధించాలా’) బీజేపీ నేత ఉమెస్ జాదవ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో క్వారంటైన్ చాలా అవసరం. కరోనా బాధితుల కోసం రాష్ట్రంలో వసతి గృహాలు లేనందున ప్రభుత్వం ఏవీ అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలి’’ అని పిలుపునిచ్చారు. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న సమీక్షలు, సమావేశాలకు హాజరవుతున్న సీనియర్ అధికారులు, మంత్రులు, ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారని, అందువల్ల వారి కోసం ప్రత్యేకమైన కోవిడ్ సెంటర్లు అవసరమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఏడు అంతస్తుల కుమార కృపా గెస్ట్‌హౌజ్‌లో ప్రత్యేకంగా 3 అంతస్తులను సుప్రీంకోర్టు న్యామూర్తులు, మంత్రులు, వీవీఐపీల కోసం కేటాయించారు. (‘20 రోజులు లాక్డౌన్ విధించాలి’) కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,000లకు పైగా కేసులు నమోదు కాగా 164 మరణాలు చోటుచేసుకున్నాయి. వీటిలో అధిక కేసులు బెంగళూరులో నమోదు కాగా నగరంలోని రెండు అతిపెద్ద మార్కెట్లను ప్రభుత్వం మూసివేసింది. కేసులు అధికమవుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కోవిడ్-19 చికిత్స కోసం 50 శాతం గదులను కెటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి బుధవారం చేసిన వరుస ట్వీట్లలో.. ‘‘కోవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గదులు, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. కరోనా బారిన పడిన వారికి తగిన చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని. నాలుగు వేలకుపైగా రోగులకు చికిత్స చేయడానికి పడకలు లేవని, వెంటిలేటర్లు లేవు. కావునా మరోసారి రాష్ట్రంలో 24 రోజుల పాటు లాక్డౌన్ విధించాల’’ని ఆయన డిమాండ్ చేశారు. -
ఇది.. టీడీపీ సమావేశమా!
అధికారిక సమావేశంలో నేతల తీరు కర్నూలులో అధికారులతో మంత్రి కేఈ సమీక్ష వైఎస్ఆర్సీపీ నేతలకు అందని ఆహ్వానం కర్నూలు : ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో అధికారికంగా నిర్వహించిన మొట్టమొదటి సమావేశమే పార్టీ కార్యక్రమంగా మారింది. దాదాపు గంటన్నర పాటు సాగిన అధికారిక సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలే కీలకభూమిక పోషించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, బీటీ నాయుడు, కేఈ ప్రతాప్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మీనాక్షి నాయుడు, లబ్బి వెంకటస్వామితో పాటు టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్ తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నప్పటికీ అధికార పార్టీ కావడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. జిల్లాలో పత్తికొండ, ఎమ్మిగనూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మిగిలిన 11 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి పథకాలపై సమీక్షకు వీరిని ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో అపరిష్కృత సమస్యలు అనేకం ఉన్నా.. వీటిపై చర్కించేందుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, ఎన్టీఆర్ మంత్రివర్గంలో పలు శాఖలు నిర్వహించిన అనుభవం కేఈ కృష్ణమూర్తికి ఉంది. అలాగే అధికారులు కూడా అనేక సమీక్ష సమావేశాలను నిర్వహించారు. అయితే వీరెవరూ సమీక్ష సమావేశం నుంచి పార్టీ కార్యకర్తలను బయటికి పంపకపోవడం గమనార్హం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతులకు అవసరమైన విత్తనాలు అందలేదు. జూన్ నెల సగం గడిచిపోయినా అవసరమైన ఎరువులు జిల్లాకు చేరలేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు దర్యాప్తు జరిపి దాదాపు రూ.124 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. పేద ప్రజలకు తక్కువ ధరతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం విఫలమైంది. తొమ్మిది సరుకుల స్థానంలో మూడింటితో సరి పెడుతున్నారు. గత ప్రభుత్వ పథకాల అమలుపై స్పష్టత లేకపోవడంపై అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నింటిపైనా ప్రజా ప్రతినిధులతో చర్చించి పరిపాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యత అటు అధినేతలు, ఇటు యంత్రాంగంపై ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.