బెంగళూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అంతేగాక విధి నిర్వాహణలో రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో వారికి ప్రత్యేకంగా బెంగళూరులోని కుమార కృపా 100 పడకల లగ్జరీ ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను కోవిడ్-19 సంరక్షణ కేంద్రం కోసం కేటాయిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కావడం లేదు. చివరికి ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌ను విఐపీల కోసం చికిత్స కేంద్రంగా మార్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చింది’ అని మండిపడ్డారు. (‘జాగ్రత్తగా ఉంటారా.. మరోసారి లాక్‌డౌన్ విధించాలా’)
బీజేపీ నేత ఉమెస్ జాదవ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో క్వారంటైన్ చాలా అవసరం. కరోనా బాధితుల కోసం రాష్ట్రంలో వసతి గృహాలు లేనందున ప్రభుత్వం ఏవీ అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలి’’ అని పిలుపునిచ్చారు. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న సమీక్షలు, సమావేశాలకు హాజరవుతున్న సీనియర్ అధికారులు, మంత్రులు, ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారని, అందువల్ల వారి కోసం ప్రత్యేకమైన కోవిడ్ సెంటర్లు అవసరమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఏడు అంతస్తుల కుమార కృపా గెస్ట్‌హౌజ్‌లో ప్రత్యేకంగా 3 అంతస్తులను సుప్రీంకోర్టు న్యామూర్తులు, మంత్రులు, వీవీఐపీల కోసం కేటాయించారు. (‘20 రోజులు లాక్‌డౌన్ విధించాలి’)
కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,000లకు పైగా కేసులు నమోదు కాగా 164 మరణాలు చోటుచేసుకున్నాయి. వీటిలో అధిక కేసులు బెంగళూరులో నమోదు కాగా నగరంలోని రెండు అతిపెద్ద మార్కెట్లను ప్రభుత్వం మూసివేసింది. కేసులు అధికమవుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కోవిడ్-19 చికిత్స కోసం 50 శాతం గదులను కెటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి బుధవారం చేసిన వరుస ట్వీట్‌లలో.. ‘‘కోవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గదులు, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. కరోనా బారిన పడిన వారికి తగిన చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని. నాలుగు వేలకుపైగా రోగులకు చికిత్స చేయడానికి పడకలు లేవని, వెంటిలేటర్లు లేవు. కావునా మరోసారి రాష్ట్రంలో 24 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాల’’ని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment