‘‘నేను మంచి నటుణ్ణి కాదు. కానీ, మంచి కథలు ఎంచుకుని అందుకు తగ్గట్టు భావోద్వేగాలు పలికిస్తా. నా దృష్టిలో కమర్షియల్ సినిమా అంటూ ప్రత్యేకంగా ఉండదు. ప్రేక్షకులకు నచ్చేది... హిట్టయ్యేదే కమర్షియల్ సినిమా. ‘బిచ్చగాడు’ నచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ ‘అన్నాదొరై’. తెలుగులో ‘ఇంద్రసేన’గా రేపు విడుదలవుతోందీ సినిమా. విజయ్ ఆంటోని చెప్పిన విశేషాలు...
► తమిళనాడు రాజకీయాల నేపథ్యంలో తీసిన సినిమా కాదిది. దర్శకుడు శ్రీనివాసన్‌కు ఓ కవల సోదరుడు ఉండేవాడు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీశాడు.
► అన్నాతమ్ముళ్ల కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇంద్రసేన, రుద్రసేన అన్నదమ్ములు. ప్రేమించిన అమ్మాయిని కోల్పోయిన ఇంద్రసేన వ్యసనాలకు బానిస అవుతాడు. పీఈటీ టీచర్ అయిన రుద్రసేనకు అనుకోని సమస్య వస్తుంది. ఆయా పరిస్థితుల్లో అన్నాతమ్ముళ్లు తీసుకున్న నిర్ణయాలు ఏంటన్నదే కథ.
► అందంగా కట్ చేస్తే... టీజర్ బాగుంటుంది. ప్రేక్షకులను మోసం కూడా చేస్తుంది. అందుకే, పది నిమిషాల సినిమాని చూపించాం. దీని ద్వారా ప్రధాన కథ తెలిసే అవకాశం ఉండదు. కానీ, ప్రేక్షకుల్లో సినిమాపై ఉత్సుకత, క్రేజ్ పెంచొచ్చు. ‘భేతాళుడు’కీ ఇలాగే చేశాం.
► భారతదేశం చాలా పెద్దది. జనాభా కూడా ఎక్కువే. అందువల్ల జీఎస్‌టీపై అభిప్రాయాన్ని ఒక్కసారి చెప్పలేం. ఏడెనిమిదేళ్లు పడుతుంది. మా సినిమాలో జీఎస్‌టీపై ఓ పాట ఉంది. అందులో ఎవర్నీ విమర్శించకున్నా సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో జీఎస్‌టీ పదం వినిపించకుండా చేశాం.
► నేను చేసే ప్రతి పనిని ఓ ప్రేక్షకుడిగా ఆలోచిస్తా. నా పని సిన్సియర్‌గా చేయాలనుకుంటాను. అంతేకానీ, ఇంకా ఇంకా ఏదో కావాలంటూ పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయను. నా లిమిట్స్ నాకు తెలుసు. బయటి నిర్మాతలైతే ఒత్తిడి ఉంటుందన్నది నా ఆలోచన. అందుకే నా సంస్థలో చేస్తా.
► తెలుగులో కథలు వింటున్నా. త్వరలో డైరెక్ట్ సినిమా చేయబోతున్నా. నాకు యాక్టింగ్ అంటేనే ఇష్టం. దర్శకులు మంచి కథలతో నా వద్దకొస్తున్నారు. నిర్మాణంపైన శ్రద్ధ వహిస్తున్నా. నా చిత్రాలకు సంగీతం కూడా అందిస్తున్నా. ఇతర సినిమాలకు సంగీతం అందించాలనో... డైరెక్టర్ అవ్వాలనో ఆలోచన లేదు. ప్రస్తుతం తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment