శ్రుతీపై కుష్బూ విమర్శలు
తమిళసినిమా: నటి శ్రుతీహాసన్‌పై నటి, రాజకీయనాయకురాలు కుష్భూ విమర్శల దాడి చేశారు. దర్శకుడు సుందర్.సీ నటి కుష్భూ భర్త అన్న విషయం తెలిసిందే. సుందర్.సీ తాజాగా సంఘమిత్ర అనే భారీ చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. జయంరవి, ఆర్య కథానాయకులుగా నటించనున్న ఇందులో నాయకిగా నటి శ్రుతీహాసన్‌న నటించడానికి అంగీకరించిన సంగతి, ఈ చిత్ర లోగోనూ గత మేలో ఫ్రాన్స్‌లో జరిగిన కాన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించిన సంగతి విదితమే.
ఆ వేడుకలో సంఘమిత్ర యూనిట్‌తో పాటు నటి శ్రుతీహాసన్ పాల్గొన్నారు. అనంతం తను అనూహ్యంగా సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొంటూ అందుకు కొన్ని ఆరోపణలు కూడా చేసి సంచలనం సృష్టించారు.అందుకు చిత్ర యూనిట్ ఆలస్యంగానైనా తగిన విధంగా స్పందించారనుకోండి. ఆ సమస్య సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో తాజాగా దర్శకుడు సుందర్.సీ భార్య, నటి కుష్బూ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ నటి శ్రుతీహాసన్‌ను నర్మగర్భంగా విమర్శించడం టాక్ ఆఫ్ ది టాక్‌గా మరింది.
ఇంతకీ కుష్బూ ఏమన్నారో చూద్దాం. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కనున్న చిత్రం సంఘమిత్ర. అలాంటి చిత్రాన్ని సరైన ప్లానింగ్ లేకుండా ఎవరూ నిర్మించరు. అసలు స్క్రిప్టే లేదని కొందరు ఏవేమో సాకులు చెబుతున్నారు. నిజానికి సంఘమిత్ర చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు రెండేళ్లుగా జరుగుతున్నాయి. అందువల్ల వృత్తిపై అవగాహన లేని వారే అసత్యాలు చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే సంఘమిత్ర లాంటి చిత్రాలకు షూటింగ్ అన్నది 30 శాతమే ఉంటుంది. మిగిలిన 70 శాతం ప్రీ ప్రొడక్షన్లోనే జరుగుతుంది. మీ లోపాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయడం సమస్యం కాదు. పారంపర్య సినీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ల నుంచి వృత్తిలో పరిణితిని ఎదురు చూస్తారు. మీలోని తప్పులను గ్రహించి, లోపాలను సరిదిద్దుకున్నప్పుడే సుదీర్ఘ పయనం చేయగలరు. ఇది నటి కుష్బూ ట్విట్టర్‌లో పేర్కొన్న సారాంశం. మరి ఈమె విమర్శలకు శ్రుతీహాసన్ ఎలా స్పందిస్తారో చూడాలి.