నటికి అవార్డు వచ్చినా.. చేదు అనుభవం!
కాలిఫోర్నియా: ఎవరికైనా అవార్డులు వస్తే ప్రశంసలు వర్షం కురుస్తోంది.. కానీ 'హ్యారీపోటర్' ఫేమ్ ఎమ్మా వాట్సన్ కు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. తనకు అవార్డు వచ్చిందని చెప్పిన ఈ ముద్దుగుమ్మపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు కారణం ఆమె అత్యుత్సాహమని చెప్పవచ్చు. అవార్డుల కార్యక్రమం మొదలవ్వకముందే తనకు అవార్డు వచ్చిందని ఆమె ప్రకటించడమే. మే7న లాస్ ఏంజిలిస్ లోని ష్రైన్ ఆడిటోరియంలో ఎంటీవీ మూవీ అండ్ టీవీ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఆమె బ్లాక్ స్లీవ్ డ్రెస్ లో దర్శనమిచ్చి సందడి చేసింది. లైవ్ షో ప్రారంభానికి ముందే తాను అవార్డు గెలుచుకున్నట్లు అభిమానులకు శుభవార్త చెప్పింది.
ఎంటీవీ మూవీ అండ్ టీవీ అవార్డులలో భాగంగా తొలి జెండర్ లెస్ (జెండర్ న్యూట్రల్) అవార్డు సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఫంక్షన్ లో అవార్డు విజేత గౌరవ ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే హాలీవుడ్ భామ ఎమ్మా వాట్సన్ ఇచ్చిన ప్రసంగం ఎవరినీ ఆకట్టుకునేలా లేదట. అవార్డు విషయం ముందే తెలిసిన ఎమ్మా.. ఉద్వేగభరితంగా ప్రసంగించలేదని, ఏదో మొక్కుబడిగా ప్రీపేర్ చేసుకున్న వ్యాసాన్ని చదివిందని విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో అవార్డు నెగ్గిన ఆనందం కన్నా విమర్శలే ఆమెకు తలనొప్పిగా మారినట్లుగా కనిపిస్తోంది. అవార్డు విషయం ముందుగానే ఎమ్మా ఎందుకు వెల్లడించిందంటూ కొందరు సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.