సినిమా: గీతాంజలి. ఈ పేరు భారతీయ సినిమాకు చాలా ప్రియమైనది, గౌరవమైనది. గీతాంజలి సినిమా అనే కళామతల్లికి ముద్దుబిడ్డ. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోనైనా, పెరిగింది, నటిగా ఎదిగింది చెన్నై మహానగరంలోనే. పువ్వు పూయగానే వికసిస్తుందంటారు. అలా నటి గీతాంజలి బాల్యంలోనే నటిగా అడుగులు వేశారు. తన మూడో ఏట నుంచే నాట్యంలో శిక్షణ పొందిన గీతాంజలి అసలు పేరు మణి. పారస్‌మణి అనే హిందీ చిత్రంలో నటించినప్పుడు ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్–ప్యారేలాల్ తమ సినిమా టైటిల్‌లో మణి ఉండడంతో హీరోయిన్ పేరును గీతాంజలిగా మార్చారు. ఆ వేళావిశేషం బాగున్నట్లుంది. అప్పటి నుంచి మణి గీతాంజలిగా పేరు మోశారు. తెలుగులో సీతగా నటించిన మొదటి నటి గీతాంజలి.
మరో విశేషం ఏమిటంటే ఈమె కథానాయకిగా నటించిన తొలి చిత్రంలోనే సీతాదేవిగా నటించారు. సీతారామకల్యాణం చిత్రంలో ఆమెను సీతగా నటింపజేసిన ఘనత ఎన్‌టీ.రామారావుదే. ఆ తరువాత ఏఎన్‌ఆర్, కాంతారావు వంటి ప్రముఖ కథానాయకులందరితోనూ సాంఘిక, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లో నటించారు. అన్ని తరహా పాత్రల్లోనూ జీవించిన గీతాంజలి 500కు పైగా చిత్రాల్లో నటించారు. అందులో తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలకు చెందిన చిత్రాలు ఉన్నాయి. గీతాంజలికి చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. ఈమె నటిగా పుట్టి పెరిగింది చెన్నైలోనే. స్థానిక హబిబుల్లా రోడ్డులో నివసించేవారు. సహ నటుడు రామకృష్ణను వివాహమాడి ఓ ఇంటివారయ్యింది చెన్నైలోనే. తమిళంలో పలు మరపురాని చిత్రాల్లో గీతాంజలి నటించారు. ఎంజీఆర్, శివాజీగణేశన్, ఎస్‌ఎస్.రాజేంద్రన్, రవిచంద్రన్, జెమినీగణేశన్ వంటి అగ్ర నటులతో నటించి పేరు గడించారు.
తమిళ రంగ ప్రవేశం..
గీతాంజలి తమిళంలో నటించిన తొలి చిత్రం శారద. ఆ తరువాత దైవత్తిన్ దైవం, తాయిన్ మడియిల్, పణం పడైత్తవన్, వాళ్‌లై్క పడగు, ఆళై ముగం, అదేకన్‌గళ్, ఎన్‌అన్నన్ వంటి పలు చిత్రాల్లో నటించి ఖ్యాతి గాంచారు. ముఖ్యంగా పణం పడైత్తవన్, అన్నైమిట్ట కై, దైవత్తిన్ దైవం, అదేకన్‌గళ్, అన్భళిప్పు తదితర చిత్రాలు ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. మరో విషయం ఏమిటంటే గీతాంజలి మరణం అంచుల వరకూ కళామతల్లికి సేవలందించారు. బాల నటిగా పరిచయం అయ్యి కథానాయకిగా ఎదిగి, చివరి దశలో బామ్మ పాత్రల్లో కూడా నటించిన గీతాంజలి భౌతకంగా లేకపోయినా నటిగా మాత్రం సజీవంగానే ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment