చెన్నై చిన్నది త్రిషకు ఏమైంది? ప్రస్తుతం కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇదే. కోలీవుడ్‌లో బిజీ హీరోయిన్లలో ఒకరు నటి త్రిష. ఇటీవల ఈ బ్యూటీ నటించిన 96, రజనీకాంత్‌తో నటించిన పేట చిత్రాల విజయాలు ఆమెలో నూతనోత్సాహాన్ని నింపాయన్నది నిజం. కాగా ఆ మధ్య నయనతార, అనుష్కల తరహాలో హీరోయిన్ సెంట్రిక్ కథ చిత్రాల్లో రాణించాలని ప్రయత్నించినా, ఆ తరహా చిత్రాల్లో సక్సెస్ కాలేకపోయింది. కారణం కథల ఎంపికలో లోపమో, లేక దర్శకులు త్రిషలోని నటనా సత్తాను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారో గానీ, హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు ఈ అమ్మడికి అచ్చిరాలేదు. అయితే ప్రస్తుతం పట్టు వదలని విక్రమార్కుడి తరహాలో త్రిష మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. దీనికి ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కథ, మాటలను అందించడం విశేషం.
ఇంతకు ముందు ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శరవణన్ త్రిష నటిస్తున్న సెంట్రిక్ కథా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి రాంగీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న త్రిష సడన్‌గా స్పృహ తప్పి పడిపోయిందని, వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చినట్లు, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో త్రిష అభిమానులు ఆమెకు ఏమైందనే ఆందోళనను వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ బ్యూటీకి అభిమానుల సంఖ్య కాస్త అధికమే.
దీంతో స్పందించిన త్రిష తల్లి ఉమాకృష్ణన్ త్రిషకు ఎలాంటి సమస్య లేదని, తను ఆరోగ్యంగా ఉందని, రాంగీ చిత్ర షూటింగ్‌లో విరామం లేకుండా రాత్రి పగలు పాల్గొంటున్నట్లు తెలిపారు. అంతే కాదు త్రిష గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదని, ఇలాంటి వదంతులను ఎవరూ నమ్మవద్దని త్రిష తల్లి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే నటి త్రిష నిజంగానే స్పృహ కోల్పోయిందా? లేక ఆమె తల్లి చెప్పినట్లు అది కేవలం వదంతి మాత్రమేనా అనే సందేహాలు అభిమానుల్లో తొలిచేస్తుండడం సహజమే.
Comments
Please login to add a commentAdd a comment