విద్యాబాలన్‌కు వహీదా వహ్వా! | Actress Waheeda Rehman likes vidhyabalan | Sakshi
Sakshi News home page

విద్యాబాలన్‌కు వహీదా వహ్వా!

Published Fri, Oct 16 2015 11:53 PM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

విద్యాబాలన్‌కు వహీదా వహ్వా! - Sakshi

విద్యాబాలన్‌కు వహీదా వహ్వా!

హిందీ రంగంలో పేరు తెచ్చుకున్న తెలుగు మహిళల్లో ఆ తరం నటి వహీదా రెహమాన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. కొన్నాళ్ళుగా ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ, అడపాదడపా మాత్రమే నటిస్తున్న వహీదా తాజాగా ఇప్పుడు ఓ బెంగాలీ సినిమాలో నటిస్తున్నారు. అపర్ణాసేన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అర్షీనగర్’లో కీలకమైన అతిథి పాత్ర పోషిస్తున్నారు. ‘‘ఇది రోమియో - జూలియట్ కథకు ఆధునిక రూపం అనుకోవచ్చు. ఇందులో ఇప్పుడు బెంగాలీలో జనం మెచ్చిన తారలైన దేవ్, రితికలతో కలసి తెరపై కనిపిస్తా’’ అని వహీదా చెప్పారు. నటి, రచయిత్రి, దర్శకురాలైన అపర్ణాసేన్ అంటే వహీదాకు ఎంతో గౌరవం.

‘‘అపర్ణాసేన్‌తో కలసి పనిచేయడమంటే నాకెప్పుడూ చాలా ఇష్టం. అన్నీ పక్కాగా ప్లాన్ చేసే అపర్ణ నాకు స్వాతంత్య్రం ఇచ్చి, నా వయసుకూ, ప్రతిభకూ తగ్గట్లు పనిచేయించుకుంటారు. గతంలో ఆమె దర్శకత్వంలో నటించిన ‘15 పార్క్ ఎవెన్యూ’ సినిమాలో కూడా అలాగే చేశారు’’ అని వహీదా చెప్పుకొచ్చారు. బెంగాలీలో సత్యజిత్ రే, సౌమిత్రా ఛటర్జీ లాంటి ప్రసిద్ధులతో కలసి పనిచేసిన ఈ సీనియర్ నటి ఇప్పటికీ గురుదత్‌తో కలసి పనిచేసిన ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘చౌద్వీ కా చాంద్’ లాంటి సినిమాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ఈ మధ్యే 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న దేవానంద్ సినిమా ‘గైడ్’లో పోషించిన రోజీ పాత్ర తన జీవితంలో మర్చిపోలేని అనుభవమని వహీదా ఇప్పటికీ చెబుతుంటారు. మరి ఈ తరం నటీమణుల మాటేమిటంటే, వహీదా ఠక్కున చెప్పే పేరు - విద్యాబాలన్. ‘‘అందం, అద్భుతమైన ప్రతిభ, అపారమైన తెలివితేటలు - ఇవన్నీ ఉన్న నటి విద్యాబాలన్. ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’ చిత్రాల్లో ఆమె అద్భుతంగా నటించింది. సరైన స్క్రిప్ట్, సెన్సిబుల్ దర్శకుడు దొరికితే ఆమె అద్భుతాలు చేస్తుంది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని నా నమ్మకం’’ అని వహీదా ప్రశంసలు కురిపించారు. అంత సీనియర్ ప్రశంసలు విని, విద్యాబాలన్ సహజంగానే పొంగిపోయి ఉంటుంది కదూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement