జాగ్రత్త ఆ కాపీరైట్స్‌ నావే! | Adah Sharma Warning On Hair Style Copyrights | Sakshi
Sakshi News home page

జాగ్రత్త ఆ కాపీరైట్స్‌ నావే!

Published Fri, Jun 21 2019 9:05 AM | Last Updated on Fri, Jun 21 2019 9:05 AM

Adah Sharma Warning On Hair Style Copyrights - Sakshi

తమిళసినిమా: ఆ కాపీరైట్స్‌ తనవే జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది నటి ఆదాశర్మ. 2008లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ ముంబై భామ మొదట్లో హిందీలో గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత దక్షిణాదికి తన నట పయనాన్ని విస్తరించుకుంది. హిందీలో 1920 అనే చిత్రంతో విజయాల ఖాతాను ప్రారంభించిన ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. అయితే హిందీలో మాదిరి తెలుగులో  హీరోయిన్‌గా పేరు తెచ్చుకోలేదు. హార్ట్‌ఎటాక్‌ చిత్రంలో నితిన్‌కు జంటగా హీరోయిన్‌గా నటించినా ఆ చిత్రం ఆమెను నిరాశపరిచింది. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, క్షణం వంటి హిట్‌ చిత్రాల్లో నటించినా ఆదాశర్మ పాత్రలు పరిమితమే. ఇకపోతే కోలీవుడ్‌లో చాలా కాలం క్రితమే శింబుతో ఇదునమ్మఆళు చిత్రంలో ఒక పాటకు ఆడింది. ఆ తరువాత ఇక్కడ ఈ అమ్మడిని గుర్తించుకున్నవారే లేరు. అలా చాలా గ్యాప్‌ తరువాత ప్రభుదేవాతో చార్లీ చాప్లిన్‌–2 చిత్రంలో నటించే అవకావాన్ని అందుకున్నా, ఆ చిత్రం కూడా ఆదాశర్మ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.

పనిలో పనిగా కన్నడంలోనూ నటించేసిన ఆదాశర్మ మాత్రం ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉంది. అందాలారబోతకు ఏ మాత్రం సంకోచించని ఈ స్కిన్‌షో బ్యూటీ వివిధ భంగిమలతో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. తాజాగా ఒక హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. దీనికి ది హాలీడే అనే టైటిల్‌ను నిర్ణయించారు. సహజంగానే ఆదాశర్మ తన హేర్‌స్టైల్‌ను డిఫెరెంట్‌గా రూపు దిద్దుకోవడంలో ఆసక్తి కనబరుస్తుంది. అలా ప్రస్తుతం తాను నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ కోసం తన హేర్‌ను త్రివర్ణంతో తీర్చిదిద్దుకుంది. పర్పల్, పింకు, ఆరెంజ్‌ రంగులతో కూడిన హేర్‌స్టైల్‌ కలిగిన ఒక అందమైన ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అది ఇప్పుడు ఈ అమ్మడికి పిచ్చి పబ్లిసిటీని తెచ్చి పెడుతోంది. ఇంత వరకూ బాగానే సాధారణంగా ఏదైనా డిఫెరెంట్‌గా ఉంటే మగువలు దాన్ని ఫాలో అవుతుంటారు. ఈ విషయాన్ని ఎరిగిన ఆదాశర్మ అలాంటి వారికే ఒక హెచ్చరిక చేసింది. తాను ది హాలీడే వెబ్‌ సిరీస్‌ కోసం తయారు చేసుకున్న ఈ త్రివర్ణ హేర్‌స్టైల్‌ను వేరెవరూ ట్రై చేయరాదు. దీని కాపీరైట్స్‌ పూర్తిగా తనవే. అలా ఎవరైనా ఆ స్టైల్‌కు ప్రయత్నిస్తే  కాపీరైట్స్‌ రుసుము చెల్లించాలి. కాదని ఎవరైనా ప్రయత్నిస్తే కేసు వేస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement