రజనీకి ‘డటుక్’ ఇవ్వాలి | After Jackie Chan, fans want datukship for Kollywood superstar Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీకి ‘డటుక్’ ఇవ్వాలి

Published Mon, Feb 9 2015 11:37 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

రజనీకి ‘డటుక్’ ఇవ్వాలి - Sakshi

రజనీకి ‘డటుక్’ ఇవ్వాలి

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. అభిమానులందరూ ఆయన్ను సూపర్ స్టార్ అనీ, తలైవా (నాయకుడు) అనీ పిలుచుకుంటుంటారు. ఇప్పుడు మలేసియాలోని ఆయన అభిమానులు రజనీకి మరో బిరుదు రావాలనుకుంటున్నారు. ఆ బిరుదు పేరు ‘డటుక్’. ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా? మలేసియన్ ప్రభుత్వం ఇచ్చే గౌరవ బిరుదు ఇది. ఏదైనా రంగంలో విశిష్ట కృషి చేసినవారికి ఈ బిరుదు ఇస్తుంటారు. సినీ కళాకారుల్లో ఇప్పటివరకూ ఈ బిరుదు హాలీవుడ్ నటుడు జాకీచాన్, నటి మిచెల్లీ యో, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌లకు మాత్రమే దక్కింది.

 ఈ బిరుదు అందుకునే అర్హత తమ నాయకుడికి పూర్తిగా ఉందని రజనీకాంత్ అభిమానులు భావిస్తున్నారు. దీనికోసం సంతకాల సేకరణ మొదలుపెట్టారు. మలేసియన్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని ఆన్‌లైన్ ద్వారా తీసుకెళుతున్నారు. ఈ సామాజిక మాధ్యమం ద్వారా రజనీ అభిమానులు ఆ ప్రభుత్వాన్ని తమ నాయకుడికి ‘డటుక్’ బిరుదు ఇవ్వాల్సిందిగా కోరవచ్చు. ‘‘ఈ గౌరవ బిరుదు జాకీచాన్‌కి దక్కింది. ఇది దక్కించుకునే అర్హత మా నాయకుడిగా మెండుగా ఉంది’’ అని రజనీ అభిమానులు అంటున్నారు. ఇతర దేశాలతో పోల్చితే మలేసియాలో రజనీకి అభిమానులు ఎక్కువ అనీ, అందుకని ఆ ప్రభుత్వం ఈ బిరుదుని ఆయనకు ఇస్తే బాగుంటుందని ఇక్కడి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ డటుక్ అంటే ఏంటో తెలుసా? ‘నాయకులకే నాయకుడు’ అని అర్థమట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement