స్వరూప్ ఆర్.ఎస్.జె.
‘‘డిటెక్టివ్ జానర్‌లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తెలుగులో ఈ జానర్‌లో సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు. దాంతో డిటెక్టివ్ థ్రిల్లర్ చేశాను’’ అని స్వరూప్ ఆర్.ఎస్.జె. అన్నారు. నవీన్ పొలిశెట్టి, శృతీశర్మ జంటగా స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. నవీన్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా స్వరూప్ పంచుకున్న విశేషాలు...
► చిరంజీవిగారి ‘చంటబ్బాయి’ చిత్రం ఓ క్లాసిక్. డిటెక్టివ్ జానర్ కాబట్టి ఆ సినిమా ప్రభావం కొంచెం ఉంది. కానీ, చంటబ్బాయికి, మా ఆత్రేయకు ఎటువంటి సంబంధం లేదు. మా సినిమాలో ఓ ఆసక్తికరమైన అంశం ఉంది. అది సినిమా చూసే తెలుసుకోవాలి. ఒక్క కేసు కూడా తన దగ్గరకు రాని ఓ డిటెక్టివ్ ఓ పెద్ద కేస్ టేకప్ చేసి, ఎలా డీల్ చేశాడన్నది చిత్ర కథ. కథను కొంచెం రివీల్ చేసినా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ అవుతాయని చేయడం లేదు.
► ఈ కథ రాస్తున్నప్పుడే కొత్త హీరో అయితే బావుంటుంది అనుకున్నాను. ఆ సమయంలో నవీన్ యూట్యూబ్ వీడియోస్ కొన్ని చూశాను. తన టైమింగ్ బాగా నచ్చింది. సుమారు 7–8 నెలలు స్క్రిప్ట్‌పై కలసి వర్క్ చేశాం. స్క్రిప్ట్‌లో తన హెల్ప్ చాలా ఉంది. స్క్రిప్ట్ కుదిరాకే నిర్మాతలను కలిశాము.
► హీరోహీరోయిన్ ఇద్దరూ బాగా చేశారు. మొదట మా సినిమాకు ‘గూఢచారి’ అని టైటిల్ పెట్టాలనుకున్నాం. అది అప్పటికే వచ్చేయడంతో టైటిల్ కొత్తగా, తెలుగులోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇలాంటి టైటిల్ పెడితే సినిమాకు ఎవరు వస్తారు? అని కూడా అన్నారు. అందుకే మా సినిమా టైటిల్ మీద మేమే ఫన్నీ వీడియోస్ చేశాం.
► ఈ సినిమా తర్వాత ఏం సినిమా చేయాలో ఇంకా అనుకోలేదు. కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏ సినిమా చేసినా కామెడీ, థ్రిల్లర్ అంశాలు కచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అవే నా బలం.
Comments
Please login to add a commentAdd a comment