
నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆహుతి ప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరు. ఆయన అసలు పేరు అడుసుమిల్లి జనార్దన్ వర ప్రసాద్. ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమా ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. ఆహుతి చిత్రంతో మంచి పేరు రావడంతో ఆయన పేరు ఆహుతి ప్రసాద్గా స్థిరపడింది. ఆయన 122 సినిమాల్లో నటించారు. గులాబీ, నిన్నే పెళ్లాడుతా, చందమామ, జయం మనదేరా తదితర చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్, హస్య నటుడిగా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. 2002, 2007 సంవత్సరాల్లో ఆయన నంది అవార్డు అందుకున్నారు. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.